విశ్వమంతా వినాయకుడు

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్ అని పిలిచినా, రోమన్లు జేనస్ అని, ఈజిప్మియస్లు గునీస్ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు.ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో క్యారెట్ పట్టుకున్న వినాయకుణ్ణి గర్భధాతు గణపతి అంటారు. ఈ గణపతి విగ్రహాలు చైనా, జపాన్ దేశాల్లో లభించాయి. ఆగ్నేయాసియా దేశాలలో భారతీయులకు వాణిజ్య సంబంధాలు ఉండడం వల్ల భారతదేశానికి వెలుపల కూడా మన నాగరికత విస్తరించింది. అందులో ప్రముఖంగా  చెప్పుకోవలసింది గణపతి ఆరాధనను గురించే.

కొలంబస్ కు ముందు నుంచి…
ప్రాచీనకాలం నుంచే అమెరికాలో వినాయకుడి ఆరాధన ఉంది. దివాన్ చమన్ లాల్ తన ‘హిందూ అమెరికా’ అనే గ్రంథంలో కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొనే ముందే (1492) హిందువులు అక్కడికి చేరారనీ, వినాయకుని ఆరాధించారని అభిప్రాయపడ్డారు. అమెరికా ఖండంలోని పెరూ, మెక్సికోలలో ఇంకా తెగకు చెందిన ఆదివాసులలో గణపతి ఆరాధన ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి.

లంకా ద్వీపంలో గణేశుడు..
శ్రీలంకలోని ‘పోలిన్నరువ’ సమీపంలోని శివాలయంలోని ఒక స్తంభంపైన చతుర్భుజాలు, చేతిలో కుడుమును కలిగి ఉన్న వినాయకుని శిల్పం ఉంది. కొలొంబోకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ‘కటర్ గమ్’లో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకునికి ప్రత్యేక సన్నిధి ఉంది. ఈ వినాయకుడిని హిందువులతో పాటు మహ్మదీయులు, క్రైస్తవులు కూడా పూజించడం విశేషం.

ఏనుగుల దొర…
చైనా భాషలో వినాయకుడిని ‘కువాన్– షి-ఆయేన్’ అని పిలుస్తారు. ఇక్కడి శాసనాల్లో వినాయకుని ఏనుగుల దొరగా పేర్కొన్నారు. చైనాలో క్రీ.శ. 531 ప్రాంతానికి చెందిన వినాయకుని శిల్పం ఒకటి ‘కుంగ్-హ్సియన్’ ఆలయ గోడలపై లభించింది. అలాగే ‘తుని హువాన్’ గుహలోని గోడలపై వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. వీటిలో వినాయకుడు ఒక చేతిలో కమలం, మరో చేత ‘చింతామణి’ ని ధరించి ఉన్నాడు. అలాగే ఇద్దరు వినాయకులు ఒకరినొకరు కౌగిలించుకున్న రూపంలోని ప్రతిమ కూడా లభించింది. ఈ కవల వినాయక ప్రతిమ జపాన్ వినాయక ప్రతిమను పోలి ఉన్నది.

బౌద్ధంలో వినాయకుడు…
గణపతి ఆరాధన 10వ శతాబ్దం నాటికి బాగా విస్తృతమైనట్లు తెలుస్తోంది. ‘హేరంబ గణపతి’ని నేపాల్ లో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక గణేశ కాంస్య విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వినాయకునికి మూషికవాహనంతో పాటు సింహం కూడా వాహనంగా కనిపిస్తుంది. కొన్ని విగ్రహాల్లో ఒక కాలి కింద సింహం, మరో కాలి కింద మూషికం ఉండగా, మరికొన్నింటిలో రెండు కాళ్ళ క్రింద రెండు ఎలుకలు ఉండడం కనిపిస్తుంది. కాగా, ఈ దేశంలో బుద్ధుడు రాజగృహం వద్ద తన శిష్యుడైన ఆనందుడికి గణపతినీ స్తుతించే గణపతి హృదయాన్ని ఉపదేశించినట్లు ప్రచారంలో ఉంది. బౌద్ధ ప్రచారానికి శ్రీలంకకు చేరుకున్న మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడి కుమార్తె అక్కడ వినాయకుడి ఆలయాన్ని కట్టించినట్లు నేపాల్ దేశంలో ప్రచారంలో వుంది.

మూడు కన్నుల దేవర…
జావాలో అత్యంత ప్రాచీనకాలం నుంచే వినాయక ఆరాధన ఉన్నది. జావాలోని గణపతి విగ్రహాల్లో ‘డియాంగ్ ప్లే బ్యూ’లోని విగ్రహం ప్రధానమైంది. 13వ శతాబ్ది నాటి ఈ విగ్రహం కిరీటాలంకృతునిగా కనిపిస్తుంది. బాలిద్వీపంలో 8, 9 శతాబ్దాలనాటి వినాయకుడి విగ్రహాలు అనేకం లభించాయి. వీటికి మూడు కన్నులు ఉండడం విశేషం.

సుమో యోధుడు…
జపాన్ లో వినాయకుని ‘కాంగితెన్’,  ‘వినాయక్ శోదెన్’ అని వ్యవహరిస్తారు. కాంగి తెన్’ అంటే శుభాన్నీ, సమృద్ధినీ ప్రసాదించేవాడు అని అర్థం. క్రీ.శ 806లో ‘కోబోదాయిష్” అనే బౌద్ధమతస్తుడు జపనీయులకు వినాయకుడ్ని పరిచయం చేశారు. ఇద్దరు వినాయకులు ఒకరినొకరు కౌగిలించుకున్న రూపంలోని ప్రతిమలున్నాయి. రెండు, నాలుగు ఆరు, చేతులు కలిగి, వివిధ భంగిమలలో ఉన్న వినాయక విగ్రహాలు కూడా కనిపిస్తాయి. భక్ష్యపాత్ర, గొడుగు, ధనుర్బాణాలు, కందమూలాలను వినాయకుడు చేతులలో ధరించి కనిపిస్తాడు. సుమో యోధులను పోలిన విగ్రహాలు కూడా జపాన్ దేశంలో దర్శనమిస్తాయి.

ఇస్లాం దేశాల్లో…
ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ గణపతి ఆరాధన సాగుతూ ఉంది. కాబూల్ నగరానికి దగ్గరలో ఉన్న ‘సకరేధర్’ లో వినాయకుడి విగ్రహం లభించింది. నిలుచున్న ఈ వినాయకునికి ఇరువైపులా రెండు గణాలు కనిపిస్తాయి. చతుర్భుజాలు కలిగిన వినాయకుడు తన రెండు చేతులనూ ఈ గణాలపై ఉంచాడు. ఈ విగ్రహం గుప్తులు లేదా కుషాణుల కాలం నాటిదై ఉంటుందని చరిత్రకారుల భావన.

నాలుగు తలల గణపతి…
ప్రాచీన కాలం నుంచీ మన దేశంలో సాంస్కృతిక సంబంధాలను కలిగిన కాంబోడియలో గణపతి ఆరాధన అప్పటి నుంచే కనిపిస్తున్నది. 6వ శతాబ్దం నాటి అంకార్ వట్ శాసనం గణపతి ఆలయానికి బానిసలను దానం చేసినట్లు చెబుతున్నది. కాంబోడియాలోని ‘చో చుంగ్ డ్రి’ లో గణపతి ఆలయ శిథిలాలు ఇంటికి కనిపిస్తున్నాయి. ‘కుక్ ట్రాప్యాంగ్ కుల్’ దేవాలయంలో వినాయకుని విగ్రహాలు ఉన్నాయి. ‘స్టేక్ ధార్స్ కెండల్’ మ్యూజియంలో నాలుగు తలల గణపతి విగ్రహం ఉంది.

వియత్నాంలో…
ఈ దేశంలో గణపతి ఆలయాలను నిర్మించినట్లు 8వ శతాబ్దం నాటి శాసనాల్లో ఉంది. లభించిన అనేక వినాయకుడి విగ్రహాల్లో ‘ద్విభుజ గణపతి’ విగ్రహం అపూర్వమైంది. ఒక చేతిలో మోదకపాత్ర, మరొక చేతిలో చేతికర్రను ధరించిన వినాయకునికి తల బోడిగా ఉండడం, యజ్ఞోపవీతం, ఆభరణాలు లేకపోవడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.

ఇతర దేశాలలో…
మయన్మార్ (బర్మా)లో 11వ శతాబ్దం నాటికే గణపతి ఆరాధన ఉన్నట్లు తెలుస్తున్నది. రంగూన్ మ్యూజియంలో ఆరుచేతుల గణేశ ప్రతిమ ఉన్నది. థాయ్ లాండ్, బ్యాంకాక్ ఆలయంలోని వినాయక విగ్రహం జకార్తా మ్యూజియంలో గణేశ విగ్రహం గణేశారాధనకు నిదర్శనాలు. మంగోలియాలో నాట్య గణపతి విగ్రహాలు లభించాయి. ఇండోనేషియాలో గణపతి బొమ్మతో ఉన్న కరెన్సీ వాడకంలో ఉన్నది. సయామ్ లో లభించిన వినాయకుడు కూర్మ వాహనుడు. ఆయన చేతిలో చింతామణి ఉండడం ఒక విశేషం.
 -రామకిష్టయ్య సంగనభట్ల
9440595494.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page