కాంగ్రెస్‌ ‌పార్టీ సొంతిల్లు లాంటిది..

నేనూ కాంగ్రెస్‌ ‌నాయకుడినే అని చెప్పుకోవాల్సిన దుస్థితి
సీనియర్‌ ‌నేత ఎమ్మెల్సీ, జీవన్‌ ‌రెడ్డి ఆవేదన
టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు
మాదే అసలైన కాంగ్రెస్‌ ‌కుటుంబం: సంజయ్‌ ‌కుమార్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23: ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు జీవన్‌ ‌రెడ్డి ఇవాళ మరోసారి తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్‌ ‌పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇది తనకు సొంతిళ్లు లాంటిదని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని.. కానీ ఇప్పుడు తన అనుభవమే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక అశక్తుడిలా మారిపోయానని.. నాలుగు నెలలుగా అవమానాలకు గురువుతున్నానని బయటపెట్టారు. నేనూ కాంగ్రెస్‌ ‌నాయకుడినే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు.కాంగ్రెస్‌ ‌పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని జీవన్‌ ‌రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్‌ ‌విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.ఫిరాయింపుల కారణంగా బీఆర్‌ఎస్‌ ఎవరో.. కాంగ్రెస్‌ ఎవరో అర్థం కావడం లేదని జీవన్‌ ‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్‌ ‌నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్‌ ‌సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్‌ ‌చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు.

టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అసమ్మతి నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రోత్సహించడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంపై ఆయన స్పందించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్నది హైకమాండ్‌ ‌నిర్ణయమని తెలిపారు. దాని ప్రకారమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిల్లదని మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. గంగారెడ్డి హత్యపై ఉన్నతాధికారులతో మాట్లాడామని పేర్కొన్నారు. హత్య కేసులో విచారణ జరుగుతుందని.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే జీవన్‌ ‌రెడ్డితో మాట్లాడానని చెప్పారు. జీవన్‌ ‌రెడ్డి ఆవేదనతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగా వొచ్చిన నాయకులు పాత నాయకులను కలుపుకోవాలని సూచించారు. జగిత్యాలలోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు.

మాదే అసలైన కాంగ్రెస్‌ ‌కుటుంబం: సంజయ్‌కుమార్‌
‌జగిత్యాలలో తమదే అసలైన కాంగ్రెస్‌ ‌కుటుంబం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ‌స్పష్టం చేశారు. ఇదే జీవన్‌ ‌రెడ్డి ఎన్టీఆర్‌ ‌మంత్రి వర్గం నుంచి బయటకు వొచ్చేసి నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో చేరి ఇంకో పార్టీతో కలవలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో తనకు అవకాశాలు రాకపోవడంతోనే బీఆర్‌ఎస్‌ ‌నుంచి పోటీ చేయాల్సి వొచ్చిందని సంజయ్‌కుమార్‌ ‌తెలిపారు. తాను ఇంకా కాంగ్రెస్‌ ‌సభ్యత్వం తీసుకోలేదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని పేర్కొన్నారు. దానికి జీవన్‌ ‌రెడ్డి పదే పదే పార్టీ ఫిరాయింపులు అని మాట్లాడటం సమంజసం కాదని సూచించారు. జీవన్‌ ‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page