ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రోత్సాహం.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణలో పెట్టుడులకు  రైన్లాండ్ స్టేట్ తో ఒప్పందం
..

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి వ్యవస్థను నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తాజాగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రైన్లాండ్ కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృదం ఆ మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయింది. ఈ సమావేశంలో చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కూష్లెర్, హైదరాబాద్ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసాయనాలు, ఫార్మా ఉత్పత్తి, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్‌లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించారు.
సులభతర వాణిజ్య విధానాలు, తక్షణ అనుమతుల జారీలో తెలంగాణా అగ్రగామిగా ఉందని ఈ సందర్భంగా డానియెల్ బృందానికి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి వ్యవస్థను నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని తెలిపారు. రెండు ప్రాంతాల మధ్య సారూప్యతలను గుర్తించడం ద్వారా, పరస్పర ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుంటుందని శ్రీధర్ బాబు సూచించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా పెట్టుబడులకు తెలంగాణా ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలుస్తోందని, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతో పాటు అత్యున్నత మౌలిక సదుపాయాలతో పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రైన్లాండ్, తెలంగాణా రాష్ట్రాలు ఇకపై ‘సిస్టర్ స్టేట్’ సహకార సంబంధాలు కలిగి ఉండాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. హైదరాబాద్ లో జరిగే బయో ఏషియా-2025 సదస్సుకు హాజరు కావాలని డానియెల్ బృందాన్ని శ్రీధర్ బాబు కోరారు. రైన్లాండ్ ను సందర్శించి అక్కడి అభివృద్ధిని పరిశీలించాలని ష్మిట్ బృందం శ్రీధర్ బాబును ఆహ్వానించింది. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ విభాగం సిఇఓ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీని సంద‌ర్శించిన జ‌ర్మ‌నీ బృందం
జర్మనీ దేశంలోని రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల బృందం గురువారం తెలంగాణ శాసనసభను సందర్శించింది. తెలంగాణ  అసెంబ్లీకి విచ్చేసిన రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్ర్డిక్ హేరింగ్ నాయకత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందానికి   స్పీక‌ర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుష్పగుచ్ఛం అంద‌జేసి ఆహ్వానించారు. జర్మనీ బృంద సభ్యులను శాలువా, మెమొంటోలతో సత్కరించారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ- జర్మనీ సభ్యుల బృందం వివిధ రంగాలలో సహకారంపై చర్చించుకున్నారు . ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధిక ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో అత్యాధునిక, సాంకేతిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధిని సాధిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అన్ని దేశాలు ఆసక్తిని చూపిస్తున్నాయని, జర్మనీ దేశానికి కూడా అన్ని సహకారాలు అందిస్తామని తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీ, మండలి భవనాలు చారిత్రక కట్టడాలని, నిజాం హయంలో నిర్మించిన పాత అసెంబ్లీ భవనాన్ని ఆధునికీకరణ చేస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page