హైడ్రా ప్రకంపనలు..!

  • ప్రతిపక్షాల విమర్శలు .. బాధితుల ఆర్తనాదాలు
  • చట్టబద్దతపై ప్రశ్నిస్తున్న ఉన్నత న్యాయస్థానం

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

రాజధాని నగరంలో హైడ్రా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెల్లవారితే ఎక్క‌డ బుల్డోజ‌ర్లు వ‌స్తాయో.. ఏ ప్రాంతం నేలమట్టమవుతుందో అర్థం కాని అయోమ‌య‌ పరిస్థితిలో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కనీసం ఇంట్లో విలువైన సామ‌గ్రిని సర్థుకునే సమయం కూడా ఇవ్వకుండా తమ బతుకులను బజారునపడేస్తున్నారని వారు బావురుమంటున్నారు. నిన్నటివరకు వర్ష బీభత్సం, ఇప్పుడేమో హైడ్రా హై హ్యాడెండ్ నెస్‌తో తమకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందంటూ గ‌గ్గోలు పెడుతున్నారు. త‌మ జీతంలో సగ భాగమంతా పైసా పైసా కూడబెట్టి గూడు నిర్మాణం చేసుకుంటే, తమ కండ్లెదుటే అది నేలమట్టమవుతుంటే ఏంచేయలని స్థితిలో ఉన్నామంటూ వారు కడు దీనాలాపంగా మాట్లాడుతున్నతీరు పలువురి హృదయాలను కలిచివేస్తోంది. అప్పుచేసి కొందరు, అరువు తెచ్చుకుని కొందరు.. సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నామనుకున్న వారి ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఒక పక్క బ్యాంకులు ఏమాత్రం కనికరం చూపించకుండా తమ అప్పు చెల్లించి తీరాలంటున్నాయి.

మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటే ఆత్మహత్య చేసుకోవడం కన్నా మరో మార్గం లేదంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజంగానే తమది అక్రమ కట్టడమే అయి ఉంటే, భవన నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందంటూ వారు నిల‌దీస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తేనే కదా బ్యాంకులు ఇళ్లు కట్టుకోవడానికి అప్పు ఇచ్చింది. తమ వద్ద అనుమతులకు సంబంధించిన పత్రాలున్నా హైడ్రా పట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు. ఒక పక్క నిరుపేదలకు డబుల్‌బెడ్‌ ‌రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం, మరోపక్క ఉన్న ఇళ్ళను కూల్చి పేదలను నిరాసితులను చేయడాన్ని రాజకీయ నాయకులు కూడా తప్పుపడుతున్నారు.

అనుమతులివ్వడమే కాదు.. ఇంటి పన్ను, విద్యుత్‌ ‌బిల్లులతో సహా అన్ని రకాల పన్నులను వారి నుంచి నిన్నటి వరకు వసూలు చేసిన ప్రభుత్వానికి ఇవ్వాళ అకస్మాత్తుగా వారి నిర్మాణాలు అక్రమమని ఎలా గుర్తుకు వొచ్చిందని నిలదీస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిఐ్తోంద‌ని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.

కోర్టు ఆదేశాలు సైతం బేఖాత‌రు..!

హైడ్రా కూల్చివేతల్లో అధికంగా నష్టపోతున్నవారు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి చెందినవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. విచిత్రమేమంటే కోర్టు స్టే ఉత్తర్వులున్నా హైడ్రా ఏమాత్రం పట్టించుకోవడం విమర్శలకు దారితీస్తోంది.స్టే తెచ్చుకున్న విషయాన్ని చెప్పినప్పటికీ హైడ్రా తన పనికానివ్వడం పట్ల ఉన్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ‌మండలం కిష్టారెడ్డిపేట గ్రామపంచాయ‌తీ పరిధిలోని ఒక భవన నిర్మాణం విషయం ఇందుకు ఒక ఉదాహరణ. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు సీరియస్‌ అయింది. తమ ఆదేశాలను ధిక్కరించడంతో ఆగ్రహించిన కోర్టు హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను నేరుగా గానీ, వర్చువల్‌గా గానీ ఈ సోమవారం హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా హైడ్రా (హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్, అసెట్‌ ‌మానిటరింగ్‌ అం‌డ్‌ ‌ప్రొటక్షన్‌ ఏజన్సీ) కి ఉన్న చట్టబద్దత ఏమిటన్న విషయాన్ని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.ఈ విషయాన్ని గతంలో కూడా అడిగాం, మరోసారి అడుగుతున్నామంటూనే, కూల్చివేతల విషయంలో హైడ్రా ఎందుకు అంత దూకుడుగా వ్యవహరిస్తున్నదని కూడా ప్రశ్నిస్తోంది.

బాధితులు కోరుతున్నదేమిటి?  

వాస్తవంగా ప్రారంభంలో హైడ్రా చర్యలను విపక్షాలతో సహా, రాష్ట్ర ప్రజలందరూ ఆహ్వానించారు. రాష్ట్ర రాజధాని నగరం హైదారాబాద్‌లో చెరువులు, నాలాలతోపాటు కబ్జాకు గురి అవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించడం, ముంపున‌కు గుర‌వుతున్న నగరాన్ని కాపాడే ఉద్దేశంతో ఏర్పడిన హైడ్రా ఏర్పాటును అందరూ స్వాగతించారు. చెరువులను ఆక్రమించి పెద్ద నిర్మాణాలు చేసిన బడా బాబుల కట్టడాలను నేలమట్టం చేయడంపై హ‌ర్షం వ్యక్తం చేసిన‌ జనం జీహెచ్‌ఎం‌సీ, హెచ్‌ఎం‌డీఏ వంటి సంస్థల అనుమతులతో కట్టుకున్న మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారి ఇళ్ళను కూల్చడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

ముందుగా అనుమతిలిచ్చిన సంస్థలు, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. అంతేగాక తమకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ముఖ్యంగా కూల్చివేతలకు సంబంధించి తమకు ముందస్తుగా నోటీసులు ఇవ్వకపోవడాన్ని వారు సవాల్‌ ‌చేస్తున్నారు. ఎంతో కష్టపడి విలువైన వస్తువులను కొనుక్కుంటే కనీసం వాటిని తీసుకుని భద్రపరచుకునే సమయం కూడా తమకివ్వకపోవడంపట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

తాజాగా మూసీనది వాసులు ఈ విషయంలో సంబంధిత అధికారులను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఎఫ్‌టిఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌లలో నిర్మాణాల కూల్చివేతకోసం మార్కింగ్‌ ‌చేయడానికి వెళ్ళిన అధికారులపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాదని చర్యలు చేపడితే ఆత్మహత్యలు చేసుకుంటామని ఒంటిపై కిరోసిన్‌ ‌పోసుకుని అధికారుల చర్యను అడ్డుకున్నారు. మొత్తం మీద చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటుచేసిన హైడ్రా ప్రభుత్వానికిప్పుడు సవాల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page