అత్యంత ప్రాచీనమైనది హోలీ పర్వం

హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేయడం ఆచరింప బడుతున్నా, తెలుగు నేలపై భోగి పండువకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదాయంగా ఉంది. పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మేత్రమే కాక, ‘‘హోలిక’’ అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతుతారు. కొన్ని చోట్ల హోలిక ప్రతిమను కూడా తగల బెడతారు. హోలిక, హిరణ్య కశిపుని సోదరి. హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. తండ్రి నాస్తికుడు, తనయుడు ఆస్తికుడైన విష్ణుభక్తుడు. బాలకుని విష్ణుభక్తిని మార్చడానికి రాక్షసరాజు శతవి ధాలా ప్రయత్నించాడు. అయినా ప్రహ్లాదుడు చలించలేదు. అప్పుడు హిరణ్య కశిపుడు తన సోదరి హోలికతో సంప్రదించాడు. తనకు అగ్నివల్ల నాశనము లేదని వరం పొంది ఉన్న హోలిక, తన మేనల్లుడిని ఎత్తుకుని, పెద్ద మంటలో దుమికింది. ఆమె నాశనము కోరిన ప్రహ్లాదుడు, ఆ మంటమీదే పద్మాసనుడై కూర్చుండి ఉండి, విష్ణు ధ్యానంలో లీనమై ఉన్నాడు.

అలా చాలా సేపు మంటల్లో ఉండి, పూర్తిగా చల్లారిన పిదప నిర్వికారుడు ప్రహ్లాదుడు బయటకు రాగా, తనకు నాశనమే లేదని నమ్మిన హోలిక మంటల్లో దహనమైంది. హోళీ పర్వం అత్యంత ప్రాచీనమూ, అంతర్జాతీయం కూడా, డాక్టర్‌ ‌క్రూక్‌ ‌రచించిన ‘‘గోల్డెన్‌ ‌బౌ’’ అనే గ్రంథంలో ఈ పర్వాన్ని గురించి పేర్కొన బడింది. ‘‘ఇది అతి పురాతనమైన పర్వం, బహుశా క్రీస్తుపూర్వం నుండే ఉండవచ్చు. కొత్త సంవత్సరం రాకను సూచించేందుకు, ఆదిమ వాసులు సలుపుతూ వచ్చిన వేడుకలను గ్రహించిన ఆర్యులు, ఈ పర్వాన్ని కొనసాగించి ఉంటారు’’. దుష్ట గ్రహాలను భూమి.మీద పెచ్చరిల్లనియ్య కూడదని, వాటిని పెచ్చరిల్లనిస్తే, భూమిమీద పంటలు బాగా పండవనీ, మానవ జాతి అభివృద్ధికి కష్టమని ఆదిమ వాసులు భయపడి, కేకల వల్ల, మంటల వల్ల, బూతు మాటల వల్ల దుష్ట గ్రహాలు, దయ్యాలు తొలగి పోతాయని నమ్మిన కాలం నుండి మంటలు వేయడం ఉత్సవంగా మారిందని నమ్మకం. అలాగే ఉజ్జయిని రాజైన విక్రమ శక స్థాపకుడైన విక్రమార్కుడు, ఇలాంటి మంటలను ప్రారంభించినట్లు కథనాలున్నాయి.

ప్రస్తుతం విక్రమార్క శకం 2077వ సంవత్సరం నడుస్తున్నది. విక్రమ శక సంవత్సరాలను సంవత్‌ అం‌టారు. ఫాల్గుణ పూర్ణిమ ఆ సంవత్‌ ‌కు అఖరు దినం. మరునాటి నుండి కొత్త సంవ త్సరం, ఇలా పాత సంవత్సరాన్ని (సంవత్‌) ‌తగుల బెట్టడానికి గుర్తుగా ఈ మంటను పెట్టడాన్ని పాటించారని భావిస్తారు. మంటలు వేయడం, వసంతాలాటలు ఫాల్గుణ పూర్ణిమ నాటి ముఖ్య కార్యాలు. ఫాల్గుణ పూర్ణిమ నాడు పెద్ద మంటలు పెట్టడానికి కట్టెలు మొదలైన వాటిని పక్షం రోజుల నుండి ప్రోగు చేసుకునే వారు. ఎత్తుగా వాటిని పేర్చి వినోద క్రీడలతో కాల్చేవారు. ఇందులోని అగ్నిని పరమ పవిత్రంగా భావించి, దూర గ్రామాల వారు సైతం అగ్ని కణాలను తీసుకెళ్ళి, ఫాల్గుణ పూర్ణిమ మరునాడు, ఆ వసంత కాలాన పూచిన పువ్వులు, కాయలు, పచనము చేసి, తినే ఆచారం ఉండేది. పిల్లలు, మగవారు ఈ మంటల చుట్టూ నాట్యాలు చేసి, ప్రదక్షిణలు ఆచరించి, తమ శరీరాలకు విభూతిని రాసుకునే వారు. కొన్ని రోగాల బారిన పడిన వారు, ఈ మంటల మీదుగా దుమికితే, రోగ విముక్తులు కాగలరని ప్రగాఢ విశ్వాసం. రాక్షసి బారి నుండి పరిరక్షించ బడిన ప్రహ్లాదుని ఉదంతం ఆధారంగా హోలీ మంటలు వేయడంలో బాలురకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం ఆచారమైంది. ఈ పర్వంలో పిల్లలకు బహుమానాలు ముడతాయి. పంచదారతో చేసిన ఆకుపచ్చ పూసలు, తెల్ల పూసలతో దండలు కూర్చంబడగా, వాటిని పిల్లలు కొంత సేపు ధరించి, ఆనందించి, తర్వాత తినడం చేస్తారు.

–  రామ కిష్టయ్య సంగన భట్ల…
     9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page