విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కన్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోందని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహిస్తున్నామని, వొచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది.ఉన్నత చదువులు చదివి భవిష్యత్ లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని… పరిపాలనలో భాగస్వాములు కావాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలని, 14 నవంబర్ న 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదే రోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.