వెయ్యేళ్ళకు పైగా నిరసనోద్యమ పండుగ!

  • నాటి బృహతమ్మ పండుగే నేటి బతుకమ్మ పండుగ
  • నేటి  నుంచి బతుకమ్మ ఉత్సవాలు

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
….. అంటూ తెలంగాణలోని పల్లెలు పట్టణాలలో ఆడపడుచుల ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. నేటి  నుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.  ప్రతి ఏటా భాద్రపద అమావాస్య నుంచి వేడుకలు మొదలై ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు కొనసాగి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

****సంప్రదాయాలకు ప్రతీక****
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను మహిళలు విశిష్ట వేడుకగా జరుపుకుంటారు. గౌరీదేవిని గౌరమ్మగా బతుకమ్మ రూపంలో ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. ఇందుకోసం తంగేడు గునుగు, గడ్డిపూలు, గుమ్మడి, కట్టెపూలు, బంతి తదితర అందుబాటులో ఉండే పువ్వులన్నింటిని తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకుంటారు.

***పేర్చడం ఇలా…***
పూలను ఎల్తె(వెదురు) ఈ నెలతో గానీ, సిబ్బి తీగలతో గానీ అల్లిన సిబ్బిలో లేదా తాంబాలంలో  బతుకమ్మను పేరుస్తారు. కింద గుమ్మడి ఆకులను పరిచి దానిపై తంగేడు పూలు పెడతారు. వాటిపై రంగురంగుల పూలను రంగుల్లో ముంచిన గునుగు, గడ్డి పూలను వరుసగా పేర్చి శంఖంలా తయారు చేస్తారు. అడుగు నుంచి పై వరకు పూల దొంతరల మధ్య ముద్ద బంతి, పోక బంతి, రుద్రాక్షపూలతో అలంకరిస్తారు. పైన శిఖరం మీద గుమ్మడి పువ్వులోని అండాశయాన్ని గౌరమ్మగా భావించి ఉంచుతారు. దాని పక్కనే పసుపు ముద్దతో చేసిన మరో గౌరమ్మను ఉంచి పూజలు చేస్తారు . ప్రధాన కూడళ్ల వద్ద వెంపలి చెట్టు కొమ్మలు నాటి పసుపు కుంకుమలు చల్లుతారు. సాయంత్రం వేళల్లో దాని చుట్టూ బతకమ్మలు ఉంచి తమతో తెచ్చుకున్న పూలను ఒక్కొక్కటిగా వేస్తూ…

“ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక్క జాము అయ్యే చందమామ
శివుడింక రాడాయే చందమామ
శివుని పూజలాయే చందమామ”…

…. అంటూ పదిసార్లు ఒక్కొక్క పువ్వు వేసి శివుని ప్రార్థిస్తారు.

*** పాటలు పాడుతూ…****

తమ స్థాయికి తగిన పట్టు పితాంబరాలు ధరించిన మహిళలు చేతులను వెనుకకూ, ముందుకు కదిలిస్తూ ఒక లయ ప్రకారం చప్పట్లు కొడుతూ, వొంగుతూ లేస్తూ లయబద్ధంగా కుడి నుంచి ఎడమవైపు అడుగులేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ వలయాకారంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతారు. తమ జీవితాల్లోని ఒడిదొడుకులనే పాటలుగా మలిచి పాడుతూ ఆడతారు. పేద, ధనిక తేడాలు మరచి అన్ని స్థాయిల వారితో ఊరు ఊరంతా కోలాహలంగా ఉంటుంది. ఏ ఆడపడుచు నోట విన్నా బతుకమ్మ పాటలే వినిపిస్తుంటాయి. గ్రామీణ ఆచార వ్యవహారాలు దైనందిన జీవితంలోని కష్టనష్టాలకు ఈ పాటలు అద్దం పడతాయి. బతుకమ్మ పాటల్లో పుట్టింటి ప్రేమలు అత్తగారింటి సంగతులు, సామాజికాంశాలు మిళితమై వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతాయి. పెతరామాస నుంచి బతుకమ్మ ప్రారంభమయ్యే రోజును “ఎంగిలి పూలు” గా పిలుస్తారు. వరుసగా తొమ్మిది రోజులు ఆడకూడదనే నమ్మకంతో ఆరో రోజును “అర్రెం”గా భావించి బతుకమ్మలను పేర్చరు. ప్రతిరోజు చీకటి పడే వరకు బతుకమ్మలను ఆడిన తర్వాత ఆయా గ్రామాలలోని చెరువులు కుంటలలో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే ముందు బాధతో…

“తంగేడు పూవుల్ల చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
…. అంటూ బతుకమ్మను సాగనంపుతూ పిండితో చేసిన ప్రమిదలలో నూనె పోసి బతుకమ్మలపై ఉంచి జ్యోతులు వెలిగిస్తారు. అనంతరం పసుపు గౌరమ్మను తీసుకుని బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. గౌరమ్మగా చేసిన పసుపు ముద్దను వాయనంగా స్వీకరిస్తారు. వాయనాలిచ్చుకుంటూ…

‘ఉసికెలో పుట్టే గౌరమ్మా
ఉసికెలో పెరిగే గౌరమ్మా
అంటూ పాటలు పాడి తమతో తెచ్చుకున్న ఫలహారాలను సద్దులను పంచుకుని ఆరగిస్తారు.

*** ‘బతుకమ్మా’ దీవెనయే బతుకమ్మ ***

తెలంగాణ సంస్కృతికి ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ఆవిర్భావానికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళ వంశానికి చెందిన ధర్మాంగుడు సత్యవతి అనే రాజదంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు. వారు చేసిన నోములతో వందమంది కొడుకులు పుట్టినా వారంతా యుద్ధంలో చనిపోతారు. దీంతో విషాదాన్ని తట్టుకోలేక రాజదంపతులు అడవికి వెళ్లి చేసిన తపస్సుకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై వారి బిడ్డగా పుడతానని వరం ఇస్తుంది. ఈ మేరకు పుట్టిన బిడ్డ కలకాలం బతకాలని ఋషులు ‘బతుకమ్మ’ అని నామకరణం చేస్తారు. బతుకమ్మ పెరిగి పెద్దదై చక్రాంకునిగా పుట్టిన శ్రీహరిని(శ్రీ మహావిష్ణువును) పెళ్లి చేసుకున్నట్లుగా కథ ప్రచారంలో ఉంది. అప్పటినుంచి చోళ రాజ్యంలో బతుకమ్మ సంక్షేమం కోసం పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారిందని, ‘బతుకమ్మా ‘ అనే దీవెనయే బతుకమ్మగా ప్రసిద్ధి చెందింది. శ్రీ మహావిష్ణువు చక్రాంకుడి పేరుతో బతుకమ్మను వివాహమాడడంతో అప్పటినుంచి జానపదులు ‘ బతుకమ్మ ‘ను లక్ష్మీదేవిగా పూజిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ వృత్తాంతాన్ని ..

శ్రీ లక్ష్మీదేవియు ఉయ్యాలో
సృష్టి బతుకమ్మాయే ఉయ్యాలో
పుట్టిన రీతి చెప్పే ఉయ్యాలో
భట్టు నరసింహ కవి ఉయ్యాలో
…అంటూ ఉయ్యాల పాటగా పాడిన తర్వాతనే మిగిలిన పాటలు పాడుతారు.

*** బతుకమ్మగా మారిన కాకతమ్మ పూజ ***

‘బతుకమ్మా’ అనే దీవెనతో బతుకమ్మగా మారిన ఈ పండుగ తెలంగాణలో మొట్టమొదట కాకతమ్మ పూజగా
వెలుగొందింది. కాకతమ్మ పూజయే బతుకమ్మగా మారిందని చారిత్రకుల అభిప్రాయం. కాకతమ్మ ఉత్సవాలు శాలివాహన శకం 1185 రుథిరోధ్గారి నామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యాయని అంచనా. కాకతమ్మ (కాకతీదేవి) కాకతీయ గణానికి కుల దేవత. ఆర్య క్షత్రియ గోత్రాల్లో ఒకటైన కాకతీయ గణం వేద కాలం నుంచి ప్రసిద్ధి చెందింది. కాకతీయ వంశం వారసులైన చాళుక్యులు రాజ్యాలను ఏలుతున్న కాలం నుంచి కాకతమ్మ గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయుల కాలంలో కాకతమ్మ ఉత్సవాలు బతుకమ్మ పండుగగా మారి తెలంగాణలో బహుళ ప్రచారం పొందాయి.

*** జానపద సంస్కృతికి ప్రతీక ***
బతుకమ్మ పండుగ తెలంగాణలో జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నది. ఈ పండుగ ఆవిర్భావం పై ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. పూర్వం కాపు(రైతు) దంపతులకు ఆరుగురు కొడుకులు పుట్టినప్పటికీ అందరూ పురిట్లోనే చనిపోయారట. ఏడో కాన్పులో కుమార్తె పుట్టడంతో బతుకమ్మ అని పేరు పెట్టారు. అనంతరం వారికి ఇంకో కొడుకు పుట్టాడట. యుక్త వయసు వచ్చాక బతుకమ్మకు పెళ్లి చేసి జరిపించి అత్తవారింటికి పంపిస్తారు. కొన్నాళ్ల తర్వాత బతుకమ్మ తన సోదరుడిని చూసేందుకు పుట్టింటికి వెళ్లి, తన మరదలితో కలిసి చెరువులో స్నానం చేసేందుకు వెళుతుంది. చెరువు గట్టు పైన దుస్తులు పెట్టి చెరువులో దిగి స్నానం చేసి వచ్చేసరికి గాలివాటం వల్ల ఇద్దరి దుస్తులు కలిసి పోయాయట. పొరపాటున ఒకరి దుస్తులు ఒకరు ధరించారు. దీంతో ఆడపడుచునైన తన దుస్తులు ఎందుకు ధరించావని బతుకమ్మ తన మరదలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవేశానికి లోనైన మరదలు బతుకమ్మను గొంతు నులిమి చంపి, చెరువు గట్టున పాతి పెట్టి ఇంటికి వెళుతుంది. అదే రాత్రి తన భర్తకు బతుకమ్మ కలలో కనిపించి తనను తీసుకెళ్లాలని వేడుకుంటుంది. మరునాడు ఆమె భర్త బతుకమ్మను తీసుకొచ్చేందుకు అత్తగారింటికి వెళతాడు. బతుకమ్మను పాతిపెట్టిన చెరువుగట్టు వద్దకు అతను చేరుకునేసరికి అంతకు ముందెన్నడూ చూడని, కనిపించని తంగేడు చెట్టు కనిపిస్తుంది. ఆశ్చర్యంతో ఆ పూలను తెంపేందుకు ప్రయత్నించగా, ఆ చెట్టు పాపిష్టి మరదలు తనను చంపి పాతి పెట్టింది అని చెప్పిందట. ప్రతి ఏటా తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి పైన గౌరమ్మను నిలిపి పూజ చేసి చెరువు గట్టున ఆడిన తర్వాత నీటిలో విడిచి పెట్టాలని కోరిందట. బతుకమ్మ భర్త ఈ మేరకు ముత్తయిదువులకు చెప్పి వారి ద్వారా బతుకమ్మ కోరికను తీర్చే వాడట. అప్పటినుంచి ఆడపడుచులు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని చెబుతారు.

*** ఆరాధించే విధానం ***

పాడి పంటలు, జీవనదులు, అటవీ సంపద జానపదుల జీవితంలో సుఖాలకు ప్రతీకలయితే, కరువు కాటకాలు, తుఫానులు, భూకంపాలు కష్టాలకు సంకేతాలు. సుఖాలను పొంది కష్టాలను ఎదుర్కొనేందుకు జానపదులు ప్రకృతిని పూజిస్తారు. ప్రకృతిని ఆరాధించే విధానమే బతుకమ్మగా మారిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి ఒడిలో పుట్టి పెరిగిన జానపదులు తమ ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే విధంగా జరుపుకున్న బతుకమ్మ పండుగ తర్వాత కాలంలో తెలంగాణలో ప్రసిద్ధి చెందిందని భావిస్తున్నారు.

*** ఔషధ గుణాలతో మేలు ***

కొమ్మ చెక్కితే బొమ్మరా… కొలిచి మొక్కితే అమ్మరా … అని తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందేశ్రీ రాసినట్లు కొమ్మన పూసిన పూలు బతుకమ్మ వేడుకల్లో ప్రాముఖ్యం వహిస్తాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో పూల బతుకమ్మ గౌరమ్మ తల్లిగా పూజలు అందుకుంటుంది.  పూలతో పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. వినాయక చవితి సందర్భంగా గణపతిని నవరాత్రులలో పూజించినట్లుగా బతుకమ్మను తొమ్మిది రోజులు నిర్వహిస్తారు. వినాయకుడిని గరిక, పత్రి, పూలతో పూజించి చివరి రోజు నిమజ్జనం చేయడం తెలిసిందే. అలాగే బతుకమ్మలను పూలతో అలంకరించి ఏరోజుకారోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనివల్ల తంగేడు పూలు, గరిక పూలు,వాటి ఆకులలో ఉన్న ఔషధ గుణాలు నీటిలో కలిసి ఆవిరిగా మారడం వల్ల మానవాళికి మేలు జరుగుతుందని ప్రతీతి. వర్షాకాలంలో కురిసే వానలతో వరదలు పారి చెరువులు కుంటలు నీటితో కళకళలాడుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో వరదలు రావడం వల్ల నీరు కలుషితం అయి అంటు రోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువ. బతుకమ్మలకు ఉపయోగించే పువ్వులు ఈ నీటిని శుద్ధి చేస్తాయి. పూలలో ఉండే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు నీటిలో కరిగి మానవాళిని వివిధ వ్యాధులనుంచి రక్షిస్తాయని నమ్ముతారు. బతుకమ్మను పూలతో ఆరాధించడం వల్ల జగత్తుకు మేలు జరుగుతుందని భావిస్తారు.

*** పూలలో ఉండే ఔషధ గుణాలు ***

1. తంగేడు: తంగేడు పూలు శరీరంలోని వాతం, ఉష్ణం, ప్రకోపాలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను నియంత్రించి క్రమబద్ధీకరిస్తుంది. తంగేడు చెక్కను తోళ్ల పరిశ్రమల్లో తోళ్లను శుభ్రం చేసేందుకు వాడుతారు.

2. పట్టుకుచ్చులు :పట్టుకుచ్చుల పూలకు సీత జడ పూలని మరో పేరు. పట్టు కుచ్చుల పూలు జలుబును, ఆస్తమాను తగ్గించే ఔషధంగా పనిచేస్తాయి.

3. గులాబీ: గులాబీ  పూలను ఆయుర్వేద మందుల్లో విరివిగా ఉపయోగిస్తారు.

4. కట్ల పూలు:  కట్లపూల తొడిమలను ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. పశువులకు వైద్యం చేసేందుకు వాడుతారు.

5. గుమ్మడి: గుమ్మడి పూవులో శరీరంలోని వేడిని తగ్గించే ఔషధ లక్షణాలు ఉన్నాయి.

6. గునుగు, గడ్డి పూలు: గునుగు, గడ్డి పువ్వులు జీర్ణం చేసే ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.

7. మందార: మందార పుష్పాలను ఎండబెట్టి, నూనెలో మరిగించి తలకు రాస్తే నొప్పి తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లగా మారకుండా నల్లగా ఉంటాయి.

8. బంతి: బంతిపూలు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. దీంతో సూక్ష్మ క్రిములతో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు.

9. తామర: తామర పూలు శరీర వేడిని తగ్గిస్తాయి. గాయాల నుంచి త్వరగా కోలుకునేటట్లు చేస్తాయి.

ఇవేకాక వ్యాధులను చేరనీయని నూరు వరహాలు, సత్యనారాయణ పూలు, బఠానీ, గన్నేరు, కాగితం పూలు వంటి పూలను బతుకమ్మలను అలంకరించేందుకు వాడుతారు.

ఇలా తొమ్మిది రోజులు పాటు బతుకమ్మలను పేర్చి, ఫలహారాలతో గ్రామ బొడ్రాయి వద్ద బతుకమ్మలను పెట్టి, అన్ని వర్గాల వారు అక్కడ చేరి, బతుకమ్మలు ఆడుతారు. ఈ పండుగ అన్ని కులాలు, వర్గాల మధ్య స్నేహాన్ని, ఐక్యతను, గ్రామ బంధుత్వాన్ని పెంచుతుంది. బొడ్రాయి వద్ద బతుకమ్మలు ఆడి అలసిపోయిన తర్వాత చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ కొంతసేపు బతుకమ్మలు ఆడి చివరగా చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి ఫలహారాలను ఒకరికి ఒకరు పంచుకొని ఆరగిస్తారు.

—   కత్తుల లక్ష్మారెడ్డి, సిద్ధన్నపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page