సమాచార హక్కు చట్టం- మహిళల పాత్ర

2005లో చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సమాచార హక్కు కమిషనర్ల నియామకాల్లో మహిళల వాటా కేవలం 9 శాతం. గత ఏడాది వరకు చేసిన అధ్యయనం ప్రకారం 12 రాష్ట్రాల్లో అంటే 40 శాతం కమిషన్లలో ఒక్కసారి కూడా మహిళా సమాచార హక్కు కమిషనర్ ను నియమించలేదని తేలింది. ఇక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా అవకాశాల్లో 95 శాతం వాటా పురుషులకే ఇచ్చాయి ప్రభుత్వాలు. మహిళలకు అందిన అవకాశాలు కేవలం 5 శాతమే అని ఈ అధ్యయనం తేల్చింది. ఇది ఒక కోణం. మరోవైపు సమాచార హక్కును ఉపయోగించుకుంటున్న వారిలో కూడా మహిళల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది.

 

రెహానా బేగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్

ముందుగా సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా ప్రజాస్వామికవాదులందరికీ శుభాకాంక్షలు. మన దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి సరిగ్గా 19 ఏళ్లు. 2005 అక్టోబరు 12 నుంచి మన దేశంలో పూర్తి స్థాయిలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. అంతకు ముందు ఉన్న ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 స్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకుని వచ్చారు. దీని వెనుక అన్నాహజారే లాంటి చాలా మంది సామాజిక ఉద్యమకారుల పోరాటాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1946లో సమాచార హక్కును ప్రాధమిక మానవ హక్కుగా గుర్తించిన తర్వాత చాలా దేశాలు సమాచార హక్కు చట్టాలను రూపొందించటం మొదలు పెట్టాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2019 నాటికి ప్రపంచంలో 125 దేశాలు తమ పౌరులకు సమాచారాన్ని ఒక హక్కుగా చట్టం రూపంలో అమల్లోకి తీసుకుని వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచటం తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయటం ఈ చట్టం మౌలిక ఉద్దేశం, అదే సమయంలో ప్రభుత్వ పని తీరు పై సమాచారం తెలుసుకునే అవకాశం పొందటం ద్వారా ప్రజలకు మరింత సాధికారత లభిస్తుంది. పాలనా ప్రక్రియలో వారి భాగస్వామం ఉంటుంది.

    ఈ చట్టం ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత అయితే…సమాచారాన్ని పొందటం ప్రజలకు హక్కు. సమాచార హక్కు చట్టానికి రెండు వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మొట్టమొదటి సారి 1776లో స్వీడన్ దేశం తమ రాజ్యాంగంలో సమాచార హక్కును పొందుపరిచి తమ లక్ష్యం పారదర్శక పాలన అని స్పష్టం చేసింది. ఆ తర్వాత 1951లో ఫిన్లాండ్, 1966లో అమెరికా, 1970లో నార్వ , డెన్మార్ దేశాలు, 1978లో ఫ్రాన్స్, 1982లో కెనడా సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చాయి. ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని హక్కుగా ప్రజలకు అందించటం కీలకమైన ముందడుగు అనే చెప్పాలి. అయితే ఈ క్రమంలో మహిళల పాత్ర, ప్రాతినిధ్యం, వాళ్లకు అందుతున్న అవకాశాలు ఎంత అన్న చర్చ ఇప్పుడు కీలకమైంది.
     మన దేశంలో సమాచార హక్కు ఉద్యమంలో మహిళల ప్రాతినిధ్యం అనగానే ముందుగా వినిపించే పేరు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి అరుణా రాయ్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కు రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పేదలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన సమస్యలు, హక్కుల పై పోరాటాలు చేశారు. నేషనల్ క్యాంపైన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (NCPRI) ద్వారా సమాచార హక్కు ఉద్యమానికి బాటలు వేశారు. అరుణా రాయ్ లాంటి కొందరు మహిళా ఉద్యమకారుల పోరాటం, స్పూర్తి ఉన్నా…క్షేత్ర స్థాయిలో మాత్రం ఆర్టీఐ అమలు తీరులో మహిళలకు అందుతున్న అవకాశాలు నిరాశాజనకంగా ఉన్నాయి. సతర్క్ నాగరిక్ సంఘటన్ అనే సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ కార్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ 2022-23లో పొందుపరిచిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2005లో చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సమాచార హక్కు కమిషనర్ల నియామకాల్లో మహిళల వాటా కేవలం 9 శాతం. గత ఏడాది వరకు చేసిన అధ్యయనం ప్రకారం 12 రాష్ట్రాల్లో అంటే 40 శాతం కమిషన్లలో ఒక్కసారి కూడా మహిళా సమాచార హక్కు కమిషనర్ ను నియమించలేదని తేలింది.
ఇక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా అవకాశాల్లో 95 శాతం వాటా పురుషులకే ఇచ్చాయి ప్రభుత్వాలు. మహిళలకు అందిన అవకాశాలు కేవలం 5 శాతమే అని ఈ అధ్యయనం తేల్చింది. ఇది ఒక కోణం. మరోవైపు సమాచార హక్కును ఉపయోగించుకుంటున్న వారిలో కూడా మహిళల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. సమాజంలో వేళ్లూనుకుని పోయిన మహిళపట్ల వివక్షకు ఇది ఒక నిలువుటద్దం. ఆర్టీఐ కింద వచ్చే అప్పీల్స్, ఫిర్యాదులు చూస్తే మహిళల వేసేవి నూటికి ఒక్కటి, కోటికి ఒక్కటి అన్నట్లు పరిస్థితి ఉంటోంది. ఆ ఒకటి అరా దరఖాస్తుల్లో కూడా వారి పేరు పై కుమారులో, దగ్గరివారో వేసేవి సగం ఉంటాయి. దీనికి కారణం ఏంటన్న చర్చ సమాజంలో విస్తృతంగా జరగాలి. ఉద్యోగం, ఉపాధికి తోడు ఇంటి పనులు, పిల్లల పెంపకం బాధ్యతలు కూడా మహిళల పైనే ఉండటం ఒక అంశం. మరోవైపు ఆధునిక మహిళల్లో సైతం సమాచార హక్కు పై మరింత చైతన్యం రావాల్సి ఉంది. మహిళా సమాచార హక్కు కార్యకర్తల సంఖ్య పెరగాల్సి ఉంది. సమాచార హక్కు పై అవగాహన, చైతన్యం మహిళల్లో పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాలనలో, హక్కుల్లో మహిళలకు సగం వాటా ఉన్నప్పుడే ఏ సమాజం అయినా, ఏ ప్రజాస్వామ్యం అయినా పరిఢవిల్లుతుంది. ఈ దిశగా ప్రభుత్వాలు, సంస్థలు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామివాదులు కృషి చేస్తారని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page