- విజయ్ కుమార్ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
- ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునఃసమీక్షించుకోవాలి
- టీపీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : రాష్ట్ర విద్యా శాఖలో నిర్మల్‌లో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధాాయులుగా పనిచేస్తున్న ఆరెపల్లి విజయ్ కుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేయడాన్ని తీప్రంగా ఖండిస్తున్నామని, ఆయనపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు 2023 డిసెంబర్ నుంచి వివిధ రూపాలలో పోరాడుతున్నారు. ఒక దశలో లోక సభ ఎన్ని కల వరకు , వివిధ్ రాజకీయ పార్టీలు ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన హామీల నేపథ్యంలో కంపెనీ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ ఎన్నికలు పూర్తయ్యాక మళ్ళీ పనులు ప్రారంభం కావడంతో ప్రజలు 100 రోజులలకు పైగా గ్రామాల్లో దీక్షలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలకు విజయ్ కుమార్ టీపీజేఏసీ చైర్మన్ హోదాలో సంఘీభావం ప్రకటించారు. ఇదే సమస్యపై జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశాలలోనూ విజయ్ కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో ప్రజా భవన్ లో అధికారులను కలిసి మెమోరాండం ఇచ్చినపుడు కూడా ఆయన ప్రజల వెంట ఉన్నారు. అయితే ఆయన అన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని టీపీజేఏసీ సభ్యులు తెలిపారు.
అయితే, విజయ్ కుమార్ ప్రజలకు సంఘీభావగా నిలబడడం కంపెనీ యాజమాన్యానికి కంటగింపుగా మారిందని, ఆయనపై తప్పుడు ఆరోపణలతో చర్యలు తీసుకునేలా జిల్లా పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తూ వొచ్చారని ఆరోపించారు. సెప్టెంబర్ లో జిల్ల విద్యా శాఖ ఉన్నతాధికారి ద్వారా షోకాజ్ నోటీసు ఇప్పించారని,దీనిపై విజయ్ కుమార్ తగిన ఆధారాలతో అక్టోబర్ 1న తగిన వివరణ ఇచ్చారని తెలిపారు. అయితే ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు త్మ పోరాటాన్ని కొనసాగించారని, అక్టోబర్ 18న 10,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడంతో సహించలేని కంపెనీ యాజమాన్యం,మరోసారి జిల్లా అధికారులపై ఒత్తిడి చేసి నవంబర్ 2న విజయ్ కుమార్ ను విధుల నుండి సస్పెండ్ చేయించిందని విమర్శించారు. సామాజిక బాధ్యత కలిగిన ఒక టీచర్ ను సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిలిగిపోతుందని అన్నారు.
ప్రజల ఆకాంక్షలు వినకుండా, ఇథనాల్ తో ఉన్న సమస్యలపై శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను వినకుండా, కేవలం ఇథనాల్ కంపనీ యాజమాన్యం చెప్పినట్లు ప్రభుత్వం, అధికారులు నడుచుకోవడం సిగ్గుటని, దీనిపై ప్రభుత్వం తన మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రూల్స్ పేరుతో, ఉద్యోగుల ప్రాథమిక హక్కులను హరించడం, ప్రజా పాలన, ప్రజాస్వామిక పాలన అనిపించుకోదని, ప్రజల గొంతు విని రాష్ట్రంలో ఇథనాల్ పాలసీని సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు. .
విజయ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ, ప్రభుత్వం కొన్ని తప్పుడు ఆరోపణలు చేసింది. అవన్నీ ఊహాజనితాలు, కల్పితాలు అని మేము భావిస్తున్నామని టీపీజేఏసీ పేర్కొంది. విజయ్ కుమార్ ప్రస్తుతం టీపీజేఏసీ లో పని చేయడాన్ని, తెలంగాణ ప్రజల గురువు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కు సన్నిహితంగా ఉండడాన్ని కూడా ఈ సస్పెన్షన్ ఆర్డర్ లో నేరంగా చూపించడం హాస్యాస్పదమన్నారు. గత మూడు దశాబ్దాలకు పైగా విజయ్ కుమార్ రాష్ట్ర ప్రాథమిక విద్యా రంగంలో టీచర్ ప్రధానోపాధ్యాయుడుగా తన విధులను అత్యంత నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారని, విధి నిర్వహణలో ఆయనపై ఎటువంటి విమర్శలు, ఆరోపణలు లేవన్నారు. పైగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకుడిగా, జిల్లా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఉపాధ్యాయుల సమస్యలపై పని చేస్తున్నారని జేఏసీ వివరించింది.
టీపీజేేేఏసీ తీర్మానాలు..
కాగా ఈమేరకు టీపీజేఏసీ పలు తీర్మానాలు చేసింది. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, సామాజిక బాధ్యత కలిగిన ప్రజాపక్ష విద్యావేత్త, ఆరేపల్లి విజయ్ కుమార్ సస్పెన్షన్ ను బేషరతుగా ఎత్తివేసి, ఆయనను వెంటనే విధుల లోకి తీసుకోవాలి.
ఆయనపై పోలీసులు బనాయించిన అన్ని అక్రమ కేసులను పూర్తిగా ఎత్తి వేయాలి. అనుమతి లేకుండా ఆయన నిర్మల్ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి లేదంటూ పెట్టిన ఆంక్షలను తొలగించాలి.
చిత్తనూరు, దిలావర్ పూర్, గుండంపల్లి, రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా ఇథనాల్ కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామీణ ప్రజలతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించి, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపనీ విషయంలో వారు లేవనెత్తుతున్న అభ్యంతరాలను లోతుగా పరిశీలించాలి.
చిత్తనూరు, దిలావర్ పూర్ లో ప్రజలపై, పెట్టిన అన్ని అక్రమ కేసులను ఎత్తేయాలి. చిత్తనూరు ఉద్యమ కార్యకర్తలపై పెట్టిన రౌడీ షీట్ ని ఎత్తేయాలి. ఉద్యమానికి మద్దతు తెలిపాడని ఆరోపిస్తూ, కక్ష సాధింపుగా బండారి లక్ష్మయ్య అనే ఇంటర్ కాలేజీ లెక్చరర్ ను నగరానికి దూరంగా ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని సమీక్షించాలి.ఆయా ప్రాంతాలలో ప్రజలపై, ఉద్యమ నాయకులపై పెట్టిన అన్ని అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలి.
రాష్ట్రంలో పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు అధికారులతో ఒక నిజ నిర్దారణ బృందాన్ని ఏర్పాటు చేసి చిత్తనూరు,పర్లపల్లి సహా ఇథనాల్ కంపనీలపై ప్రజలు చేస్తున్న ఆరోపణలను,విమర్శలను లోతుగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలి.
రాష్ట్రంలో 30 ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునః సమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వం విచక్షణా రహితంగా తెచ్చిన ఇథనాల్ పాలసీని వ్యతిరేకించాలని టీపీజేఏసీ తీర్మానాలు చేసింది.
కార్యక్రమంలో టీపీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్, పీవోడబ్ల్యూ జాతీయ అధ్యక్షులు వి. సంధ్య, టీపీజేఏసీ కో కన్వీనర్ అంబటి నాగయ్య, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా నారాయణ రావు, భారత్ జోడో అభియాన్ కో ఆర్డినేటర్ విస్సా కిరణ్ కుమార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు వి. బాలరాజు/సంజీవ్, 7. టిపిజేఏసీ కో కన్వీనర్ కన్నెగంటి రవి రాష్ట్ర నాయకులు బి. కొండల్ రెడ్డి పాల్గొన్నారు.