ప్రాజెక్ట్ పూర్తి అయితే సాగులోకి 3.28 లక్షల కొత్త ఆయకట్టు
అదనంగా 1.16 లక్షలకు సాగునీరు
ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పై ప్రభుత్వం చేసిన వ్యయం 6,401.95 కోట్లు
సీతారామ లిఫ్ట్ నిర్మాణంపై జలసౌద లో సమీక్ష _
పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రావు లు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహాబుబాద్ జిల్లాలో సాగు నీరు,త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించబడిన సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టు ను వేగవంతంగా పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అవసరమైన భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే టీం లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సీతారాం లిఫ్టు ప్రాజెక్ట్ నిర్మాణపు పనులపై శనివారం రోజున ఎర్రమంజిల్ కాలనీ లోని జలసౌదలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ యన్ సి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జులై 2025 లక్ష్యంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అన్నారు.
అందుకు గాను అవసరమైన భూసేకరణకు గాను ప్రత్యేకంగా సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి గాను 6,234.91 ఎకరాల భూమికి సేకరించి నట్లు ఆయన వివరించారు. ఇంకా సేకరించాల్సింది 993 ఎకరాలు ఉందన్నారు. అందు కోసం సత్వరమే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే 3.28 లక్షల కొత్త ఆయాకట్టు సేద్యంలోకి వొస్తుందన్నారు. 550 చెరువులకు సమృద్ధిగా నీరు చేరుతుందన్నారు. తద్వారా అదనంగా మరో 1.16 లక్షల ఏకరాలు సేద్యంలోకి వొస్తుందన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పై 6,401.95 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు. యుద్దప్రాతి పదికన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.