మోదీపై రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం..

  • కాంగ్రెస పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసే సత్తా ఆయనకు లేదు..
  • అలాంటి వ్యక్తికి మోదీని విమర్శించే హక్కు ఎక్కడిది? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని,తమ కారణంగానే అది జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పై 140 కోట్ల మంది ప్రజల విశ్వాసం ఉందని, కానీ.. పార్లమెంటును, స్పీకర్ వ్యవస్థను అగౌరవ పరుస్తూ.. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను అగౌరవపరచడం, ఇండియన్ ఆర్మీ లాంటి సున్నితమైన వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తడం, దేశ వ్యతిరేక శక్తులతో దోస్తీ చేయడం, ఓట్లకోసం కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించడం రాహుల్ గాంధీకి నిత్యకృత్యం అయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత మూడు ఎన్నికల్లో సాధించిన సీట్ల సంఖ్యను కలుపుకున్నా.. బీజేపీ గెలిచిన సీట్లకంటే తక్కువేనని, 2024 ఎన్నికల్లో వారి కూటమి మొత్తం కలిసి గెలిచిన సీట్లకంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడుసార్లు డబల్ డిజిట్ కే పరిమితమైందని, అయినా రాహుల్ గాంధీ మాత్రం యథేచ్ఛగా అబద్ధాలు ఆడుతూ.. అర్థంలేని విమర్శలు చేస్తూనే ఉన్నాదని దుయ్యబట్టారు.

140 కోట్ల మంది భారతీయుల సంపూర్ణ విశ్వాసాన్ని పొందినందునే పార్లమెంటులో మెజారిటీ సీట్లతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారన్నారు. కరోనా సమయంలో యావత్ ప్రపంచం విలవిల్లాడుతుంటే.. 140 కోట్ల జనాభా గల భారత దేశాన్ని కాపాడే బాధ్యతను భుజాన వేసుకుని మరీ.. అన్ని వర్గాలకు అండగా నిలబడ్డారని కొనియాడారు. దేశ వైజ్ఞానిక సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి, ప్రయివేటు పరిశోధన కేంద్రాలను కూడా భాగస్వాములను చేస్తూ.. రూపొందించిన వ్యాక్సిన్ తో ప్రజల ప్రాణాలు కాపాడి యావత్ ప్రపంచం లోనే ఔరా అనిపించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. దేశం ఆపదను ఎదుర్కొనబోతోందన్న ప్రతిసందర్భంలో మోదీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి కారణం. ప్రజలకు ఆయనపై ఉన్న అచంచల విశ్వాసమే ప్రధాని మోదీకి ఉన్న ఆత్మవిశ్వాసం. ఒక్క భారత్ లోనే కాదు.. యావత్ ప్రపంచానికీ మోదీపై విశ్వాసం ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపి భారతీయులను మన దేశానికి భద్రంగా తీసుకొచ్చే సాహసం, విశ్వాసం, ధైర్యం, శక్తి ఒక్క మోదీకే సాధ్యం అని ప్రపంచమంతా కొనియాడింది.

క్వాడ్ సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా సంస్థ భారతీయ కంపెనీలు ఉత్పత్తి చేయనున్న ‘చిప్’లపై సంపూర్ణ నమ్మకాన్ని వ్యక్తం చేయడమే మోదీపై యావత్ ప్రపంచానికి ఉన్న గౌరవానికి, విశ్వాసానికి నిదర్శనం. ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే సత్తాలేక, చేతులెత్తేసి రాజీనామా చేసి విదేశాలకు వెళ్లి దాక్కున్న వ్యక్తికి మోదీ విశ్వాసం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. జమ్మూకశ్మీర్ లో విజయంపై నమ్మకం లేకనే.. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ.. దేశవ్యతిరేక శక్తులతో జతకట్టారు. కాంగ్రెస్ పార్టీ మిత్రుడైన ఓమర్ అబ్దుల్లాకు ఒకచోటి నుంచి గెలుస్తాననే నమ్మకం లేకనే.. రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు. జమ్మూకశ్మీర్ ఎన్నికలు అవుతుంటే ప్రచారానికి రావడానికి వెనుకంజ వేసిన రాహుల్ గాంధీ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం గురివింద గింజ సామెతను గుర్తుచేస్తోంది.

విదేశీ గడ్డపై భారతదేశ గౌరవ, మర్యాదలకు అవమానం కలిగించే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వాళ్లే నమ్మడం లేదు. ప్రధాని మోదీ ఆత్మవిశ్వాసం తగ్గిందా? పెరిగిందా? గత 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు స్పష్టం చేస్తాయి. తెలివి ఉంటే, రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన ఉంటే.. నేను పంపిస్తున్న వందరోజుల నిర్ణయాలను చదివి, ఆ తర్వాత మాట్లాడాలి. గత 20 ఏళ్లుగా.. ప్రధానమంత్రి పీఠంపై కూర్చోవాలని రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నాడు. వరుసగా 3 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి, నైతిక విలువలు వదిలిపెట్టి కులాలు, మతాల మధ్య, రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూ దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. భవిష్యత్తులో దేశ ప్రజలే సరైన బుద్ధి చెబుతారు. దేశ, విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచుతూ దేశాభివృద్ధికి అన్నిరకాలుగా కృషిచేస్తూ నీతి, నిజాయితీలతో పరిపాలన కొనసాగిస్తూ.. నిస్వార్థంగా.. పనిచేస్తున్న మోదీ గారిమీద విమర్శలు చేసే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు అని కిషన్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page