మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కృషి 

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్24: రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం బషీర్ బాగ్ లోని దేషోద్దారక భవన్లో జరిగిన మహిళా జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మీడియా రంగంలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల కోసం, వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టంలో ప్రత్యేక సౌకర్యాలు, రక్షణ కల్పించాలనే అమెండ్మెంట్స్ ఉన్నాయని, వాటిని యాజమాన్యాలు ఎంతవరకు అమలు పర్చతున్నారనే విషయంలో ఆరాతీస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల్లో, మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక కోటా కోసం కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు.

అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా, వృత్తిలో సీనియారిటీ ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మీడియా సంస్థల్లో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ఐక్యమై, వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నట్లుగా, మహిళా జర్నలిస్టులు కూడా సంఘటితంగా ముందుకురావాలని ఆయన సూచించారు. త్వరలో హైదరాబాద్ వేదికగా, జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ నిర్వహించేందుకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల భద్రతా, సంక్షేమం కోసం తమ సంఘం ఎంతో కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే వారిని ఏకం చేసి, హక్కుల సాధన కోసం పోరాటాల్ని మరింత ఉదృతం చేసేందుకు గాను తమ సంఘంలో మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళ్యాణం రాజేశ్వరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, మహిళా విభాగం కన్వీనర్ పొట్లపల్లి స్వరూప, సభ్యులు యశోదా, సాజీదా బేగం, తరుణి, ప్రతిభలతో పాటు పలువురు మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page