ఈనెల 14నఫేజ్-2 కింద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు
అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం..
పిల్లల్లో నైపుణ్యాల పెంపునకు స్కిల్ యూనివర్సిటీ
విద్యార్థులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుంచి మహాత్మా జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని, అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని, 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. దేశ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, వొచ్చే అకడమిక్ ఇయర్ లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.