విజయోత్సవ సభ గ్రాండ్ స‌క్సెస్‌..

నాయకుల స‌మ‌ష్టి కృషితో విజ‌య‌వంతం
నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి )

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొదటిసారిగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన.. విజయోత్సవ సభ’  గ్రాండ్ స‌క్సెస్ అయింది.  ఈ విజయానికి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కొట్టవచ్చినట్లు కనిపించింది. కాంగ్రెస్‌ అం‌టేనే భిన్నాభిప్రాయాలుంటాయన్న దానికి భిన్నంగా నాయకులంతా ఒకే వేదికను పంచుకోవడం రేవంత్‌రెడ్డి పాలనాదక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపు వారం రోజులుగా ఈ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి వొచ్చే నెల 9వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలు వరంగల్‌ల్లోనే శ్రీకారం చుట్టడంతో మంత్రులంతా సభను సక్సెస్‌ ‌చేయడానికి విపరీతంగా శ్ర‌మించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపీలతో సమావేశాలు ఏర్పాటుచేసి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సహజంగానే అలకలు, ఆగ్రహావేశాలు ఉండే పార్టీలో ఈసారి అలాంటి సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదు.

హనుమకొండ, వరంగల్‌ ‌జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ ‌నాయకులు, ప్రజాప్రతినిధులంతా సభకు హాజరుకావడం విశేషం. అయితే ఎప్పటిలా నర్సంపేట ఎంఎల్‌ఏ ‌దొంతి మాధవరెడ్డి మాత్రం ఈసారికూడా హాజరుకాలేదు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వరంగల్‌లో జరిగిన ఏ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ సభకు కూడా ఆయన రాకపోవడం పార్టీలో ఇంకా అక్కడక్కడ విభేదాలున్నాయనడానికి కారణమవుతున్నది. ఆ ఒక్కటి మినహా సభ అంతా సజావుగానే సాగిందని చెప్పవచ్చు. జిల్లా నాయకులతో పాటు జిల్లా ప్రజలు కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా సుమారు ఆరువేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన పట్ల ప్రజల నుంచి పెద్దగా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా భూగర్భ డ్రైనేజీ, ఎయిర్‌పోర్టు అభివృద్ధి విషయాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. తమ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యంగా ప్రకటించిన ముఖ్యమంత్రి దాన్ని అడబిడ్డలకు అంకితం చేస్తున్నామనడంతో మహిళల నుంచి విశేష స్పందన వొచ్చింది. అలాగే  తమ ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని ఆయన వివరించినప్పుడు మహిళ నుంచి హర్షధ్వానాలు వినిపించాయి.

బిఆర్ఎస్‌, బిజెపిపై ఫైర్‌
ఇదిలా ఉంటే సీఎం తన ప్రసంగంలో విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు. తాము చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు అడుగడుగునా ఆ పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని వారి సంగతేమిటో తేలుస్తానన్నారు. ప్రధానంగా బిఆర్‌ఎస్‌, ‌దాని అధినేత కెసిఆర్‌ను టార్గెట్‌ ‌చేస్తూ బిఆర్‌ఎస్‌ను మళ్ళీ మొలకెత్త‌నివ్వ‌న‌ని అన్నారు. ఆ పార్టీ అధినేత సంగతులన్నీ తనకు తెలుసని, ఆయన ఎత్తుగడలకు తగినట్లుగానే ఆయన జవాబు చెబుతానన్నారు. ఆలాగే బిజెపిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. అటు ప్రధాని నరేంద్ర మోదీని, ఇటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దులిపేశారు. కిషన్‌రెడ్డి వాడిన గులాంగిరీ పదాన్ని ఆయన పదేపదే ఉచ్చరిస్తూ, తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, ఆమెను తాము తల్లిలాగే భావిస్తామన్నారు. తెలంగాణ విషయంలో తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి కిషన్‌రెడ్డి గులాంగిరీ చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడాలని సలహా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page