కఠిన శిక్షలతోనే దుండుగులకు చెక్‌క ప్రజలు అప్రమత్తం కావడమే పరిష్కారం
ప్రస్తుతం దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలు, బాలికలపై హత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకటి తరవాత మరొకటి అన్నట్లుగా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. మృగాళ్లు భయం లేకుండా విచ్చలవిడిగా తెగబడుతున్నారు. బహిరంగంగా ఉరితీసే వరకు ఇవి ఆగవన్న రీతిలో సాగుతున్నాయి.
మహిళలపై నేరాలు ఇంతగా పెచ్చు మీరడానికి ఉన్మాదులు యథేచ్ఛగా చెలరేగి పోవడానికి ప్రధాన కారణం నేరం చేయకూడదన్న భయం లేకపోవడమే. సత్వర దర్యాప్తు, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడితేనే నేరాలు అదుపులోకి వొస్తాయి. ఒక్కో ఘటన చూస్తుంటే మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా అన్న భయం కలుగుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా దారికి రావడంలేదు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని ఇరు రాష్ట్రాలకు చెందిన హోంమంత్రులు తీవ్రంగానే హెచ్చరిస్తున్నారు. అలాగే కఠినంగా ఉండాలని పోలీసులకు కూడా ప్రభుత్వాలు వార్నింగ్ ఇస్తున్నాయి. తెలంగాణ లో ఇలాంటి సంఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగానే ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. వారం రోజుల్లోనే పొరుగు రాష్ట్రంలో ఇద్దరిపై గ్యాంగ్ రేప్, మరో ఇద్దరిపై ఘోర దాడులు కలచివేస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై ఆమె స్నేహితుడే పెట్రోలు పోసి తగలబెట్టగా, 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడవడం అత్యంత బాధాకరం. తెనాలిలో నర్సు దాడికి గురై బ్రెయిన్ డెడ్ స్టేజిలో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవలే నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి, హత్యకు గురైంది. జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వారానికే బాపట్ల జిల్లా చీరాల వద్ద పంట పొలాల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించగా ఆమె సామూహిక అత్యాచారం, హత్యకు గురైందని గుర్తించారు. ఇవి తెలిసొచ్చిన అఘాయిత్యాల్లో కొన్ని మాత్రమే. బయటికి రానివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు. జూన్‌లో బాపట్ల జిల్లాలో మహిళ హత్యాచారానికి గురైతే ఇప్పటికీ కేసు అతీగతీ లేదు. అలాంటిదే ఇంకో ఘటన జరిగాక తీరిగ్గా ఇప్పుడు ప్రత్యేక కోర్టులని, హైకోర్టుకు లేఖ రాస్తామంటున్నారు.
ఆడపిల్లపై చేయి వేసిన వాడికి అదే చివరి రోజవుతుందని ఎన్నో సార్లు హూంకరించినా ఘోరాలు ఆగింది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై, చిన్న పిల్లలపై నేరాలు 74 జరిగాయన్నది ఒక లెక్క. ఆరుగురు హత్యకు గురికాగా, మరో ఐదుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అలాగని ఈ ప్రభుత్వం వచ్చాకనే మృగాళ్లు పుట్టుకొచ్చారని కాదు. గత ప్రభుత్వంలోనూ మహిళలపై కిరాతకాలు జరిగాయి. దిశ పోలీస్‌స్టేషన్లు, యాప్ ఉన్నా ఘోరాలు నిరాటంకంగా జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వాలు వల్లిస్తున్న ఫాస్ట్ ట్రాక్, స్పెషల్ కోర్టులు, నేరస్తులపై ఉక్కుపాదం వంటివి కూడా ఆ కోవలోనివే. అప్పుడూ ఇప్పుడూ మహిళలే సమిధలవుతున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, పిల్లలు అదృశ్యమయ్యారని జనసేనాని ప్రకటించినా , తాను పాలనలోకొచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయారని అని పిస్తోంది. ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న దుర్మార్గాలపై మౌనం వహించడం ఎవరికీ మంచిది కాదు. స్త్రీలను బతకనివ్వని చెరబట్టే విపత్కర రోజులు దాపురించాయి. మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రజలు కూడా చైతన్యం కావాలి. తమపక్కనేం జరుగుతుందో గమనించాలి. అత్యాచార ఘటనలు జరక్కుండా ఓ కన్నేయాలి. ప్రజలు మేల్కొంటే ఎంతటి రాక్షసులలైనా తుదముట్టించవొచ్చు.
-ఎస్.కె. వహీద్ పాషా
(ఎంఎస్సీ బి.ఎడ్), ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,