-
సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై దాడి అప్రజాస్వామికం..
-
మాజీ మంత్రి హరీష్ రావు
ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని,రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తోందని, ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల సిద్దిపేటలో తన కార్యాలయం మీద, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, నిన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడులు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో గుండా రాజ్యాన్ని తలపించేలా పరిపాలన సాగుతుందని స్పష్టమవుతోందని అన్నారు. తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి బీహార్ లాగా తెలంగాణను మారుస్తున్నారని మండిపడ్డారు. సునీత లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిందని ఆరోపించాఉ. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు బాణంసచా కాల్చడం, ఇంట్లోకి టపాకాయలు విసరడం ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనదని అన్నారు. ఈవిషయమై ఎస్పీతో, ఐజితో మాట్లాడానని, వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడికి యత్నించారని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.
ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయని, కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు.. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరని ఎద్దేవా చేశారు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి. దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తామని, దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుందని, పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.
రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డిజిపి ఆఫీస్ ను ముట్టడిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. .