రాజురాలో ఎమ్మెల్యేగా సుభాష్ ధోతే గెలిపించాలి..
చంద్రపూర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని పిలుపు
సుభాష్ ధోతేను 50వేల వోట్ల మెజారిటీతో గెలిపించేలా స్థానికుల నుంచి మాట తీసుకున్న సీఎం
చంద్రపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు విజయవంతమైనట్లే మహారాష్ట్రలోనూ మహా వికాస్ అఘాడీ ఇచ్చిన ఐదు గ్యారంటీలు రాష్ట్రంలో, ప్రత్యేకించి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ, ఆడబిడ్లలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రపూర్ జిల్లా రాజురా నియోజకవర్గంలో మహా వికాస్ అఘాడీ అభ్యర్థి సుభాష్ ధోతే తరఫున శనివారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలకు ఆరాధ్యులైన కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఇదే ప్రాంతం నుంచి చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. కాలక్రమంలో రాష్ట్రాలుగా విడిపోయినా విదర్భ ప్రాంతం-తెలంగాణ ప్రజల మధ్య బంధుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ అనుబంధంతోనే మీ అన్నగా నేను ఇక్కడికి వొచ్చాను. హైదరాబాద్ లో మరో సోదరుడిగా మీకు అండగా నిలబడతాను..’’ అని మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజలు ఒక్క వోటు వేసి సుభాష్ ధోతేని గెలిపిస్తే ఆయనతోపాటు పొరుగు రాష్ట్ర సీఎంగా తానూ రాజురా ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత తీసుకుంటానని, ఒక్క ఓటుతో ఇద్దరు సేవకులను పొందే అవకాశాన్ని రాజురా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి పెద్దమొత్తంలో పన్నులు చెల్లించే మహారాష్ట్రకు మోదీ సర్కారు తీరని అన్యాయం చేస్తోందని, కమలం పార్టీ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాల గడ్డ మహారాష్ట్ర ఏకమై నిలుస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న ముంబై మహానగరంతోపాటు ఇతర పెద్ద నగరాలైన దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాల్లో బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే లేదని గుర్తుచేశారు.
బిజేపిని తరిమికొట్టాలి..
వెన్నుపోటు రాజకీయాలతో విపక్ష ప్రభుత్వాలపై కుట్రలు చేసే బీజేపీని మొత్తానికే పాతిపెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లాంటి వెన్నుపోటుదారులతో క్షుద్ర రాజకీయాలు చేసే బీజేపీని తరిమికొట్టాలన్నారు. తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తరిమికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. మహారాష్ట్ర గడ్డ మహాయోధులను కన్న నేల అని, శివాజీ మహారాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాలా సాహెబ్ ఠాక్రే వారసులుగా, రాహుల్ గాంధీ సైనికులుగా కుట్రల పార్టీ బీజేపీతో కలబడి గెలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజురా అసెంబ్లీ సీటులో మహా వికాస్ అగాఢీ అభ్యర్థి సుభాష్ ధోతేను 50వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సీటులో ఓటమి తప్పదని భావించిన బీజేపీ తన బీటీమ్ వ్యక్తులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపిదని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు.