న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కులగణన
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే.. స్వీకరిస్తామన్నారు. ఎంతో దూరదృష్టితో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేను చేపట్టిందని చెప్పారు. అయితే, గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్షపూరితంగా చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోని నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
న్యాయపర ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కులగణన కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలిసి మంత్రి విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 6న ఈ కార్యక్రమాన్ని గవర్నర్ కుటుంబ వివరాలతో ప్రారంభించామని, 8వ తేదీ వరకు 1,16,14,349 కుటుంబాలను గుర్తించామని చెప్పారు. ఈ నెల 17 (ఆదివారం) వరకు 67,72,246 లక్షల కుటుంబాల వివరాలను నమోదు చేశామని, మొత్తం 58.6 శాతం సర్వే జరిగిందని మంత్రి వెల్లడించారు. ఈ నెల 30 వరకు కులగణన పూర్తవుతుందని, వివరాలను క్రోడీకరించి ప్రజలకు ఆన్‌లైన్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
ఏ కుటుంబానికి ఏ అవసరం ఉంటుందని ఈ సర్వే ద్వారా తేలనుందని, రాష్ట్రంలో చేపట్టిన ఈ కార్యక్రమం దేశానికే రోల్ మోడల్ కానుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు తమ (మంత్రి ) కుటుంబం వివరాలను సైతం కులగణనలో ఇప్పటికే నమోదు చేసుకున్నామని, తాను తమ జిల్లా ఖమ్మంలో నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్లు , ఆదనపు కలెక్టర్లు ,జిల్లా యంత్రాంగం 75 అంశాల ఫార్మాట్ సర్వే కార్యక్రమంలో బిజీగా ఉన్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు కేటీఆర్, హరీష్ రావు కూడా కులగణన సర్వేలో తమ కుటుంబాల వివరాలను నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నమోదు చేసుకున్నందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు.