అడ్డమైన ఆంక్షలు..అర్థంలేని షరతులు

రైతు రుణ మాఫీ మొత్తం బోగస్‌
అన్నదాతలను నిండాముంచిన సిఎం
రుణ మాఫీ పేరిట మోసానికి తెర
ఓ విజన్‌ ‌లేదు, విధానం లేదు…డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు
సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం
బిఆర్ఎస్‌, ‌బిజెపిలో విలీనమవుతుందని రేవంత్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌
‌రేవంత్‌ అమెరికా ప్రెసిడెంట్‌ అవుతాడని కామెంట్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌ ‌రెడ్డి మోసానికి తెరలేపారని బీఆర్ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. అడ్డమైన ఆంక్షలు..అర్థంలేని షరతులు విధించిన రుణమాఫీ మొత్తం బోగస్‌ అని.. మిలియన్‌ ‌డాలర్ల జోక్‌గా తేలిపోయిందని విమర్శించారు. అందుకే దాని నుంచి అటెన్షన్‌ ‌డైవర్షన్‌ ‌చేయడానికే ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ చెబుతున్న ఈ రుణమాఫీ.. స్వతంత్ర భారత దేశంలోనే రైతులకు జరిగిన అతిపెద్ద మోసమని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఒక దారుణమైన దగా, ఒక మాయ అని అన్నారు. రైతన్నలతో క్రూరమైన పరిహాసం ఆడిందని కాంగ్రెస్‌ ‌పార్టీపై కెటిఆర్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులు, కూతలు-కోతలతో రైతు రుణమాఫీ ఉందన్నారు. అన్నదాతలను కాంగ్రెస్‌ ‌పార్టీ నిండా ముంచిందని అన్నారు. అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ కోసం 40 వేల కోట్లు అవుతుందని రేవంత్‌ ‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు చెప్పారని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. ఒక సంవత్సరం తాను కడుపుగట్టుకుంటే ఈ డబ్బును అనాయసంగా కట్టేయొచ్చని రేవంత్‌ ‌చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ ఈ లెక్క మారింది.. 31 వేల కోట్లతో రుణమాఫీ చేయాలని కేబినెట్‌ ‌తీర్మానించిందని తెలంగాణ సీఎంవో జూలైలో ఒక ట్వీట్‌ ‌చేసిందని తెలిపారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హులే అని ఎన్నికల ముందు చెప్పారని..ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు.

 

రుణమాఫీ లెక్కలు చూస్తే.. ఉద్యోగికి రుణమాఫీ కట్‌.. ‌పెన్షనర్‌కు కట్‌.. ఇన్‌కం ట్యాక్స్ ‌కట్టేటోళ్లకు కట్‌.. ‌రేషన్‌ ‌కార్డు లేకుంటే కట్‌ ‌చేశారని కేటీఆర్‌ అన్నారు. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పలేదని అన్నారు. సీఎం అంటే నిజానికి చీఫ్‌ ‌మినిస్టర్‌.. ‌కానీ ఇప్పుడు కటింగ్‌ ‌మాస్టర్‌లా పరిస్థితి అయిపోయిందని ఎద్దేవా చేశారు. 60 శాతం మందికి ఎగ్గొట్టి.. కేవలం 40 శాతం మందికి చేసి.. 100 శాతం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్న మొట్ట మొదటి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అని మండిపడ్డారు. ఇంతకుమించిన దగా, మోసం, రైతు ద్రోహం మరొకటి ఉండదని విమర్శించారు. సవాలక్ష కొర్రీలు, దిక్కుమాలిన ఆంక్షలతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను బ్యాంకులు, అధికారుల చుట్టూ పడిగాపులు గాచే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. అంకెలు మార్చి.. రంకెలు వేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ‌మండిపడ్డారు. మార్పు మార్పు అని రైతులను ఏమార్చారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదటి మోసం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు దేవుడి మీద వొట్లు పెట్టి రెండో మోసం.. కేసీఆర్‌ ‌మీద ద్వేషం.. సకలజనులకు మోసం.. అనేది ప్రభుత్వ పాలసీగా ఉందని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ మోసం, రెండు లక్షల ఉద్యోగాలు మోసం.. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 మోసం, తులం బంగారం మోసం, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు మోసం, 4 వేల నిరుద్యోగ భృతి మోసం, జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌మోసం, దళితులకు 12 లక్షలు ఇస్తామన్న మోసం, ఆటో అన్నలకు ఏడాదికి 12 వేలు మోసం, రైతు కూలీలకు నెలకు వెయ్యి మోసం, కౌలు రైతులకు రైతు భరోసా మోసం.. మొత్తంగా చూస్తే రుణ మాఫీనే అతిపెద్ద మోసం అని విమర్శించారు.

 

రుణ మాఫీకి ఎన్నికల ముందు చెప్పింది 40వేల కోట్లు, కేబినెట్‌ ‌తీర్మానంలో చెప్పింది 31వేల కోట్లు, బడ్జెట్‌లో చెప్పింది 26వేల కోట్లు అని చెప్పారని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. కానీ ఆఖరకు నిన్నటివరకు జరిగిన రుణమాఫీ కేవలం 17,934 కోట్లు మాత్రమే అని తెలిపారు. 22,37,748 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. ఇన్ని కోతలు పెట్టి.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద వొట్లు పెట్టి.. చిల్లర మాటలు, చిల్లర కూతలు అని విమర్శించారు. ఇందులో కూడా ఎన్ని వొస్తాయో, ఎన్ని ఖాతాల్లో పడతాయో, దానికి సంబంధించి ఎన్ని కటింగ్‌లు ఉంటాయో తెలియదని అన్నారు. బీఆర్ఎస్‌ ‌ప్రభుత్వంలో మొదటి దఫాలో ఒకటే టర్మ్‌లో 35 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ చేశామని కేటీఆర్‌ ‌చెప్పారు. మొదటి టర్మ్‌లో లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తే.. 35 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ అయ్యిందని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీకి కూడా 17,934 కోట్లు అవుతుందని ప్రశ్నించారు. ఈ ఒక్క లెక్కతో కాంగ్రెస్‌ ‌రుణమాఫీ ఎంత దగానో, ఎన్ని లక్షల మందిని ముంచారో అర్థమవుతుందని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేసి, రైతుబంధు కూడా వేశామని చెప్పారు. మొత్తంగా చూస్తే.. 72 వేల కోట్ల రైతు బంధును అకౌంట్లలో డిపాజిట్‌ ‌చేశామని తెలిపారు. అదే సమయంలో దాదాపు 30 వేల కోట్లు రుణమాఫీ చేశామని అన్నారు. అంటే రైతులకు రుణమాఫీ, రైతుబంధు రూపంలో లక్ష కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. వానకాలానికి ఇవ్వాల్సిన రైతుభరోసా 11,400 కోట్లు ఎగ్గొట్టావ్‌ ‌కదా అని రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలైలో రైతుబంధు పడేదని.. ఇవాళ రైతుబంధు పడిందా..అంటూ అడిగారు. రైతుబంధు ఇచ్చే సూచన కూడా కనిపించడం లేదని అన్నారు.

 

మొన్న యాసంగిలో ఎకరానికి 7500 ఇవ్వలేదని.. అప్పుడు 4 వేల కోట్లు ఎగ్గొట్టారని కేటీఆర్‌ ‌విమర్శించారు. రైతుభరోసా కింద ఓవరాల్‌గా ఇవ్వాల్సిన 15వేల కోట్లలో అది ఇవ్వలేదు. రైతు రుణమాఫీ కింద 17వేలు ఇచ్చి ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. •రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసినవాడు రేవంత్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ అని విమర్శించారు. పాత గోడకు కొత్త సున్నం వేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. నీ అడ్డమైన ఫీట్లు చూసి.. ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని గిన్నిస్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌వాళ్లు కూడా ఆగమవుతున్నారని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్‌ ‌త్వరలోనే విలీనం అవుతుందని, ఆ వెంటనే కేసీఆర్‌ ‌గవర్నర్‌, ‌కేటీఆర్‌ ‌కేంద్రమంత్రి కాబోతున్నారని రేవంత్‌ ‌చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌ ‌రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని వ్యంగ్యంగా మాట్లాడారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం ప్రెస్‌మీట్‌ ‌పెట్టి మరీ.. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్‌ ఎం‌డగట్టారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కేటీఆర్‌.. ‌రేవంత్‌ ‌రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని%•% అలా నేను కూడా స్టోరీలు చెప్పగలనని అన్నారు. ‘ రేవంత్‌ ‌రెడ్డి తొందరలోనే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మనోడు అమెరికా అధ్యక్షుడు అయితడని.. మొన్ననే కేజీఎఫ్‌లో ఏదో మీటింగ్‌ ‌పెట్టి ఆయనెవరో చెప్పారు కదా.. ఈయనే అయితడేమో మరి’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ట్రంప్‌ ‌సరిపోతలేడని.. రేవంత్‌ను పిలుస్తున్నారేమో అని వెటకారంగా అన్నారు. మాకు రాజీనామాలు కొత్త కాదు.. రేవంత్‌ ‌రెడ్డికి మోసాలు కొత్త కాదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పిన సన్నాసి ఎవరని ప్రశ్నించారు.

.

మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై కూడా కేటీఆర్‌ ‌స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. యథాలాపంగా మాట్లాడుతూ..ఒక్క మాట అన్నానని.. అందుకే క్షమించాలని సోదరీమణులను అడిగానని చెప్పారు. తాను ముందుకొచ్చి ఆ మాట మాట్లాడానని తెలిపారు. సబితక్క, సునీతక్క, కోవా లక్ష్మక్క గురించి పనికిమాలిన మాటలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పే ఇంగితం గానీ, సంస్కారం గానీ వారికి ఉందా…అంటూ కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. సంస్కారం ఉంటే క్షమాపణ చెప్పాలని కోరారు. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌నాయకులు చేస్తున్న ప్రచారంపై ప్రశ్నించారు. వంద శాతం రుణమాఫీ ఎక్కడ జరిగిందని కాంగ్రెస్‌ ‌నాయకులను ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై మీరు చెప్పిన మాటల్లో నిజం ఒక్క శాతం నిజం ఉన్నా సరే.. సెక్యూరిటీ లేకుండా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రావాలని సవాలు విసిరారు. కొడంగల్‌ ‌నియోజకవర్గంలోని ఏ గ్రామంలో అయినా సరే వంద శాతం రుణమాఫీ జరిగిందని చెబితే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు. రాజకీయాలు వదిలేసి..ఇంట్లోనే కూర్చుంటానని స్పష్టం చేశారు. రుణమాఫీ జరిగిందని నువ్వు చెప్పింది నిజమైతే కొడంగల్‌లో ఏ ఒక్క గ్రామంలో అయినా చర్చ పెడదామని కేటీఆర్‌ ‌సవాలు విసిరారు. కొడంగల్‌లో మాత్రమే కాదని.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో చాలా ఊర్లు తిరిగి.. ఈ పచ్చి మోసాన్ని నిలదీస్తామని కెటిఆర్‌ ‌స్పష్టం చేశారు. దమ్ముంటే ముఖ్యమంత్రి తన సవాలును స్వీకరించాలని అన్నారు. కొడంగల్‌లో కాకుంటే ఉమ్మడి పాలమూరులోని ఏ నియోజకవర్గంలో అయినా చర్చకు రెడీనా అని తెలిపారు. నీ సొంతూరు కొండరెడ్డిపాలెంలో అయినా సరే వంద శాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేయాలని సవాలు విసిరారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా వంద శాతం చేశామని చెప్పుకోవడం సంపూర్ణంగా దిగజారడమే అని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని చాలామంది రైతులు ఆందోళనలో ఉంటే.. సంబురాలు చేసుకుంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. రైతులను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి మీద చీటింగ్‌ ‌కేసు పెట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.

 

సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఫస్ట్రేషన్‌లో రంకెలు వేస్తున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కొండల్‌ ‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైనట్లు ఉంది.. అదే రేవంత్‌ అమెరికా టూర్‌ ఆ ‌స్థాయిలో వర్కవుట్‌ అయినట్టు లేదు.. దీంతో ఫస్ట్రేషన్‌ ‌పెరిగిపోయిందని అన్నారు. పైగా రేవంత్‌ ‌రెడ్డి లేని టైమ్‌లో తిరుపతి రెడ్డి ప్రచారం కూడా బాగానే జరిగిందని చెప్పారు. కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకెళ్తున్నారనే బాధనా? తాను లేనప్పుడు భట్టి చాలా తిరిగారని భయమో? అధిష్ఠానం ఏదైనా అదిలిస్తుందేమోనని భయమో తెలియదు గానీ.. మొత్తానికి ఆ ఫస్ట్రేషన్‌లో రంకెలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. పంద్రాగస్టుకు స్పీచ్‌ ఇచ్చిన రేవంత్‌ ‌రెడ్డి భాక్రానంగల్‌ ‌ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెప్పారని కేటీఆర్‌ అన్నారు. ఈ విషయం తమకు తెలియక.. పిచ్చోళ్లలెక్క ఇన్ని రోజులు ఉత్తర భారతదేశానికి వెళ్లామని ఎద్దేవా చేశారు. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని ఇచ్చినందుకు కాంగ్రెస్‌ ‌పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం కలుగుతుందని కేటీఆర్‌ అన్నారు.

పాపం ఆయనకు ఏదో అయినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ ‌రెడ్డిని వెంటనే వైద్యులకు చూపించాలని ఆయన కుటుంబసభ్యులకు సూచించారు. పిచ్చోడి చేతిలో రాయిలా మారితే రాష్ట్రానికి ప్రమాదమని అన్నారు. రేవంత్‌కు సంబంధించిన అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఆయనలో అసహనం, ఫస్ట్రేషన్‌ ‌పెరిగిపోయిందని విమర్శించారు. దీంతో తిట్లు, బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. లాగులో తొండలను తోలుతా, చెట్టుకు కట్టేస్తా, చంపేస్తా, నరికేస్తా, ఏట్ల దుంకు, గుడ్లతో గోళీలు ఆడుతా అనే మాటలు మానేయాలని రేవంత్‌కు సూచించారు. నువ్వు కాదు..సెక్యూరిటీ లేకుండా వెళ్తే రైతులే నిన్ను ఫుట్‌బాల్‌ ఆడతారని ఎద్దేవా చేశారు. రేవంత్‌ ‌రెడ్డి దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్‌ ‌రావు అన్నారని గుర్తుచేశారు. రుణమాఫీ జరిగింది హరీష్‌ ‌రావు అర్జెంట్‌గా రాజీనామా చెయ్యి అని చిల్లరగాళ్లు పోస్టర్లు పెట్టారని అన్నారు. రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పించాలని సవాలు విసిరారు. ఒక విజన్‌ ‌లేదు, విధానం లేదు, డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page