బాబా మా సాయిబాబా

ఎవరేమై పోతే మనకెందుకు?
మనకోసం బ్రతుకునంతా
బలిచేసినందుకు
అధికారం అసహనంతో
పాశవికంగా జైలుగోడల నడుమ ఊపిరాడకుండా చేసినా
ప్రజల గొంతుకై ప్రాణంగా నిలిచి
ప్రశ్నిస్తూ పడుతూ లేస్తూ
కదలలేని కాళ్ళతో
చక్రాల బండికి పరిమితమైనా
తన మాటలతో లక్షలాది మెదళ్ళను
జాగృతం చేసిన వాడు
అన్యాయంగా దుర్మార్గంగా
పదేళ్లు అండా సెల్ నరకాన్ని
చిరునవ్వులతో భరిస్తూ
రేపటి ఉదయాన్ని కలగంటూ
కనురెప్పలు వాల్చేసిన వాడు
లేకుండా పోతే…మాకేంటి ?

మేమూ మాఇల్లు పిల్లలు
మా సంపాదన మా సౌఖ్యాలు
అన్నీ సజావుగా ఉంటే చాలనుకునే
భద్రతలేని మా బ్రతుకులు
పేకమేడలని తెలుసుకోలేక
మా బుర్రలు మతం బురదలో కూరుకుపోతూ
మా నుదుట  అజ్ఞానం భయాల విభూతులతో
ఊగిపోతూ ఊరేగుతూనే ఉంటాం

చలనం లేని శరీరుడివైనా
శరాల్లాంటి ప్రశ్నలతో
నిజాన్ని నిగ్గుతీస్తూ
పిరికి దుష్ట రాజ్యాన్ని
వణికించిన కలం యోధుడివి

అమ్మకు చదువు రాకున్నా
చదువే ప్రపంచాన విలువనిస్తుందని
అవిటి కొడుకును తలెత్తుకునేలా
చేస్తుందని కలలు కని
కడుపు కట్టుకుని మట్టి చేతుల్లో
అపురూపంగా తనను పెంచినందుకు
పల్లెటూరి నుండి మొదలైన
ప్రశ్నల ప్రస్థానం
దేశం రాజధాని నడిబొడ్డున
స్వేచ్ఛా పతాకమై అజేయంగా
రెపరెప లాడిస్తున్నందుకు
కుట్ర కేసంటూ కుట్రలు పన్ని
ఎన్నాళ్లుగానో చీకటి కొట్టులో
బందీని చేసి గొంతు నులమాలనుకున్నా
మొక్కవోక నీవు వెలిగించిన
లక్షల కాగడాలు ఊరేగింపుగా
కదలి వచ్చి కాల్చేస్తాయని జడిసి
దేహాన్ని తూట్లు పొడిచి
నిర్దోషంటూ నిద్రలేచిన
న్యాయం విడుదల చేస్తే
స్వేచ్ఛా గాలులు పీల్చకముందే
ఊపిరి వదిలితే
నీ మృత దేహాన్ని దేశం కోసం
త్యాగం చేసిన అమరుడివి

నీవు లేవు కానీ
నీ మాటలు నీ రాతలు
నీ ఆచరణ నీ పోరాటం
అందుకున్న అభిమానుల గుండెల్లో
వెలుగు కోసం నిరీక్షించే
వేలాది హృదయాలలో
రగులుతూనే ఉంది
నీ అంతిమ యాత్ర సాక్షిగా
కదలి వచ్చిన జనసంద్రం
ఆనగా నీవు కలగన్న
నవజగతి సాకారమవుతందిలే
బాబా మా సాయి బాబా
నీకివే మా అరుణారుణ జోహార్లు !
( కామ్రేడ్ సాయిబాబా స్మృతిలో )
 -డా. కె. దివాకరా చారి
Cell: 9391018972

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page