జనాల కంటే సీఎంకు ఫార్మా కంపెనీలే ముఖ్యమా..? •పోలీసుల వైఫల్యంతో లగచర్ల ఘటన
బాధితులతో ములాఖత్ అయిన బీజేపీ నాయకులు డీకే అరుణ, ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: ఫార్మా కంపెనీలపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న 16 మంది లగచర్ల బాధితులతో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ ములాఖత్ అయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. వోటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని నిలదీశారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని పేర్కొన్నారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకు రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
పోలీసుల వైఫల్యంతోనే లగచర్ల ఘటన జరిగిందని డీకే అరుణ అన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని తెలిపారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారన్నారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వొచ్చి పోలీసులు ఇష్టం వొచ్చినట్టు దాడి చేశారని పేర్కొన్నారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లను వదిలేసి మిగతా వాళ్లను అరెస్ట్ చేశారని అన్నారు. భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్లను కలిసి మాట్లాడితే బాగుండేదని అన్నారు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం సరికాదని స్పష్టం చేశారు.
సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు. సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని నిలదీశారు. వోటేసి గెలిపించిన జనాల కాంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని ప్రశ్నించారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంథాలు వద్దని.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని అన్నారు. గర్భిణిలు అని చూడకుండా ఇలా చేయడం దారుణమని అన్నారు. సీఎం రేవంత్ అహంకారం వీడాలని.. ఒప్పించి భూములు తీసుకోవాలని సూచించారు.