ఢిల్లీలో గాలి నాణ్యత మెరుపడేదెప్పుడు ???

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి గాలి నాణ్యత క్షీణిస్తుంది. గాలి నాణ్యత వాతావరణ అంచనా పరిశోధన వ్యవస్థ (సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్-సఫార్) రియల్ టైమ్ డేటా ప్రకారం గాలి నాణ్యత సూచిక (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ – ఏక్యూఐ) 21 అక్టోబర్ ఉదయం 8 గంటలకు 317 వద్ద ఉంది. గాలి నాణ్యత చాలా పేలవమైన స్థితిలో ఉందని దీనర్థం. ఊపిరితిత్తులను అడ్డుకుని అనేక వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ ధూళి కణాలు పర్టిక్యూలేట్ మేటర్ (పీఎం) 2.5 స్థాయి 306గా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ రోజువారీ సగటు ఏక్యూఐ చాలా పేలవమైన స్థితిలో ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఎక్యుఐ అనేది ఒక ప్రాంతంలో గాలి నాణ్యతను తెలియజేసే సూచిక. ఇది ఆ ప్రాంతంలో ఉండే గాలి ఎంత కలుషితమై ఉందనే విలువను తెలియజేస్తుంది. గాలి కాలుష్యం మన ఆరోగ్యంపై ఎంత మేర ప్రభావం చూపుతాయో ఈ సూచికల విలువుల బట్టి తెలుసుకోవచ్చు.

గాలిలో ఉన్న ఎనిమిది ప్రధాన కాలుష్య కారకాల ఉద్గారాలను కొలవడం ద్వారా గాలి నాణ్యత సూచికను పొందవచ్చు. వీటి రీడింగ్‌లు ప్రతి గంటకు గుర్తించబడతాయి. ప్రతిదేశం వాయు నాణ్యతా ప్రమాణాల ఆధారంగా వాయునాణ్యత సూచికలను కలిగి ఉంటుంది. పర్టిక్యులేట్ మేటర్ (పియం) అనేది గణనీయమైన కాలుష్య కారకం. గాలిలో పియం 2.5, పియం 10 లను కొలవడం ద్వారా గాలి నాణ్యతను తెలుసుకోవచ్చు. ఇది క్యూబిక్ మీటరుకు ఉండే కణాల సాంద్రతను తెలియజేస్తుంది. 2.5 మైక్రోన్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన కణాల సాంద్రతను పియం 2.5 అని, 10 లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన కణాల సాంద్రతను పియం 10 అని అంటారు. ఈ కణాలు ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, లెడ్, అమ్మోనియా ఉద్గారాల నుండి వెలువడి గాలిలో కలుస్తాయి. ఇవి గాలిలో ఘనకణాలు, ద్రవబిందువుల మిశ్రమం రూపంలో ఉంటాయి. ధూళి, పొగ, మసి వంటి కొన్ని కణాలు మన కళ్ళకు కనిపిస్తాయి. మరికొన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే కనిపిస్తాయి. 2021లో చట్టబద్ధమైన సంస్థగా స్థాపించబడిన వాయు నాణ్యత నిర్వహణ కమీషన్ (సిఎక్యూఎం) నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సిఆర్) పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఇది ఏక్యూఐ పరిమితుల ఆధారంగా నాలుగు దశలను కలిగి ఉంది. “పేలవమైన” గాలికి స్టేజ్ 1 (201-300), “చాలా పేలవమైన” (301-400) స్టేజ్ 2, “తీవ్రమైన” కోసం స్టేజ్ 3 (401-450), “అతి తీవ్రమైనవి”(450 కంటే ఎక్కువ) స్టేజ్ 4 గా వర్గీకరించడం జరిగింది.

తీసుకుంటున్న చర్యలు:

వాయునాణ్యత నిర్వహణా కమీషన్ అక్టోబర్ 22 ఉదయం 8 గంటల నుండి జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) అంతటా అక్టోబర్ 14 నుండి ఉన్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్ఎపి) మొదటి దశ కార్యాచరణ ప్రణాళికతోపాటుగా పదకొండు అంశాలతో జిఆర్ఎపి రెండవ దశను కఠినంగా అమలుచేయాలని సూచించింది. దీనిలో భాగంగా జాతీయ రాజధాని ప్రాంతంలో బొగ్గు, కట్టెలు, డీజిల్ జనరేటర్ సెట్ల వాడకంపై ఆంక్షలు విధించారు. నిర్దేశిత రోడ్లపై రోజూ యాంత్రికంగా ఊడ్చడం, నీరు చల్లడం, నిర్మాణ, కూల్చివేత స్థలాల్లో దుమ్ము నియంత్రణ చర్యలు అమలు చేయాలి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, కీలక పాయింట్ల వద్ద ట్రాఫిక్ సిబ్బందిని నియమించి, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు పార్కింగ్ ఫీజులను పెంచనున్నారు.

అదనపు బస్సు, మెట్రో సర్వీసులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని, వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాలని, వాహన ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చాలని, దుమ్మును ఉత్పత్తి చేసే నిర్మాణ కార్యకలాపాలను అక్టోబర్ నుంచి జనవరి వరకు పరిమితం చేయాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ రద్దీ పాయింట్ల వద్ద తగినంత సిబ్బందిని మోహరిస్తారు. మెట్రో సేవల ఫ్రీక్వెన్సీనిపెంచారు. ఢిల్లీ ఎన్సిఆర్ అంతటా ఘన వ్యర్థాలు బయోమాస్ను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధించబడింది. 97 ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో అదనంగా 1,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించనున్నారు. కాలుష్య హాట్ స్పాట్లలో వాటర్ స్ప్రేయింగ్ పెంచడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మరో 6,200 మంది కార్మికులను నియమించింది. హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి డీజిల్ బస్సుల ప్రవేశాన్ని నిలిపివేయడమో లేదా పరిమితం చేయడమో చేయనున్నారు. వాటి నుండి వచ్చే ఉద్గారాలను నియంత్రించడానికి కఠిన నిబంధనలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

కారణాలు:

ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లలో పంట వ్యర్థాలను కాల్చడం కాలుష్యానికి ప్రధానకారణం. పంట దహనానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో హర్యానా, పంజాబ్ విఫలమయ్యాయని అక్టోబర్16న సుప్రీంకోర్టు విమర్శించింది. ఇంకా గాలి వేగం తక్కువగా ఉండటం, పండుగల సమయంలో టపాసులు పేల్చడం వంటి వివిధ కారణాల వల్ల గాలి ముఖ్యంగా విషపూరితంగా మారుతుంది. పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, ఆటోమొబైల్స్ మొదలైన వాటి ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు గాలిలో సంక్లిష్ట రసాయన ప్రతిచర్యల ద్వారా ప్రమాదకర రేణువులు ఉత్పత్తి అవుతున్నాయి. ఇంధన చెక్క ముక్కలు, ఎండుగడ్డి, ఆకులు, పశువుల పేడ యొక్క తడి మిశ్రమం నుండి తయారు చేయబడే వంట ఇంధనాలు,  గోధుమలను నాటడానికి భూమిని త్వరగా సిద్ధం చేయడానికి పంట కోత తర్వాత  అవశేషాలను కాల్చడం, బయో మాస్ బర్నింగ్, చుల్హాస్ వాడకం, టైర్ పైరోలిసిస్ ప్లాంట్లు, ఇంధన కల్తీ, ట్రాఫిక్ రద్దీ వంటి వాటివలన వెలువడే కాలుష్య కారకాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి.

ప్రభావాలు:

ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు, రోగనిరోధక తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇంకా ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు,ట్రాఫిక్ పోలీసులు వంటి వారికి ప్రమాదం.  అలాగే వీధి వ్యాపారులపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే విద్యార్థులు చాలా నష్ఠపోతారు.

జాగ్రత్తలు:

ఆరుబయట వెళ్ళడం మానుకోవాలి.  ఎన్ 95 మాస్కులు వాడాలి. ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించాలి. కారు కిటికీలను తెరవకూడదు. పరిశుభ్రమైన ఇంధనాలను వాడాలి. వంటకు బొగ్గు, కలపను ఉపయోగించకూడదు.

పరిష్కారాలు :

వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించుకోవాలి. ప్లాస్టిక్, సింథటిక్ వస్తువులను నిషేధించాలి. విరివిగా చెట్లు నాటాలి. కాగితాల  నుండి డిజిటల్కి మారాలి. పర్టిక్యులేట్ మాటర్ ఎక్కువగా ఉండే ఎయిర్ ఫ్రెష్ణర్లు, డియూడరెంట్లు వాడకం తగ్గించాలి. గ్యాసోలిన్ యంత్రం వాడకాన్ని పరిమితం చేయాలి. క్రమం తప్పకుండా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తనిఖీ చేయించుకోవాలి. ఎనర్జీ స్టార్ సర్టిఫికేట్ పొందిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఎంచుకోవాలి. కాలుష్య కారకాల ఉత్పత్తులను తగ్గించుకోవాలి.

జనక మోహన రావు దుంగ
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page