2050 విజన్‌తో మాస్టర్‌ప్లాన్‌కు అడుగులు
మంత్రి పొంగులేటి ప్రకటనతో ప్రజల్లో ఆశలు..
వరంగల్ వాసుల దశాబ్దాల కల సాకారమయ్యేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. వరంగల్ మహానగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుం టోంది. 2050 లో వరంగల్ జనభాను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశారు. అయితే వివిధ రంగాల్లో అత్యంత త్వరితగతిన ముందుకు దూసుకుపోతున్న క్రమంలో కేవలం 25 ఏళ్ల ప్రాతిపదికన తయారు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ సరిపోదని, కనీసం నలబ్కె ఏళ్ల ముందుచూపుతో రూపొందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా వరంగల్‌లో సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను అమలు విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వరంగల్ మున్సిపాలిటీ అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం గ్రేటర్ మున్సిపాలిటీగా అవతరించింది. అయినా ఎప్పుడో 50 ఏండ్ల కిందటి హైదరాబాద్ మాస్టర్ ప్లాన్‌నే ఇక్కడ అమలు పరుస్తూ వొచ్చారు. రాజకీయ, వాణిజ్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ట్క్రె సిటీ (వరంగల్, హన్మకొండ, కాజీపేట) విస్తీర్ణం కూడా క్రమేణా పెరుగుతూ పోతోంది. ఇప్పటికే చుట్టుపక్కలున్న దాదాపు 180 గ్రామాల వరకు మున్సిపాలిటీ పరిధిలో చేరాయి.
దీంతో మొదట్లో 60 చదరపు కిలోమీటర్లుగా ఉన్న నగర పరిధి ఇప్పుడు దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. దానికి తగినట్లుగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు అనేకం రావడంతో జనాభా సంఖ్యకూడా పెరుగుతూ వస్తున్నది. కాని, ఇక్కడ 1972 నాటి మాస్టర్ ప్లానే ఇంకా అమలవుతుండడంతో నగరం ప్రణాళికాబద్దంగా విస్తరించడంలేదన్న అపవాదు ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వకాలం నుంచి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇదిగో అదిగో మాస్టర్‌ప్లాన్ అంటూ చెబుతూ వొచ్చిందే గానీ, కొత్త మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయలేకపోయింది. 1991లో ఆ తర్వాత 2013లో గత మాస్టర్ ప్లాన్‌ను సవరించినప్పటికీ అది కూడా అమలుకు నోచుకోలేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ చివరి మూడేళ్లు నాటి ముఖ్యమంత్రి అనుమతి కోసం పెండింగ్‌లోనే ఉంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యమున్న జిల్లాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పేరుండింది. ఒకనాడు కాకతీయ రాజులు ఏలిన ఈ ప్రాంతానికి రాజధానిగా విలసిల్లిన ఓరుగల్లు తెలంగాణకు రెండో రాజధాని అవుతుందంటున్న క్రమంలో ఆమేరకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకునే విషయంలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతూనే ఉంది.
తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో వరంగల్ అభివృద్ధిపై జరిగిన సమావేశం మాస్టర్ ప్లాన్ వరంగల్‌కు కొత్త మాస్టర్‌ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా దాన్ని విడుదల చేయనున్నట్లు వరంగల్ ఇన్‌ఛార్జి మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించడంతో ఇప్పటికైనా కొత్త మాస్టర్ ప్లాన్ అమలవుతుందన్న నమ్మకం కలుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరంగల్ అభివృద్దిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్క్రెనేజీ, మెగా టెక్స్‌ట్కెల్ పార్కు, భద్రకాళి ఆలయ అభివృద్ధి వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంగళవారంనాటి సమావేశం నిర్ణయం తీసుకుంది.
మామునూరు ఎయిర్‌పోర్టుపై కదలిక
ఓరుగల్లు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మామునూర్ ఎయిర్‌పోర్టును పునరుద్దరించే విషయంలో కూడా ప్రభుత్వం ప్రణాళికను సిద్దం చేస్తున్నది. దీంతో త్వరలో మామునూర్ నుంచి విమానాలు ఎగురుతాయన్న నమ్మకం ఏర్పడుతోంది. వరంగల్ మాస్టర్ ప్లాన్‌లాగానే మామునూరు ఎయిర్‌పోర్టు విషయంలో కూడా కాలయాపన జరుగుతూ వొచ్చింది. రాష్ట్ర రాజధానిలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత తెలంగాణలో మరో విమానాశ్రయం లేకపోవడం నిజంగా విచారకరం. శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటు సందర్భంగా ఏర్పరుచుకున్న నిబంధన మామునూరు విమానాశ్రయ పునరుద్దరణకు అవరోధంగా మారింది. కానీ, తాజాగా కేంద్ర ప్రణాళిక ప్రకారం రీజినల్ కనెక్టివిటీ పథకం కింద దీనిని పునరుద్ధరించే అవకాశం లభించింది.
1930లో నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఏర్పాటుచేసిన ఈ విమానాశ్రయం తెలంగాణ ప్రాంత విముక్తి తర్వాత పెద్దగా రవాణాకు నోచుకోలేదు. మధ్యలో ఇండో చ్కెనా యుద్ద సమయంలో, ఇందిరాగాంధీ హత్యకు గురైనపుడు మాజీ ప్రధాని పివి నరసింహారావును దిల్లీ పిలిపించుకున్న సందర్భంగా దీన్ని వాడుకున్నారు. అలాగే 1981 వరకు కార్గో, వాయుదూత్ సేవలందించినప్పటికీ పెద్దగా ఉపయోగంలోకి రాలేదు. దీని పునరుద్దరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయి. చివరకు తాజాగా దేశంలోని ఆరు విమానాశ్రయాల అభివృద్దిలో భాగంగా ముమునూరుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. సంవత్సరకాలంలో మామునూరు ఎయిర్‌పోర్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువొచ్చేందుకు కావాల్సిన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించడంతో నాలుగు దశాబ్దాల తర్వాత మామునూరుకు పూర్వకళ వచ్చే అవకాశం కనిపిస్తోంది.