జీవ‌న ల‌య‌ల స‌వ్వ‌డులు…

ఆలోచ‌న‌ల్లోని నిర్మ‌ల‌త్వంలా, నిర్మాణంలో నిపుణ‌త‌లా, అనుభూతుల పాల‌వెల్లిలా క‌విత్వం ఉండాలంటారు. జ‌ల‌పాత స‌దృశంగా మినీక‌విత‌, నిశ్చ‌ల స‌ర‌స్సులా హైకూ ఎంతో నిదానంగా మొదులై గుండెలోని అణువ‌ణువునూ త‌డ‌ముతూ ప్ర‌వ‌హించి చైత‌న్య ఝ‌రిగా నిలిచిపోయే నానీలు ఆధునిక వ‌చ‌న క‌విత్వ ప్ర‌క్రియ‌లు. వ‌స్తువుకు సంబంధించిన ష‌ర‌తులేవీ లేకుండా నాలుగు పాదాల్లో స్వేచ్చ‌గా శిల్పాన్ని, స‌ముగ్ర‌త‌ను పాటిస్తూ అభివ్య‌క్తిని ఎంతో చ‌క్క‌గా వ్య‌క్తీక‌రించ‌గ‌లిగిన ప్ర‌క్రియ‌గా నానీలకు ఎంతో గుర్తింపొచ్చింది. సుప్ర‌సిద్ధ సాహితీవేత్త ఆచార్య ఎన్ గోపి ప్రారంభించిన నానీల ప్ర‌క్రియ‌లోని విశిష్ట‌త ఎంతో మంది క‌వుల‌ను ఆ మార్గంలో న‌డిపించింది. ఊహించ‌న‌న్ని నానీల సంపుటాలు వెలువ‌డి క‌విత్వ బ‌లిమిని చాటి చెప్పాయి. ఆ స్ఫూర్తితోనే క‌వితాక్ష‌ర సేద్యం చేసి నానీల జీవ‌ధారను కురిపించిన క‌వి సివి శ్రీ‌నివాస్‌.

స‌మాజాన్ని సునిశితంగా ప‌రిశీలించిన స్థితిని రంగ‌రించుకున్న నానీలెన్నో శ్రీ‌నివాస్‌లోని క‌వితావేశాన్ని వ్య‌క్తీక‌రించాయి.నీళ్లే లేని/ ఎడారి రాజ్యం/ బురదైంది/ వ‌ల‌స జీవుల క‌న్నీళ్ల‌తో అని రాసిన నానీలో వ‌ల‌సలు మ‌నిషికి చేసిన గాయాల ప్ర‌భావ‌మెంత‌టితో తెలుస్తుంది. ఛిద్ర‌మైన చిత్త‌డి వంటి ద‌య‌నీయ‌త‌ను క‌ప్పుకుని బేల‌త‌నాన్నిఆవ‌రించిన జీవితాన్ని ఈ నానీ చూపింది.ప్రకృతి కాపాడుకోవాలంటే చెట్ల‌ను కాపాడుకోవ‌డం మిన‌హా మార్గ‌మే లేదుంటూ హైవేలపై/ ‌చెట్ల జాడేలేదు/ ఆశోకుడు/ మ‌ళ్లీపుట్టాల్సిందే అన్న వాస్త‌వ చిత్రాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుత ఆరోగ్య వ్యాపారాన్ని ఒక నానీలో చెబుతూ అనారోగ్యం/ మ‌నుషుల‌కేనా ?/ ఆరోగ్‌రశ్రీ‌/ హాస్పిట‌ల్సు క్కూడా అని ఎద్దేవా చేశారు. వెస్ట్రనైజేష‌్న్ మాదిరిగా అమెరిక నైజేష‌న్‌ను మ‌రో నానీలో ఎత్తి చూపి ఆముదాల‌కు/ధ‌ర త‌క్కువ‌/ కా‌స్ట్రోల్ ధ‌రెక్కువ‌/ ఇదే! అమెరిక‌నైజేష‌న్ అంటారు. వ్య‌వస్థ అవ‌స్థ‌ను ప్ర‌తిబింబిస్తూ స‌మాంత‌రంగా / న‌ల్లాలు, నాళాలు/ అందుకేనా/ దేహంనిండా మురికి గోళాలు అని ఆవేద‌న చెందారు. శ్ర‌మ‌నిష్ప‌ల‌మై అన్న‌ట్టుగా రెక్కాడితేనే/ డొక్కాడెటోళ్లు/ జీవ‌న సాఫ‌ల్య‌/ క‌ళాకారుల‌ని చెప్పారు.

చీక‌టి వెలుగుల మ‌య‌మైన జీవ‌న ప్రపంచంలో జ్ఞానం/ మూలాలు శోధిస్తుంది/ అజ్ఞానం/ మూలాలు వెతుక్కుంటుంద‌ని అంటారు. భూమిది ఎప్పుడూ త‌డిత‌ప‌నే కాబ‌ట్టి సౌర‌కుటుంబానికే/ ఆడ‌బిడ్డ‌యింది భూమి/ హృద‌యంలో/ త‌డి ఉన్నందుకే అని తేలుస్తారు. బ‌తికున్న‌ప్పుడు పిడికెడు బియ్యం కూడా విద‌ల్చ‌లేకుండా విగ‌త జీవుడైతే పిండాన్ని/ కాకులు ముట్ట‌లే/ ఎన్న‌డ‌న్నా ఎంగిలి చేత్తో / కొడితేగా అంటారు.మ‌ధుమోహం ఇప్పుడు మ‌నిషికి డేంజ‌ర్ బెల్‌గా మారిన స్థితిని అతునికి/ బ‌తుకుంటే ఎంతో తీపో / అందుకేనేమో/ వంటి నిండా షుగ‌రు! అని విచార ప‌డ‌తారు. క‌రిగేదితొల‌క‌రి మేఘం అన్న దృశ్యాన్ని ` మేఘాలు/ జ‌ల‌నిధి క‌న్న‌బిడ్డ‌లు/ తిరిగి తిరిగి / పుట్టింటికి చేరుతై అని ఒక నానీలో హృద్యంగా వ‌ర్ణిస్తారు. న‌డుస్తున్న చ‌రిత్ర‌కు ఆన‌వాలుగా రైతులంద‌రికీ/ రైతుబంధు/ సంక్షేమ ప‌థ‌కాల‌కూ/ రాబందులు అన్న నానీ సాక్ష్యంగా క‌న‌బ‌డుతుంది. ఉపాధ్యాయ వృత్తిని శ్వాసిస్తున్న క‌వి క‌నుక బ‌డిని కాపాడుకోవాల‌న్న ఆర్తిని ఆ బ‌డి/ చిగురిస్తోంది/ బ‌డిబాట మెద‌లై/ కోయిల‌లు వ‌స్తున్నందుకు అన్న నానీలో వ్య‌క్త‌ప‌రిచారు. రాచ‌కీయ‌మైన రాజ‌కీయాన్ని తాను అందంగా లేకున్నా / ఎంద‌రినో / అంద‌ల‌మెక్కిస్తుంది/ రాజకీయం అంటూ ఎత్తిపొడిచారు. అంతెరుగ‌నిది ఆశామ‌య జీవితం అన్న‌ట్టుగా విరబూస్తున్న / బొండుమ‌ల్లెలు / అల‌సిపోతున్నై/ కోరిక‌లా? శ్వా స‌లా?అని శ్రీ‌నివాస్ నానీ ప్ర‌శ్నిస్తుంది. రైత‌న్న దుస్థితిని వివ‌రిస్తూ రైత‌న్న‌/ పాదాల‌కు ప‌గుళ్ళు/ నెర్రెలు ప‌ట్టిన / నేల‌ను ముద్దాడి ముద్దాడి! అని ఒక నానీలో దైన్యంగా చెప్పారు.

ఊరి చెరువు/ ఎండిపోయింది/ ఎండిపోనిది/ గుండెచెరువే! అంటూ జీవ‌న వాస్త‌విక‌త‌ను నానీగా రాశారు. ఎదిగే కొద్దీ ఒద‌గ‌మంటూ చెట్టుదెంత‌/ విన‌య‌మో/ ఎంతెత్తుకెదిగినా/ ‌నేల విడిచ సాము చేయ‌దు అంటారు. త‌ల్లి క‌డుపులో / తొమ్మిది నెల‌లు/ శిశువుదీ/ యోగాభ్య‌స‌న‌మే అన్న వినూత్న దృక్కోణాన్ని నానీగా మ‌లిచారు. విభిన్న అంశాల స‌మ‌న్వ‌యంగా, ప్ర‌త్యేక నిర్మాణంతో, శ్ర‌ద్ధ‌తో రూపొందిన నానీలివి. నిర్మ‌ల‌మైన ఆలోచ‌న‌లు నిండిన ఈ నానీల‌లో శ్రీ‌నివాస్ ర‌చ‌నా నైపుణ్యం క‌న్పిస్తుంది. సామాజిక‌త‌ను పొదుగుకున్న జీవ‌న పార్శ్వ‌పు ప్ర‌తిబింబాలు ఈ నానీల జీవ‌ధార‌లు.
– డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్
9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page