చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేది దౌర్జన్యాలు 

  • భారతదేశంలో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం
  • పత్రికల గొంతునొక్కడం నెహ్రూ కుటుంబం డిఎన్ఏ
  • ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  
 విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. విదేశీ గడ్డపై భారతదేశ ప్రజాస్వామ్య విలువలను దిగజార్చేలా, రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. సెప్టెంబర్ 7న అమెరికాలోని డాలస్‌లో కాంగ్రెస్ పార్టీ గూండాల ద్వారా జరిగిన దౌర్జన్యకాండపై, అప్రజాస్వామిక చర్యపై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. రోహిత్ శర్మ అనే ఇండియాటుడే సీనియర్ జర్నలిస్టు.. ఇటీవలి రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను కవర్ చేసేందుకు డాలస్ వెళ్లిన సందర్భంలో.. కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల ఇంచార్జ్ శామ్ పిట్రోడాను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో రాహుల్ విదేశీ పర్యటన, భారత సంతతి ప్రజల స్పందన.. తదితర ప్రశ్నల తర్వాత.. ‘అమెరికా చట్టసభ్యులతో చర్చల సందర్భంగా.. బంగ్లాదేశ్ లో హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా రాహుల్ స్పందిస్తారా?’ అని అడిగారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులకు కోపం నశాళానికి అంటింది.
రోహిత్ శర్మను దూషిస్తూ, దౌర్జన్యానికి దిగి ఆయన ఫోన్ లాక్కొని.. మొత్తం ఇంటర్వ్యూ వీడియో డిలీట్ చేసేంతవరకు.. దాదాపు 30 నిమిషాలసేపు దుర్భాషలాడుతూ గదిలో నిర్బంధించారు. ‘ఇదీ రాహుల్ గాంధీ, ఆయన సన్నిహిత బృందం.. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన హత్యాకాండపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ హిందువుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు భయపడిన తీరును వెల్లడిస్తోంది. వాస్తవమైన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు.. ఈ ప్రశ్న వివాదాస్పదమైనదంటూ ఆ జర్నలిస్టుపై దాడిచేయడం ప్రజాస్వామ్య బద్ధమేనా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విదేశీ గడ్డపై భారతదేశంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోయిందని దుష్ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. తన పార్టీ సన్నిహితులు వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాహుల్ ఆదేశాలతోనే కాంగ్రెస్ గూండాలు పాత్రికేయుడిపై దౌర్జన్యానికి పాల్పడటం చాలా దుర్మార్గమన్నామని ఆయన విమర్శించారు. ‘రాజ్యాంగ పుస్తకాన్ని ఎప్పుడూ చేతిలో పట్టుకుని తిరుగుతూ.. రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపై కపట ప్రేమను ప్రదర్శించే రాహుల్.. భారతదేశ పరువు తీయాలనే ఏకైక లక్ష్యంతోనే విదేశీ పర్యటనలు చేయడం నిజం కాదా? నాడు రాహుల్ నాయనమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా.. ఎమర్జెన్సీ సమయంలో ఏకంగా పత్రికాస్వేచ్ఛను గొంతునులిమి అనేక పత్రికలను నిషేధించి, పత్రికల ఎడిటర్లను, విలేకరులను మీసా చట్టం కింద జైల్లో పెట్టించిన విషయం అందరికీ తెలిసిందే. సమాధానం చెప్పడం ఇష్టం లేని ప్రశ్నలకు జీర్ణించుకోలేక.. మీడియాను అణచివేసే అలవాటు కాంగ్రెస్ పార్టీ డీ ఎన్ ఏ , ప్రత్యేకంగా.. నెహ్రూ కుటుంబంలో ఉంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు హిందువుల రక్షణ గురించి ఆలోచించదని..
ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, మారణకాండ గురించి ఏ కాంగ్రెస్ నాయకుడూ మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి.. బంగ్లాదేశ్ గడ్డపై హిందువులకు భద్రత కల్పించే విషయంలో బంగ్లా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడితో ఇటీవల జరిగిన చర్చల సందర్భంగానూ మోదీ ప్రస్తావించారన్నారు. హిందువుల రక్షణకు సంబంధించిన ఈ ప్రశ్నను.. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నాయకులు అడ్డుకోవడానికి కారణం.. ఆ పార్టీ హిందూవ్యతిరేక ఆలోచనలే అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మెజారిటీ ప్రయోజనాల మనోభావాలు అర్థం చేసుకోలేనన్ని రోజులు.. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరిగినా కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ విశ్వసించరని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page