మూసీ చుట్టూ ముసురుకున్న రాజకీయాలు

  • నిర్వాసితులు అధైర్యపడొద్దంటున్న బిఆర్‌ఎస్‌
  • కన్నబిడ్డల్లా చూసుకుంటామంటున్న కాంగ్రెస్‌ ‌
  • విపక్షాలు ప్రత్యమ్నాయం చూపించాల‌ని సీఎం పిలుపు

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఒక పక్క హైడ్రాతోనే కక్కలేక మింగలేకపోతున్న స్థితిలో మూసీ పేద ప్రజల జీవితాలను ప్రశ్నార్థకంలో పడేసింది. ఇప్పటికే పలు కుటుంబాలు తట్టాబుట్టా సర్ధుకోగా, తాము ఎట్టి పరిస్థితిలో ఖాలీ చేసే ప్ర‌స‌క్తే లేదని మరికొందరు భీష్మించుకుని కూర్చున్నారు. వారికి బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు మద్దతిస్తున్నాయి. మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌లో అక్రమంగా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ‌. ఎవరిని కదిలించినా హృదయ విదారకమైన వారి జీవన విధానం క‌ళ్ల ముందు కదలాడుతుంది.

ఒకటి కాదు.. రెండు కాదు.. 30 ఏండ్లకు పైగా పుల్లా పురక పోగుచేసుకుని గూడు నిర్మించుకుంటే త‌మ‌ను అర్థంతరంగా ఇండ్లు ఖాళీచేసి పోవాలంటే ఎలా అంటూ కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తున్నవారిని చూస్తే ఎలాంటి వారి హృదయాలైనా ద్ర‌విస్తాయి. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయం మాత్రం కరగడం లేదని, ఏమాత్రం కనికరం లేకుండా నిరుపేదలకు ఉన్న నీడ కూడా లేకుండా చేస్తున్నాడని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. మూసీలో పేదల కన్నీళ్లు పారుతున్నా బండ లాంటి రేవంత్‌ ‌గుండె కరగడం లేదని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్ కెటిఆర్‌ ఆరోపిస్తున్నారు. వారి ఆర్తనాదాలు వినిపించుకునే స్థితిలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం లేదు. అయినా బిఆర్‌ఎస్‌ ‌పేదలకు రక్షణ కవచంగా తాము నిలబడుతామంటున్నారు కెటిఆర్‌. ‌పేదల ఇండ్లపై ప్రభుత్వం బుల్డోజర్లను నడిపితే.. ముందుగా అవి తమను దాటుకుని పోవాల్సిందేనంటూ బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

పేదలను పారదోలి మూసీ చుట్టూ ఆర్థిక పరమైన సామ్రాజ్యాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంద‌ని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. అందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం భారీ ప్రణాళికనే వేసుకుంది. ఇందుకు లక్షన్నర కోట్ల వ్యయానికి అంచనాలు సిద్దం చేస్తుంద‌ని ఆ పార్టీ ఆరోపిస్తోంద‌ని అందుకు నమామి గంగేను ఆదర్శంగా చూపిస్తున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, అక్కడి కన్నా ఎక్కువ వ్యయానికి సిద్దపడింద‌ని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.గుజరాత్‌లోని నమామి గంగే ప్రక్షాళనకు కిలో మీటర్‌కు రూ.17 కోట్ల ఖ‌ర్చయితే, మూసీ ప్రక్షాళనకు కిలోమీటర్‌కు రూ.2,700 కోట్లు వ్యయమవుతుందని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అంచనాలు తయారు చేసిందని తెలుస్తున్నదని, కేంద్రంలోని తమ పార్టీకి నిధులు సమకూర్చే ఉద్దేశ్యంగానే ఇంత భారీ అంచనాలు వేసినట్లు కెటిఆర్‌ ఆరోపిస్తున్నారు. వాస్తవంగా అధికారంలోకి రావడానికి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని ముందుకు తీసుకువొచ్చిందన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. రుణమాఫీ విషయంలో రైతాంగం చేస్తున్న ఆందోళన, మహిళలకు ఇస్తామన్న 2,500, అవ్వ తాతలకు ప్రతీనెల ఇస్తామన్న రూ.4వేల రూపాయలు, ఆడబిడ్డల పెండ్లిండ్లకు ఇస్తామన్న తులం బంగారంలాంటి పథకాలన్నిటినీ పక్కకు పెట్టి మూసీ బ్యూటిఫికేషన్‌ అం‌టూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం రేవంత్‌ ‌సర్కార్‌ ‌చేస్తున్నదన్నది విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే అందుకు ధీటుగానే ప్రభుత్వం స్పందిస్తున్నది. మూసీ పథకాన్ని తమ రాజకీయాలకు వాడుకోవాలని విపక్షాలే కుట్రచేస్తున్నాయంటోంది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం. వాస్తవానికి మూసీ ప్రక్షళనపై 2021లోనే బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సమావేశాలు నిర్వహించిందని, అందుకు హద్దులను కూడా ఆనాడే గుర్తించిన విషయాన్ని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేస్తున్నారు. నిజంగానే బాధితులపట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రత్యమ్నాయంగా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై తగిన సూచనలు చేయాల్సిందిగా ఆయన విపక్షాలకు సవాల్‌ ‌విసిరారు. నిర్వాసితులకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, రూ.25వేలు ఇచ్చేవిషయాన్ని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. నిర్వాసితుల్లో స్వంత ఇండ్లులేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే ఆలోచన ఉన్నట్లు గుర్తుచేస్తున్నారు.

అలాగే వారికి ఉపాధి కల్పించే విషయం, వారి పిల్లలకోసం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందంటున్న సిఎం రేవంత్‌రెడ్డి, నిజంగానే మూసీ నిర్వాసితులపట్ల చిత్తశుద్ధిఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకన్న మిన్నగా చేయగలిగేదేమైనా ఉంటే తమకు సలహా ఇవ్వాల్సిందిగా ఆయన విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు విపక్షాలతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామనడం ప్రతిపక్షాల ఆరోపణలకు అడ్డుకట్టవేసినట్లైంది. విపక్షాల ఆందోళన, బాధితుల ఆర్తనాథాలు, కోర్టుల ప్రమేయం ఏమైతేనేమీ ప్రస్తుతానికి కూల్చివేతలకు కొంత విరామం లభించింది. కాని, చెరువుల్లో అక్రమ కట్టడాలైతేనేమీ, మూసీ ఆక్రమణ విషయంలోనైతేనేమీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దృఢ నిశ్చయంతో ఉంది. ఇప్పుడు ఉపేక్షిస్తే భవిష్యత్‌లో మహానగరం మురికి నగరంగా మారే అవకాశముందని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రక్షాళన కొనసాగిస్తామంటోన్న ప్రభుత్వానికి పరోక్ష ప్రజల మద్దతు లభిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page