సత్యం పట్ల జిజ్ఞాస ఉన్నవాళ్లే పీఎస్ఎస్ఎంలోకి వస్తారు
పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ
ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 27 : ప్రతి మనిషి ఒక బుద్ధుడిలాగా భయం లేకుండా ప్రతిక్షణం జీవించడం పత్రీజీ మన నుంచి కోరుకున్నారని పత్రీజీ చిన్న కూతురు, పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. సత్యం తెలుసు కోవాలనే జిజ్ఞాస ఉన్నవాళ్లే పిఎస్ఎస్ఎంలోకి వస్తారని అన్నారు. ప్రతిక్షణం ఏ భావనతో ఉంటున్నామనే ఎరుకను కలిగి ఉండాలని సూచించారు. 2024లో ‘పత్రీజీ మహిళా ధ్యాన మహాయాగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ధ్యాన జగత్’ మాసపత్రిక జనవరి-2024 ఎడిషన్, వోట్ ఫర్ వెజ్ వెబ్ సైట్ ను పరిమళ పత్రీ, పరిణిత పత్రీ పలువురు ధ్యానులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పత్రీజీ ఎక్కడ మొహమాటం లేకుండా సత్యాన్ని కఠోరంగా చెప్పేవాడని గుర్తు చేశారు. ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కైలాసపురిలో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహా యాగం వేడుకలకు చలికి లెక్క చేయకుండా ఏడో రోజు ఉదయం 5 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తున్న ప్రాతఃకాల ధ్యానానికి వేల మంది పిరమిడ్ మాస్టర్లు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది ధ్యానులు హాజరై పత్రీజీ శక్తి స్థల్ కు ధ్యానంతో నివాళ్లర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకులు రాధామనోహర్ ప్రవచనాలు ధ్యానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి సకల ప్రాణికోటి కోసం, వాటి స్వేచ్ఛ కోసం పాటు పడాలని అన్నారు. 24 గంటలు శ్వాసను అందరూ పిలుస్తారని కానీ దాని పట్ల ఎరుక ఉండదని అన్నారు. శ్వాసను ఎరుకతో పట్టుకున్నప్పుడే శక్తి లభిస్తుందన్నారు. జీవిత ధ్యేయం మనల్ని మనం తెలుసుకోవడమే అని, పత్రీజీ ఇచ్చిన ఈ సింపుల్ ఫార్ములా ఎంతో గొప్పదని అన్నారు. ధ్యానం వల్లనే జ్ఞానం కలుగుతుందని, మనిషి ఆయుష్షు శ్వాసపైనే ఆధారపడి ఉందన్నారు. ధ్యాన మహా యాగంలో భాగంగా పలు వురు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలు అలరించాయి. నిర్వాహకులు పిరమిడ్ ఆవరణలో ఉచిత భోజన, వసతి సౌక ర్యాలు కల్పించారు. కళాకారులు, కవులు, ఆధ్యాత్మిక వేత్తలను పిరమిడ్ నిర్వాహకులు సత్కరించి అభినందించారు. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు ధ్యానులను ఎంతోగానో అలరించాయి. ఆధ్యాత్మిక గీతాలు, ధ్యాన గురువుల సందేశాలతో ధ్యాన సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ చైర్మన్, దాట్ల హనుమంతరాజు, ఎండి బాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నవకాంత్, ఆనంద్, రాయజగపతి రాజు, వాణి, మాధవి, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.