తిలా పాపం తలా పిడికెడు

చాలా రోజుల తరువాత జోలి వేసుకోవాలని అనిపించింది. జోలి…. అంటే అదే ముచ్చట!
ఈమధ్య కాలంలో ముచ్చట పెడదామని అనుకునేలోపే ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులు వస్తూ పాతవాటిని పక్కకు తోస్తూ వస్తున్నాయి. ఎన్నో విషయాలు. ..కలకత్తా మెడికో పై అఘాయిత్యం, హత్యా. ..వినాయక నిమజ్జనం లో డీజే ల దంచుడు మోతలు, నిన్న గాక మొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తప్పుడు స్టెప్పు. ..ఇప్పుడు వివాదాస్పదమైన పవిత్రమైన తిరుమల శ్రీవారి  లడ్డు. తన ఐదేళ్ల పాలనలో గత ప్రభుత్వం కోట్లకు కక్కుర్తి పడి వెంకన్న కు ఆరగింపు గా సమర్పించుకునే ప్రసాదాలకు వాడే నెయ్యిని అపవిత్రం చేసిందని ఇప్పటి ప్రభుత్వం ఆరోపణ.
పాపం క్షమించుగాక అని వదిలేయక నేరం చేసిన వాళ్ళను అదీ తిరుపతి వెంకన్న కు ద్రోహం చేసిన వాళ్ళను వదిలేయవద్దు కదా.. తిరుమలవాసుడికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఉన్నారు.వారి ఇలవేల్పు  గా భక్తుల కొంగు బంగారం అయ్యారు స్వామి వారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీటీడీ యాజమాన్యం, గత ప్రభుత్వం జవాబుదారి వహించాల్సిందే. మోకాళ్లపై ఏడు కొండలూ మెట్ల ద్వారా ఎక్కి స్వామి వారి ముందు మొకర్రిల్ల వలసిందే. దేవుడు ఆన్నీ గమనిస్తూనే ఉంటాడు. తనకు, తనను కొలిచే భక్తులకు నమ్మకద్రోహం చేస్తే ఆయన ఊరుకోడు. ఆలస్యంగా నైనా శిక్షపడి తీరాల్సిందే!
ఐతే ఈ పాపంలో మన వంతు లేదా. ..
గత ఐదేళ్లు గా తిరుమల వెళ్లి వస్తున్న భక్తులకు గానీ, ప్రజా పాలకులకు గానీ, ప్రతిపక్ష నేతలకు గానీ.,సెలబ్రిటీలకు గానీ, మీడియా కు గానీ లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని అనిపించలేదా… ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంది. వాక్ స్వాతంత్య్రం మన హక్కు! తప్పు జరుగుతున్నదని తెలిసీ సరిచేయడానికి ప్రయత్నించకపోవడం మహా నేరం. ఇన్నేళ్లు ఎవరికీ అనుమానం రాలేదా. ..
సామాన్య ప్రజలకు చాలా మంది భక్తులకు తిరుపతి లడ్డు వెనకటి రుచి లేదని నేతి బీరకాయ చందం అయిందని సందేహం కలిగింది. నెయ్యి కి బదులుగా కొవ్వు వాసన వస్తున్నదని ఇప్పుడు తప్పును లేవనెత్తిన వాళ్లకు ఎందుకు అప్పుడు ఆ  అనుమానం రాలేదు. ..
అంటే అవకాశం కోసం చూస్తున్నట్టా. …
ఒకవేళ కల్తీ జరుగుతున్నదని తెలిసినా అప్పుడది అప్రస్తుతం అనుకుంటే వారూ దేవుడిని మోసం చేసినట్టే కదా.
ఈ అయిదేళ్ళు దేవుడిని పస్తులుంచిన పాపం తలా వంతే కదా. ..
ఇది న్యాయమా. ..
ఇది మాలాంటి సామాన్యుల జోలి మాత్రమే. ..
ఈ ముచ్చటలో లాజిక్కులు వెతకొద్దు. ..
సైంటిఫిక్ రీజన్లు కెలకొద్దు. ..
అయ్యో అందరు కలిసి ఆ దేవుడికే అన్యాయం తలపెట్టారన్న బాధ. ..
ఇది మామూలు ముచ్చట కాదు. ..
పాలకులు ప్రతిపక్షాలు. ..ఇంకా వాళ్ళు వీళ్ళు కలిసి పిలిస్తే పలికే ఆ దేవదేవుడిని మోసం చేసినట్టే కదా!
మళ్లీ ఓ ముచ్చటతో అరుగు పై కలుద్దాం
చివరగా ఓ మాట. ..
మాన్యులు, గౌరవనీయులు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ముఖ్యమంత్రి పదవికి  కొత్తకాదు. అపారమైన రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న నాయకుడు.. విశ్వవ్యాప్తంగా
దేవుడికి భక్తుడికి మధ్య ముడిపడి ఉన్న అతి సున్నితమైన అంశాన్ని మేధస్సుతో పరిష్కరించకుండా.. ఈ విధంగా వివాదం  చేయడం విజ్ఞత అనిపించుకుంటుందా. …
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు రాజకీయ చదరంగంలో భక్తులను పావులను చేయడమే..
దోషులను శిక్షించాల్సిందే సరియైన ఆధారాలతో!
-వీణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page