జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
న్యూదిల్లీ,నవంబర్19:మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. దిల్లీలోని శక్తి స్థల్‌లో ఉన్న ఇందిరా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. సందర్భంగా రాహుల్ తన నానమ్మతో ఉన్న అపురూప ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తన గ్రాండ్‌మా ధైర్యం, ప్రేమ రెండింటికీ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఆమె నుంచి ఎన్నో నేర్చుకున్నట్లు తెలిపారు.
ఆమెతో ఉన్న జ్ఞాపకాలే తన బలం అని.. ఎల్లప్పుడూ అవే తనకు మార్గం చూపుతాయంటూ రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ.. నివాళులర్పించారు. దేశ్యాప్తంగా దివంగత ప్రధాని ఇందిరకునివాళి అర్పించారు. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమలా నెహ్రూ దంపతులకు 1917, నవంబర్ 19న ఇందిరాగాంధీ జన్మించారు. 1960లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 1964 నుంచి 1966 వరకు సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పని చేశారు. తండ్రి మరణం తర్వాత 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత ప్రధానిగా కొనసాగారు. ఇందిరాగాంధీ దేశానికి మొదటి మహిళా ప్రధాని కావడం విశేషం. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బంది కాల్పులు జరపడం తో హత్యకు గురయ్యారు.