పార్లమెంట్ శీతాకాల సమావేశాలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జమిలి ఫీవర్ పట్టుకుంది. జమిలి ఎన్నికలు జరిపి తీరుతామన్న పట్టుదలలో మోదీ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని విపక్షాలు ఇప్పటికే వాదిస్తున్నాయి. ఎందుకంటే వారికి నిరంతర ఎన్నికల ప్రక్రియ ఉంటేనే జీవితం గడవదు. అయితే జమిలి ఎన్నికలతో వొచ్చే నష్టం లేదు. తరచూ ఎన్నికల వల్ల దేశ ఖజానాకు బొక్క పడుతోంది. అలాగే రాజకీయ నాయకులు నిత్యం ఎన్నికలతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలు ఎన్నికల గాలికి కొట్టుకు పోతున్నాయి.
దేశాన్ని గాడిలో పెట్టాలంటే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ మోదీ ప్రభుత్వం చేయగలుగుతుందా.. అంతటి చిత్తశుద్ది ఉందా అన్నది చూడాలి. ప్రధానంగా జమిలికి ముందే దేశ జనాభా గణన జరగాలి. దీంతోపాటే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకుని రావాలి. ఎవరెన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా, రాజకీయ పోరాటం చేసినా.. దేశానికంతటికీ ఒకేదేశం, ఒకే చట్టం అమల్లోకి రావాలి. అలాగే ప్రధానంగా పెరుగుతున్న జనాభాను కట్టడి చేయాలి. ఇందులో కులమతాలకు తావులేకుండా చేయాలి. ఇవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కులగణనతో దేశంలో విభజన రాజకీయాలు చేస్తోంది. దీనిపైనా స్పష్టత రావాల్సి ఉంది. కులాలను పక్కన పెట్టేలా కఠిన రాజ్యాంగ చర్యలకు ఉపక్రమించాలి.
కులాల పేరుతో దేశాన్ని చీల్చే ప్రక్రియ సరైనది కాదు. ఆధునిక సమాజంలో ఇంకా కులాలను పట్టుకుని వేళ్లాడడం కూడా అంతమంచిది కాదు. ప్రజల్లో ఆడా,మగా, ఉన్నవారు, లేని వారు అన్న విభజన రేఖలు మాత్రమే ఉండాలి. వాటి ఆధారంగానే అన్ని రకాల ప్రయోజనాలు, కార్యక్రమాలు అమలు కావాలి. మొత్తంగా పదేళ్లుగా ఈ అంశాలపై ఊరిస్తూ వచ్చిన మోదీ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలతో ముందుకు సాగితేనే దేశంలో అలజడి లేకుండా ప్రశాంతంగా సాగగలదు. జనాభ నియంత్రణ కేవలం హిందువులకే అన్న పద్దతిలో సాగడం మంచిపద్దతి కాదు. ఇకపోతే జమిలి ఎన్నికలకు ముందే జనాభా గణన చేపట్టాలి. దేశంలో ఆరోవేలుగా ఉన్న గవర్నర్ వ్యవస్థలను రద్దు చేయాలి. పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఎంపిటిసిలు, జడ్పీటిసీల వ్యవస్థలను ఎత్తేయాలి. పంచాయితీలకే గ్రామాల అభివృద్ది బాధ్యతను చట్టబద్దంగా అప్పగించాలి. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా..అవి సక్రమంగా వినయోగించడం లేదు. దీంతో గ్రామాలు ఏమాత్రం అభివృద్ది చెందకుండా వట్టి పోతున్నాయి. ఇకపోతే వచ్చే ఏడాది జనగణన పక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. అందు లో ఒకటి మహిళా రిజర్వేషన్ చట్టం కాగా, రెండోది లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దేశంలో భిన్నత్వాన్ని, ప్రజాస్వామి క స్ఫూర్తిని చాటేలా చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా సీట్ల కేటాయింపు ఉంటుంది.
దేశ, రాష్ట్ర జనాభాను పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ సీట్లసంఖ్యను నిర్ణయిస్తారు. కొత్తగా లెక్కించే జనాభా ఆధారంగా శాసనసభ,లోక్‌సభ సీట్లు పెరుగుతాయని రాజకీయవర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. సీట్లు పెరిగితే తమకు ప్రాతినిధ్యం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే రాజకీయ పదవులను తగ్గించే పని కూడా చేపడితే మంచిది. రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థతో పాటు శాసనమండలులు కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉన్నాయి. వీటిని శాశ్వతంగా ఎత్తేస్తే మంచిది. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలకు మాత్రమే పరిమితం కాకుండా లోక్‌సభ, శాసనసభల సీట్ల సంఖ్యను కూడా పెంచాలని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఎన్ని సీట్లు పెంచితే అన్ని విధాలుగా లబ్ది పొందేది కేవలం రాకజీయ పార్టీలు మాత్రమే. దేశంలో లోక్‌సభ సీట్లను పెంచితే మాత్రం దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అందుకే దేశ ప్రజల దృష్టి 2025లో జరగనున్న జనాభా లెక్కలపై పడిరది. ఇకపోతే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని ఆమోదించారు. దీనికి జనాభగణను లింక్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో జనగణన కీలకంగా ఉంది. 2023లో ఈ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా మారింది.
సార్వత్రక ఎన్నికల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జనగణన పూర్తయిన వెంటనే దాన్ని అమల్లోకి తీసుకుని వొస్తామని హావిరీ ఇచ్చింది. ఆ మేరకు చట్టంలో కూడా పొందుపరిచింది. అందుకే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రావాలంటే కచ్చితంగా జనగణన జరిగితీరాలి. అప్పుడే మహిళల దశాబ్దాల కల సాకారమవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. మహిళా రిజర్వేషన్ల ద్వారా దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన మహిళలు చట్టసభల్లోకి ప్రవేశించేం దుకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మన దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. మళ్లీ 2021లో జనగణన జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడిరది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 2025 మొదటి త్రైమాసికంలో జనగణన ప్రారంభం కానున్నది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, డిజిటల్ గవర్నెన్స్ వల్ల ఏడాదిలోగా పక్రియ సమర్థవంతంగా పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సకాలంలో జనగణన పూర్తయితే నియోజకవర్గాల పునర్విభజనకు కూడా మార్గం సుగమం అవుతుందన్నది రాజకీయ పార్టీల ఆశగా ఉంది. ఎలాగూ జనగణన తప్పదు కనుక అనేక కీలక అంశాలపైనా శాశ్వత నిర్ణయాలు తీసుకోవాల్సిన అసవరం ఉంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు రాజ్యాంగ సవరణలను ఆమోదించుకోవాలి. ఒకేదేశం ఒకేచట్టం ఇందులో ప్రధాన మైనది. జనాభా నియంత్రణ కూడా అంతే ప్రధానమైనది. వనరులు తగ్గిపోతున్న క్రమంలో జనాభా నియంత్రణ లేకుండా సాగితే దేశంలో అరాచకం ప్రబలే ఆస్కారం ఉంది. దీనిని గమనించి కేంద్రం చర్యలు తీసుకుంటే మంచిది.
-మారుపాక గోవర్ధన్ రెడ్డి
(సీనియర్ జర్నలిస్ట్)