సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 10: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సిద్ధిపేట చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ధిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు తేలు సత్యం(48) రెండో భార్య శిరీష, కుమారుడు అద్వేష్ నంద (8), త్రివర్ణ హాసిని(6) కలిసి సిద్ధిపేట పట్టణంలోని నెహ్రూ పార్క్ వాసవీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యం మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా, 2016లో తేలు సత్యం శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి అద్వేష్ నంద, త్రివర్ణ హాసిని జన్మించారు. తేలు సత్యం తన సోదరుడు తేలు శ్రీనివాస్‌ను చదివించి బాగోగులు చూసుకున్నాడు. అయితే సత్యం అనారోగ్యానికి గురి కాగా తన తమ్ముడి నుంచి తనకు రావలసిన డబ్బులు,ఇంటి విషయంలో గొడవలు జరిగాయి. తను ఇచ్చిన డబ్బులు రూ.5.50 లక్షలు ఇవ్వాలని సత్యం ఇటీవల అడుగగా శ్రీనివాస్.. సత్యంన తీవ్రంగా దూషించి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సత్యం శనివారం బయటకు వెళ్లొస్తానని చెప్పి సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుంచి తన ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రి 9 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తన భర్త శిరీష, పిల్లల గురించి వెతకగా ఆదివారం తెల్లవారుజామున చింతలచెరువు కట్ట వద్ద తన భర్త టూ వీలర్, ఫోన్ కనిపించింది. తన ఫోన్లో తన భర్త, ఇద్దరు పిల్లలు చెరువులో పడి మరణించడానికి గల కారణాన్ని వివరిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. . అలాగే సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. కాగా శిరీష తన భర్త మరణానికి తన మరిది శ్రీనివాస్ కారణమని శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యంతో పాటు అభంశుభం తెలియని చిన్నారులు విగతజీవులుగా మారడం చూసి సత్యం కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.