నల్లధనంపై ప్రభుత్వ మాటలన్నీ నీటి మూటలేనా..?

  • నల్లధనం మూలాలను కదిలిస్తే ..లక్షల కోట్ల నిధుల అవినీతి పొదలు  
  •  ఫాస్టు ట్రాక్‌ కోర్టుల ఏర్పాటులో మౌనం ఎందుకు?

ఏ దేశం అయినా ప్రగతి సాధించి ముందడుగు వేయాలంటే వివిధ రంగాల్లో అభివృద్ధి జరగాలి. అందుకు పెట్టుబడులు కావాలి, ప్రభుత్వం వద్ద ఉన్న నగదు అంతా పన్నుల రూపేణా వసూలు చేసిందే. అంటే దేశం నడవాలంటే ప్రజలు అంతా తమ వంతుగా ఏదో ఒక రూపంలో పన్నులు కట్టాల్సిందే. ప్రపంచంలోనే పన్ను విధానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో ఆదాయపన్ను శాఖ ఆవిర్భవించిన తర్వాత పన్ను విధానంలో క్రమబద్దీకరణ వచ్చింది. కొద్ది మంది ధనవంతుల నుండే కాకుండా మధ్య తరగతి, ఎగువ తరగతి ప్రజల నుండి కూడా పలు రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుస్తున్నారు. పన్నులు స్థూలంగా రెండు రూపాల్లో వసూలు చేస్తారు. అందులో మొదటిది ప్రత్యక్ష పన్నులు, రెండోది పరోక్ష పన్నులు. ఆదాయపన్ను అనేది ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తుంది. వివిధ రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి పన్నులన్నీ కలిపి ఒకే దేశం -ఒకే పన్ను పేరుతో అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరోక్ష పన్నుల పరిధిలోకి వస్తుంది. ఈ రెండు రకాలే కాకుండా కొన్ని వస్తువులపై తృతీయ మార్గంగా పన్నులు ఉండగా, అస్సలు పన్ను లేని వస్తువులు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ నియమనిబంధనలు, మార్గాలు, జరిమానాలు, అప్పీళ్లు, శిక్షలు, న్యాయ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నా ఎవరికీ తెలియని మరో ఆదాయ రూపం నల్లధనం.

 

ఆర్థిక పరిభాషలో నల్లధనానికి కచ్చితమైన నిర్వచనం ఏమీ లేదు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ నిర్వచనం ప్రకారం పన్నులు చెల్లించకుండా ఉన్న ఆదాయం ఆస్తులు గడిరచి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పకుండా పన్నులు చెల్లించనపుడు లేదా ఆ ఆస్తులను సమకూర్చుకున్న తర్వాత వాటికి పన్నులు చెల్లించి నల్లధనాన్ని అసలు ఆస్తులుగా మార్చుకున్నపుడు జరిగే ప్రక్రియ అంతా నల్లధనంగానే చెప్పవొచ్చు. దేశంలో వివిధ రాజ్యాంగ వ్యవస్థల మధ్య అపవిత్ర సంబంధానికి నల్లధనం ఒక కారణమని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నియమించిన కమిటీ పేర్కొంది. నల్లధనం రెండు రకాలు – ఒకటి చట్టబద్ధమైన కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆదాయానికి ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా పన్నులు కట్టకపోవడం. నేరపూరిత కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆదాయం, ప్రభుత్వాలకు పన్నులు ఎగవేయ డం కోసం ఆదాయాన్ని చూపకుండా ఉండటం రెండో మార్గం. ఈ కారణంగానే పన్నులను ఎగవేస్తూ తమ ఆదాయాన్ని కొంత మంది గుప్తంగా ఉంచుతున్నారు. అది భారతదేశంలో సాధ్యం కాకపోవడంతో వేరే దేశాల్లో ఈ నిధులను వివిధ రూపాల్లో తరలించి అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు.

దీనిపై గత 50 ఏళ్లుగా చర్చ జరుగుతున్నా స్పష్టమైన విధానం లేకపోవడంతో ఎప్పటికపుడు అది ఆర్థిక బేహారులకు వరంగా మారుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ‘నల్లధనం (వెల్లడిరచని విదేశీ ఆదాయం , సంపద) మరియు పన్ను విధింపు చట్టం -2015ను అదే ఏడాది జూలై 1వ తేదీ నుండి అమలులోకి తీసుకువచ్చింది. వాస్తవానికి ఈ చట్టం 2016 ఏప్రిల్‌లో రూపొందింది. కానీ దానిని జూలై 2015 నుండి కేంద్ర ప్రభుత్వం వర్తింపచేసింది. ఏడు చాప్టర్లు, 88 సెక్షన్లతో ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించారు. చట్టం అమలులోకి రాగానే ధనవంతులు అందరికీ ఆదాయపన్ను శాఖ ప్రత్యేక విండో ఏర్పాటు చేస్తూ నిరభ్యంతరంగా తమ ఆదాయాన్ని వెల్లడిరచే అవకాశం కల్పించింది. దాంతో 648 మంది వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ ఆదాయాన్ని ప్రకటించారు. దాని ప్రకారం అప్పటి వరకూ వారు వ్యక్తం చేయని ఆదాయం 4100 కోట్లు. ఎలాంటి న్యాయవివాదాలు లేకుండా వారి నుండి ఆదాయపన్నుశాఖ 2470 కోట్ల రూపాయలను రాబట్టింది. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఇంటిలిజెన్స్‌ బ్యూరో, ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ, ఫైనాన్సియల్‌ ఇంటిలిజెన్స్‌ యూనిట్‌, రీసెర్చి అండ్‌ అనాలిసిస్‌ సంస్థలు సంయుక్తంగా నల్లధనం వ్యవహారం నిగ్గుతేల్చేందుకు పనిచేస్తున్నాయి. దేశంలో నల్లధనం 54 లక్షల కోట్లు, విదేశాల్లో 11.55 లక్షల కోట్లు ఉంటుందని ఒక అంచనా. అంటే నల్లధనం మూలాలను కదిలిస్తే 65 లక్షల కోట్లు నిధుల అవినీతి పొదలు కదులుతాయి.

దేశవ్యాప్తంగా ప్రజల నుండి సీబీడీటీకి దాదాపు 40వేల ఫిర్యాదులు వొచ్చాయి. సీబీఐ ఇప్పటికే ఈ తరహా 8వేల కేసులను దర్యాప్తు చేస్తోంది. కస్టమ్స్‌ శాఖ 4వేల కేసులు, ఎన్‌ఫోర్సుమెంట్‌ శాఖ వెయ్యి కేసులను దర్యాప్తు చేస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న న్యాయస్థానాల్లో విచారణ జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అందరికీ తెలిసిందే. వీటిపై ఫాస్టు ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని గత కొద్దికాలంగా సీబీడీటీ కోరుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తూ వస్తోంది. నల్లధనాన్ని కూడబెట్టే చర్యలను నిరోధించే అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం పీఎంఎల్‌ఏ సవరణ బిల్లును రూపొందించింది. నల్లధనం కూడబెట్టడాన్ని నేరంగా పరిగణించి ఈ నేరారోపణలపై నమోదయ్యే కేసుల్లో ఆ సొమ్మును లేదా దానితో కొనుగోలు చేసిన ఆస్తులను విచారణ సమయంలో స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించిది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్ఫోర్సులో భారతదేశం కూడా భాగస్వామిగా ఉండటం వల్ల ఈ సవరణ చేసింది. 2002లో రూపొందించిన ఈ చట్టాన్ని 2005, 2009 సంవత్సరాల్లో కూడా సవరించారు. అయితే 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం నల్లధనం అంశాన్ని కీలకంగా తీసుకుని సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చింది. 500 నోట్లు, వెయ్యి నోట్లు రద్దు చేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం దేశంలో పెనుసంచలనమే అయ్యింది.

అవినీతి, అక్రమాలపై ఆధారపడ్డ వ్యవస్థలు, వ్యక్తులు ఈ నిర్ణయంతో కుప్పకూలారు. చట్టవ్యతిరేకంగా లక్షల కోట్ల రూపాయలను నిల్వచేస్తూ అక్రమ మార్గాల్లో తరలిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికీ, ప్రజాస్వామ్యానికీ విలువ లేకుండా చేస్తున్న నల్లధన బకాసురుల నగ్నస్వరూపం దేశ ప్రజలకు బట్టబయలైంది. అవినీతి- నల్లధనం- ఉగ్రవాదానికి ఎవరికీ కనిపించకుండా ఉన్న అక్రమ బంధం వెలుగుచూసింది. జన్‌ధన్‌ యోజన పథకం కింద బ్యాంకు అకౌంట్లు ప్రారంభం కావడమే గాక, దాదాపు 45వేల కోట్ల రూపాల నగదు తిరిగి బ్యాంకులకు చేరింది. దేశంలోనూ, బయట దేశాల్లోనూ పేరుకుపోతున్న నల్లధనాన్ని తిరిగి రాబట్టేందుకు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడంతో స్విట్జర్లాండ్‌ వంటి దేశాలతో అవసరమైన ఒప్పందాలను కుదుర్చుకుని డిపాజిట్ల సమాచార మార్పిడికి మార్గం సుగమం చేశారు. జర్మనీ లీచెన్‌స్టీన్‌ బ్యాంకులోని డబ్బు దాచిన వారి పేర్లను ప్రస్తుతానికి వెల్లడిరచడం ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం ప్రకారం సాధ్యం కాదని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అదే విధంగా మరికొన్ని ఐరోపా దేశాలలో ఉన్న చట్టాలు సైతం నల్లధనం వెలికితీసే ప్రక్రియకు కొంత అడ్డంకిగా ఉన్న మాట నిజం.

ఇదంతా బాగానే ఉన్నా నల్లధనానికి కళ్లెం వేయడానికి ఉద్ధేశించిన చట్టం అమలుపై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడు గౌతమ్‌ ఖేతాన్‌పై చర్యలను ఢల్లీి హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2015 జూలై ఒకటి నుండి నల్లధనం (వెల్లడిరచని విదేశీ ఆదాయం, సంపద) మరియు పన్ను విధింపు చట్టం 2015 నుండి అమలులోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఖేతాన్‌పై పోలీసు చర్యలను, ఆదాయపన్ను శాఖ చర్యలను నిలిపివేస్తూ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు  ఆదేశాలు ఇచ్చారు. ఇది సరికాదని, కేంద్రప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.  నల్లధనం చట్టానికే ఎసరు రావడంతో నల్లధనం రాబట్టడం వెనుక కార్పొరేట్‌లు ఎంత శక్తివంతులో ఇట్టే అర్థమవుతోంది. తొందరగా దోషులను గుర్తించడం, ఎలాంటి జాప్యం లేకుండా ఆ నల్లధనాన్ని దేశానికి రాబట్టడంతో పాటు వారికి శిక్ష పడేలా చేయకపోతే ప్రభుత్వ మాటలు అన్నీ నీటిమూటలే అవుతాయి.

-రేగటి నాగరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page