నీవు  ఉన్నావనే అనుకుంటా…

నీవు ఉన్నావో లేదో తెలియదు
ఏ ఎదురు కాల్పుల్లోనో
ఎంతోమంది మరణించారని తెలిపినపుడు
ఏ పేపర్లోనూ ఎవరి పేరూ లేదని,
నీవు ఇంకా ఉంటావనే అనుకుంటా!
గుర్తించినవి బంధువులింటికిపోగా
గుర్తెరగనివి గుట్టగా పూడ్చేసినా కూడా
నీవు ఇంకా ఉన్నావనే అనుకుంటా

ఏ కొండల మాటునో
మెరుపులు మెరిసినప్పుడు
ఏ మబ్బుల చాటునో
ఉరుములు ఉరిమినప్పుడు
చీకటి బతుకుల్లో వెలుగులకై
పోరాడుతున్నావేమోనని…
నీవు ఉన్నావనే బలంగా నమ్ముతుంటా

కాలాలు ఎన్ని కొత్తాకులు తొడిగినా
కుర్చీల దాష్టికానికి ఎంత నెత్తుర్లు పారినా
ఏమైపోయున్నాగానీ…
నీవింకా  గూడెం బతుకుల కోసం
ఇప్పటికీ ఉంటావనే అనుకుంటున్నా
ఎందుకంటే..
ఇంకా.. ఇక్కడ ఆకలిదే రాజ్యం కాబట్టి!

… వినోద్‌ కుత్తుం 
9634314502

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page