అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలో..3న నిజామాబాద్‌లో..

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అక్టోబర్‌ 3‌న నిజామాబాద్‌ ‌పట్టణంలోని సీజీ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. అక్టోబరు 1న మహబూబ్‌ ‌నగర్‌ ‌పట్టణంలో జరిగే బహిరంగ సభలో..3వ తేదీన నిజామాబాద్‌ ‌బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని పేర్కొంటూ..తొలిరోజు పాలమూరు బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

అక్టోబరు 3వ తేదీన ఇందూరు పట్టణంలో బిజెపి బహరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారన్నారు. 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ. 6 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్‌ ‌ప్లాంట్‌ను మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ ‌జిల్లా నాయకత్వంతో పాటు అధికారుల నుంచి సభాస్థలి గురించి పలు సూచనలను కిషన్‌ ‌రెడ్డి స్వీకరించారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేలా జన సమీకరణ సహా ఇతర విషయాలపై పార్టీ నాయకులు, భారత ప్రభుత్వ అధికారులతో చర్చిస్తామని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణలో హైదరాబాద్‌ ‌మొదలు ఆదిలాబాద్‌ ‌వరకు భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది.

ఖమ్మం జిల్లాలో కూడా పెద్దఎత్తున మార్పులు వొస్తున్నాయి. గిరిజనులతో పాటు స్థానిక ప్రజలు బిజెపిని ఆదరించి మద్దతు తెలుపుతున్నారని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. బిజెపిపై విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ ‌నాయకులకు లేదనీ..ప్రధాని తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కేసీఆర్‌ ఎవ్వరని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో సమాధానం చెప్పాలి. 17 సార్లు పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించలేదు..దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిండు..3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసిండని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page