ఎగ్జిట్‌ ‌పోల్‌ అం‌చనాలు తారుమారు..

హర్యానాలో బిజెపి హ్యాట్రిక్‌ ‌విజయం
కాశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్‌ ‌కూటమి హవా..
జులానా నుంచి వినేశ్‌ ‌ఫోగట్ ‌గెలుపు
ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి సిఎం అన్న ఫరూక్‌

‌హరియాణా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠగా సాగిన హరియాణా పోరులో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యం సాధించింది . తొలుత కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా.. అనూహ్యంగా కమలం పుంజుకుని ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ‌ఫిగర్‌ను దాటేసింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వొచ్చింది. అటు జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ – ‌కాంగ్రెస్‌ ‌కూటమికి వోటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఎన్నికల పోలింగ్‌ ‌ముగిసిన తర్వాత అన్ని సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని అంచనా వేశాయి. కానీ  ఫలితాలు మాత్రం హర్యానా ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించినట్లు స్ప‌ష్ట‌మైంది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ‌చేసిన తప్పిదాలే ఆ పార్టీ మెజార్టీ మార్క్ ‌సాధించక పోవడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. హర్యానా ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రెజ్లర్‌ ‌వినేశ్‌ ‌ఫోగట్‌ ‌కాంగ్రెస్‌ అభ్యర్థిగా జులానా నుంచి పోటీచేసి గెలుపొందారు. హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం కాగా, బీజేపీ 50 స్థానాల్లో  ఆధిక్యం ప్ర‌ద‌ర్శించింది. కాంగ్రెస్ 34 ‌స్థానాలకు పరిమితమైంది.  ఇతరులు 6 స్థానాలను కైవ‌సం చేసుకున్నారు. అయితే ఇక్క‌డ‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం.  హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తప్పాయి. కమలం పార్టీ 50 స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు టీ 20 మ్యాచ్‌ను తలపించాయి. పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌లెక్కింపులో దూసుకెళ్లిన కాంగ్రెస్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఈవీఎంలు లెక్కింపు తర్వాత వైకుంఠపాళీ ఆటలో మాదిరిగా కాంగ్రెస్‌ ఒక్కో సీటు తగ్గుతూ వచ్చింది.

ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ‌బ్యాలెట్‌లతో వోట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట్లో కాంగ్రెస్‌ ‌దూసుకెళ్లింది. దాదాపు అరవైకి పైగా స్థానాల్లో ఆధిక్యం చూపించింది. ఈ దెబ్బకు బీజేపీకి 20 స్థానాలైనా వొవస్తాయా అన్న అనుమానం కలిగింది. కానీ 10 గంటల తర్వాత ఫలితాలు తారుమారు అవుతూ వొచ్చాయి. అప్పటి వరకు విజయం దిశగా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ ఒక్కసారిగా పడిపోయింది. బీజేపీ సునామీ మొదలైంది. యాభైకు పైగా స్థానాల్లో ఆధిక్యం చూపించి హర్యానాలో  ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. హర్యానాలో మొదటి ట్రెండ్స్ ‌చూసిన కాంగ్రెస్‌ ‌శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్స్ ‌పంచుకున్నాయి. బాణసంచా పేల్చాయి. వాళ్ల సంతోషం ఎంతసేపు నిలవలేదు. అక్కడ బీజేపీ అధికారంలోకి వొచ్చేలా ఫలితాలు వొస్తున్నాయి.

మ‌రోవైపు ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను తలకిందులు చేస్తూ జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ దూసుకెళ్లింది. కాశ్మీర్‌లో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ దూసుకెళ్తోంది. ఎన్సీ – కాంగ్రెస్ కూట‌మి 52 స్థానాలు,   బీజేపీ 28, పీడీపీ 2,  ఇత‌రులు  8 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. ఇక్కడబీజేపీపీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్‌‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పొత్తులో ఉన్నాయి. ఫ‌లితాల అనంత‌రం నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతారని తెలిపారు. ఆగస్ట్ 5 ‌నాటి ఆర్టికల్‌ 370 ‌రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పారు. ఒమర్‌ అబ్దుల్లానే  తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుందని ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు.ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page