అస్సాం ఒప్పందం సమర్ధనీయం

సెక్షన్‌6(ఎ) మీద నిన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన  తీర్పు చాలా కీలకమైంది. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి  డి వై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ సుందరేస్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ పార్థివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం నాడు 4:1 మెజారిటీ తీర్పుతో అస్సాంలోని అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం మంజూరుకు సంబంధించిన పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6(ఎ) రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. అసోం ఒప్పందం అక్రమ వలసల సమస్యకు రాజకీయ పరిష్కారమని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. జస్టిస్‌ జె బి పార్థివాలా మాత్రం ఈ  సెక్షన్‌ ఏకపక్షంగా ఉందని రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదంటూ మైనారిటీ తీర్పు ఇచ్చారు.

సెక్షన్‌ 6(ఎ) అంటే ఏమిటి?
1985 నాటి అస్సాం ఒప్పందాన్ని అనుసరించి 1985 పౌరసత్వ (సవరణ) చట్టంలో భాగంగా సెక్షన్‌ 6 (ఎ) రూపొందించబడిరది. అస్సాం ఒప్పందం అనేది 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం, ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌, ఆల్‌ అస్సాం గణ సంగ్రామ్‌ పరిషత్‌  చర్చలు జరిపి అస్సాం ఒప్పందాన్ని రూపొందడం జరిగింది. అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ , ఆల్‌ అస్సాం గణ సంగ్రామ్‌ పరిషత్‌ లు 26 మార్చి 1971న పశ్చిమ పాకిస్తాన్‌ నుండి బంగ్లాదేశ్‌ విడిపోయిన తర్వాత బంగ్లాదేశీ వలసదారుల ప్రవాహానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సమూహాలు. ఈ త్రైపాక్షిక ఒప్పందం సెక్షన్‌ 6(ఎ )అస్సాం కోసం ఒక ప్రత్యేక నిబంధనను రూపొందించింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6 (ఎ) ప్రకారం 1 జనవరి 1966 నుండి 25 మార్చి 1971 మధ్య భారతదేశంలోకి ప్రవేశించి అస్సాంలో నివసిస్తున్న వ్యక్తులు తమను తాము పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించబడతారు. రాష్ట్రంలో ‘‘సాధారణంగా నివాసం’’ ఉన్న విదేశీయులు 10 సంవత్సరాల పాటు ఓటు వేయలేరు తప్ప భారతీయ పౌరుల అన్ని హక్కులు, బాధ్యతలను కలిగి ఉంటారు.

కట్‌-ఆఫ్‌ తేదీ ఎందుకు అవసరం?
పాకిస్తాన్‌ నుండి బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రానికి దారితీసిన బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం, భారతదేశానికి వలస వచ్చినవారి భారీ ప్రవాహాన్ని చూసింది. 1971లో తూర్పు పాకిస్తాన్‌ నుండి బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం పొందే ముందు కూడా భారతదేశానికి వలసలు మొదలయ్యాయి. అందుచేత ఈ కట్‌ ఆఫ్‌ తేదీ అవసరం.

పౌరసత్వ చట్టం 1955 అంటే?
భారతదేశంలో పౌరసత్వ విషయాలను నియంత్రించేందుకు పార్లమెంటు పౌరసత్వ చట్టం 1955ను రూపొందించింది. ఇది భారత పౌరసత్వాన్ని ఎవరు పొందవచ్చో, ఏ ప్రాతిపదికన పొందవచ్చో నియంత్రిస్తుంది. అక్రమ వలసదారులు భారత పౌరసత్వం పొందడం నిషేధించబడిరది. పౌరసత్వ చట్టం – 1955 అమలులోకి వచ్చినప్పటి నుండి ఆరుసార్లు సవరించబడిరది. 1986, 1992, 2003, 2005, 2015, 2019 సంవత్సరాల్లో సవరణలు జరిగాయి. చివరిసారిగా  2019లో తాజా సవరణ ఏంటంటే ‘‘ 31 డిసెంబర్‌ 2014లో లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుండి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన కొంతమంది అక్రమ వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయబడిరది.

కీలకం ఎందుకు?
ఈ తీర్పు చాలా కీలకమైంది. మిగతా రాష్ట్రాల కంటే అస్సాంలో  ఎక్కువ వలసలు ఉన్నాయి. అక్రమ వలసలకు అస్సాం ఒప్పందం రాజకీయ పరిష్కారాన్ని చూపింది. కేవలం అస్సాంకే ఈ నిబంధన ఉండడం కీలకం.
-జనక మోహనరావు దుంగ
 8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page