యూనివ‌ర్సిటీల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే..

  • గ‌త ప‌దేళ్ల‌లో విద్యావ్య‌వ‌స్థ నిర్వీర్యం
  • వ‌ర్సిటీల‌పై నమ్మకం కలిగించేలా పనిచేయండి
  • మంచి ప‌నుల‌కు వీసీల‌కు పూర్తి స్వేచ్చ‌, స‌హ‌కారం..
  • కొత్త వీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 2 : రాష్ట్రంలో కొంత కాలంగా యూనివర్సిటీల‌పై నమ్మకం స‌డ‌లిపోతోంద‌ని ఈ ప‌రిస్థితిలో మార్పు రావాలని, యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పనిచేసి వారి గౌర‌వాన్ని పెంచాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శ‌నివారం అన్ని యూనివర్సిటీ ల నూతన వైస్ ఛాన్సలర్లు భేటీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు ముఖ్య‌మ‌త్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు. ఎవరి ప్రభావితంతోనో వైఎస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేద‌ని ఆరోపించారు. మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే వీసీల ఎంపిక జరిగింద‌ని, బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల‌న్నారు.
కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలి. యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలి. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలి. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుంది. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, కార్యదర్శి ప్రొ ఫెస‌ర్‌ శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page