- తెలంగాణ చరిత్రను నేటి తరానికి తెలియచేయాలి
- విమోచనను ఏటా నిర్వహించుకోవాలి: బిజెపి
సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకోవడం తెలంగాణ సాయుధ పోరాటాన్ని గౌరవించడమేనని మాజీ ఎమ్మెల్సీ, బిజెపి నేత రామచంద్రారవు అన్నారు. బిఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా దీనిని విస్మరించిందని అన్నారు. వీరికి కూడా మజ్లిస్ భయం పట్టుకుందన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదని సంతుష్టీకరణ చర్యలు తారస్థాయికి చేరుకున్నాయనడానికి కూడా ఇదో నిదర్శనమని అన్నారు. ఉమ్మడి ఎపిలో పాలకలు తీరులోనే కెసిఆర్ వ్యవహరించారు. ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి అలాగే వ్యవహరిస్తున్నారు తప్ప తెలంగాణ వ్యక్తిలాగా వ్యవహరించడంలేదన్నారు.
తెలంగాణ విమోచన దినాన్ని మరచిపోయి మాట్లాడుతున్న వారు గతంలో ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చకుంటే మంచిదని రామచంద్రరావు అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచనోత్సవాలను జరపాలని డిమాండ్ చేసిన వారు, అధికారంలోకి రాగానే మాట మార్చడం తెలంగాణ ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదని అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు ఉద్యమాలు చేపట్టామని అన్నారు. చివరకు కేంద్రం ముందుకు రావడంతో విధిలేకనే ఉత్సవాల నిర్వహణకు ముందుకు వొచ్చారని అన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ అమరవీరుల త్యాగాలు వృథా అవుతున్నాయని, వాటి గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరముందని చెప్పారు. అమరుల జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా చేసి నేటి యువతకు తెలియ జెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. అధికారంలోకి రాగానే విమోచనా దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీకి భయపడి మాట మార్చారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస ఆయన దారిలోనే నడుస్తోందని,. ఇలాంటి చర్యలను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజలను చెట్టుకు కట్టేసి కాల్చడం, మహిళలపై అత్యాచారాలు చేసి బంగారాన్ని, ధనం, ధాన్యాన్ని లూటీ చేయడం వంటి ఘటనలు, రజాకార్ల ఆకృత్యాల గురించి నేటి తరానికి తెలియాల్సి ఉందన్నారు. నిర్మల్‌లో ఆ ప్రాంతంలో నిజాం రాక్షస పాలనకు అడుగడుగునా అడ్డుపడుతున్న రాంజీ గోండు, ఆయన అనుచరులు వెయ్యిమందిని మర్రి చెట్టుకు ఉరితీసిన నిజాం దుర్మార్గాల గురించి కూడా తెలంగాణ విద్యార్థులకు తెలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే నాటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా చరిత్రను తెలియచేయాల్సి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి పది సంవత్సరాలు గడిచినా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునేందుకు ఇష్టపడటం లేదు. ఇతర రాజకీయ పార్టీలు కూడా విమోచన దినాన్ని జరుపుకునే విషయంలో అర్థంలేని ప్రకటనలు చేస్తున్నాయి. నిజాంకు వ్యతిరేకంగా చాలా మంది ముస్లింలు కూడా పోరాడారని అన్నారు. నిజాంకు కంటివిూద కునుకులేకుండా చేసిన షోయబుల్లాఖాన్‌ను రజాకార్లే క్రూరాతిక్రూరంగా చంపించిన సంగతిని మనం గుర్తుచేసుకోవాలన్నారు.. విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా కుల, మతాలకు అతీతంగా నిజాం, రజాకార్లపై పోరాటం చేసిన వీరులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు అన్నారు. వీరందరి కృషి కారణంగానే తెలంగాణ, భారతదేశంలో విలీనమైంది. మన గడ్డవిూద త్రివర్ణపతాకం ఎగిరింది. మనకు స్వేచ్ఛ, స్వాతంత్యాల్రు లభించాయన్నారు. ఇప్పటికైనా బానిసత్వపు ఆలోచనలను విడనాడి మన వాస్తవ చరిత్రను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో ముందుకు కదలాలని అన్నారు.