అన్ని రంగాల్లో, విభాగాల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి
సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమున్నతంగా, సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా, బయటా కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి. మానవ మృగాల నుంచి అనేక విధాలుగా అకృత్యాలకు నిలయంగా, అనాగరికత ముఖచిత్రంగా మారుతోంది. ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలనలో ఆడపిల్లలు, మహిళలపై అమానుష అకృత్యాలకు బరితెగిస్తూ, తెగబడుతున్న కీచకులకు సకాలంలో కఠిన శిక్షలు విధించలేనప్పుడు, లింగ వివక్షను సమూలంగా సమాజం నుండి నిర్మూలించినప్పుడు చట్టబద్ద పాలన ఎలా అవుతుంది? కలకత్తాలోని ఆర్.జీ వైద్య కళాశాల ఆసుపత్రిలో డాక్టర్ పై ఘోరాతి ఘోరంగా, అమానుషంగా హత్యాచార ఘటనకు పాల్పడిన రాబందులకు శిక్ష పడుతుందా.. చట్టాలు చట్టుబండలై, నేరస్తులకు చుట్టాలవుతున్నాయని యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనవుతుంది. గత 12 ఏళ్ల క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో ‘‘నిర్భయ’’ పై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా గగ్గోలు రేపింది. స్త్రీలకు సరైన రక్షణ కల్పించలేని వ్యవస్థల అసమర్ధతను చీత్కరిస్తూ ఆనాడు యువత పెద్ద ఎత్తున ఉద్యమించింది. ఇకపై అటువంటి ఘోర కృత్యాలు దేశంలో చోటు చేసుకోకుండా చూస్తామంటూ మాటలేన్నో చెప్పిన నాటి పాలకులు హడావుడి చట్టాలను పదును పెట్టారు.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కీచకులకు కట్టిన శిక్షలు ప్రతిపాదించారు. అయినా ఆ తర్వాత కూడా హైదరాబాద్ లో ‘దిశ’ఉదంతం చూసినాము. ఇలా మహిళలపై అకృత్యాలు నిత్యం దేశంలో జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా శిక్ష పడుతుందనే భయం లేకనే ఇంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆనాడుతో పోలిస్తే పరిస్థితులు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారమే 2012లో దేశవ్యాప్తంగా స్త్రీలపై దాదాపు పాతికవేల అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. 2022లో అవి 31,516కు పెరిగినాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర , హర్యానా , ఒడిశాలో మృగాళ్లు స్వేచ్ఛా విహారం చేస్తున్నట్లు సర్కారీ నివేదికలే వెల్లడిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలను స్త్రీలపై లైంగిక దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయి. గృహహింస, అపహరణ, హత్యాచారం, బాలికలు, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు వంటివి ఏడాదికి ఏడాది అధికమవుతున్నాయి. ఇది మహిళలకు ప్రాణ సంకటంగా,ప్రగతికి ఆటంకంగా మారుతుంది.
-లతాశ్రీ