హైదరాబాద్ వారసత్వానికి ఆభరణంగా నిలిచిన 150 ఏళ్ల నాటి నాంపల్లి బాగ్-ఏ-ఆమ్ (పబ్లిక్ గార్డెన్) చెరువు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఈ చెరువు కాలుష్యంతో నిండిపోయి, గ్రీన్ అల్గాతో నీరు పచ్చగా మారి, చెడిపోతుంది. చెరువులోకి మళ్లించిన మురుగు నీరు, కాలుష్య కారణంగా ఈ స్థితి ఏర్పడిరది. ఈ పరిస్థితి చెరువును మాత్రమే కాదు, వాతావరణ స్థిరత్వానికి, జీవ వైవిధ్యానికి, ప్రజారోగ్యానికి కూడా పెద్ద ముప్పును కలిగిస్తోంది. వర్షపు నీటిని సేకరించడం వంటి స్థిరమైన పరిష్కారం ఈ చారిత్రాత్మక చెరువును పునరుద్ధరించగలదు. వర్షపు నీటిని చెరువులోకి మళ్లించడం ద్వారా వేసవి కాలంలో ఇది ఎండిపోకుండా నిలిపి ఉంచవొచ్చు. ఇలాంటి చర్యలు భూగర్భ జలాలను నింపడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం, బయట నుంచి నీటి ఆధారాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ వంటి హైదారాబాద్ అధికార సంస్థలు ఈ చవుక మరియు పర్యావరణానికి అనుకూలమైన పరిష్కారాన్ని వెంటనే అమలు చేయాలి.
ప్రస్తుతం చెరువులో నెలకొన్న పరిస్థితి వేసవిలో ఇక్కడ ఆశ్రయించే వలస పక్షులకు కూడా ముప్పుగా మారింది. ఈ పక్షులు పర్యావరణ సమతౌల్యం లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి తగ్గిపోవడం జీవ వైవిధ్యం నష్టాన్ని సూచిస్తోంది. అదనంగా, పబ్లిక్ గార్డెన్‌కు ప్రతి రోజు వెళ్లే 5,000 మందికిపైగా నడిచే వారు, సందర్శకులు, ఎమ్మెల్సీలు కలుషిత గాలి మరియు నిల్వ నీటితో కలిగే ఆరోగ్య ముప్పులను ఎదుర్కొంటున్నారు. చెరువును నిర్లక్ష్యం చేయడం స్థానిక వాతావరణ మార్పుల ప్రభావాలను కూడా వేగవంతం చేస్తోంది, ఉదాహరణకు ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణం సమతుల్యత దెబ్బతినడం. వర్షపు నీటిని సేకరించడం ద్వారా చెరువును పునరుద్ధరించడం వల్ల ఈ సవాళ్లను అధిగమించవచ్చు.
మురుగు నీటిని దారి మళ్లించడానికి శుభ్రపరిచే వ్యవస్థలను ఏర్పాటు చేయడం, వర్షపు నీటి రీఛార్జ్ పిట్స్ నిర్మించడం మరియు క్రమం తప్పకుండ పర్యవేక్షించడం అవసరం. పబ్లిక్ గార్డెన్ చెరువు హైదరాబాద్ వారసత్వం మరియు పర్యావరణానికి ఒక ముఖ్యమైన భాగం. దీన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హైదారాబాద్‌కు చెందిన పర్యావరణ, సామాజిక కార్యకర్త మహ్మద్ ఆబిద్ అలీ చెప్పారు.