ఎవరిది తప్పు?

పారే నీటిని దాచుకోని నదీ గర్భం

వెల్లువని ప్రక్క దారి పట్టించిన

మెరక దర్పం!

అదను చూసి జెండా పాతేసిని

కబ్జాదారులు

జేబు తడుపుకు సరిహద్దులు

మార్చిన అధికారులు!

 

 

లేని దానికి సదుపాయాలిచ్చిన

ప్రభుత్వవిభాగం

కాని దానికి పన్నులు దండుకున్న

పాలక పక్షం!

మాయాగృహం చూపి మంత్రం వేసిన

గుత్తేదారు

భ్రమలు చూపి వలవేసిన దళారీదారు!

 

గూడుకోసం ఆశపడిన మధ్యతరగతి వర్గం

కూడు మాని కూడ పెట్టుకున్న పేదజనం!

పాడు కొంపకు కీడు వస్తే ఎవరిది తప్పు?

మర యంత్రాల దండు వస్తే ఎవరిది ఒప్పు?

 

సమాధానం లేని యక్ష ప్రశ్న అది!

విక్రమార్కుడు మేధకు చిక్కని

సమాధానం అది!

జవాబుదారీ తనాన్ని కాంక్షిస్తూ

బడుగు జీవుడు

దగుల్బాజీతనాన్ని ప్రదర్శిస్తూ

బడా నాయకుడు!

“అవును! ఆక్రమణలు తొలగించాలి”

అంటూ తన దాకా రాని కష్టానికి

జేజేలు పలుకుతున్నాడు సామాన్యుడు!

 

-ఉషారం

9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page