అది బయోలాజికల్‌ అలయన్స్‌ కాదు ..!

 ‘‘ఒక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో గానీ మోదీ తో గానీ భావజాలపరంగా సారూప్యత కలిగినవి కాదు. గతంలో వుండేవి. బాల్‌ థాకరే శివసేన, అకాలీదళ్‌ లాంటివి. అయితే ఇప్పుడు ఒక్కరూ కూడా లేరు. అన్నీ అవసరార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం వున్నవే! అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తూంది మీతో వుంటే, లేదంటే కేసులు ఎత్తేయడం… ఇలాంటివాటితో వున్నారు తప్ప బీజేపీ ఏజండాతో  సంబంధం వున్నవాళ్లు కాదు..’’

ప్రజలు నరేంద్ర మోదీ విభజిత రాజకీయాలను తిరస్కరించారు – 2024 ఎన్నికల సంకేతం అదే!.. : డా. పరకాల ప్రభాకర్‌

డా. పరకాల ప్రభాకర్‌ రచయితగా, విద్యావేత్తగా, మీడియా రంగంలో వందలాది చర్చా కార్యక్రమాలను నిర్వహించిన వ్యాఖ్యాతగా, రాజకీయ ఆర్థిక రంగాల విశ్లేషకులుగా, సాహిత్యవేత్తగా ప్రసిద్ధులు. తనకు నచ్చిన ఎందరో సాహిత్యవేత్తల గురించి, వారి కథలను, కవిత్వాన్ని యు ట్యూబు మాధ్యమంలో చదివి పరిచేయం చేశారు. తన సునిశిత దృష్టి కోణం నుంచీ వర్తమాన రాజకీయాల్లోని సంక్లిష్ట అంశాలను, పాలకుల వక్రనీతులను ఎంతో తేలికగా, సూటిగా విశదీకరించి చెప్పగలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కేంద్ర పాలకుల విధానాల్లోని లోటుపాట్లని ఎత్తిచూపుతూ ఇంగ్లీష్‌లో ‘‘ద క్రూకెడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా – ఎస్సేస్‌ ఆన్‌ ఎ రిపబ్లిక్‌ ఇన్‌ క్రైసిస్‌ ‘‘ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని తెలుగులో నవ తెలంగాణ ప్రచురణ సంస్థ ‘‘అష్ట వంకరల భారతం-సంక్షోభంలో గణతంత్ర వ్యవస్థ ‘‘ పేరుతో ఇటీవలే ప్రచురించింది.

2024 లోక్‌ సభ ఎన్నికల సమయంలో రాబోయే ఫలితాల గురించి ఆయన చేసిన విశ్లేషణలు చాలావరకు వ్యాసాల రూపంలో కనిపించాయి. బిజీపీ భావజాలాన్ని, కాషాయీకరణనీ వ్యతిరేకిస్తూ సగటు భారత ప్రజానీకం ఆకాంక్షలు ఎలా వున్నాయో ఆయన స్పస్టంగా తెలియజేశారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఎన్డీఏ లోని మిత్రపక్షాల సహాయంతో నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో రానున్న రోజుల్లోని పరిస్థితులు, దేశ రాజకీయాలు ఎలావుంటాయో, వుండబోతున్నాయో, ప్రతిపక్షాల పాత్ర గురించి’ ప్రజాతంత్ర ‘దినపత్రిక కోసం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(అనువాదం) గ్రహీత, సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్‌ కె. సజయ చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇది..

సజయ : నమస్కారం ప్రభాకర్‌ గారు. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసినంత సేపు పట్టలేదు.. రకరకాల అంచనాలు, రాజకీయ విశ్లేషణలు.. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావటం మీద ఏమంటారు?
పరకాల ప్రభాకర్‌ : నమస్కారం. మూడోసారి మోదీగారు ప్రమాణ స్వీకారం చేశారు కానీ, నాకెందుకో వీళ్లు విశ్వాస పరీక్ష నెగ్గుతారా అనే అనుమానం వుంది. నెగ్గరని కాదు. నెగ్గటం చాలా కష్టం అని..ఒకవేళ నెగ్గినా గానీ దినదిన గండం నూరేళ్ల ఆయుషులాగా వెళ్ళేటటువంటి ప్రభుత్వం అనిపిస్తోంది.

సజయ : ఎందుకని? ఎన్‌.డి.ఏ కూటమి సభ్యులు ఆయన్ని పూర్తిగా నమ్మరనా?
పరకాల ప్రభాకర్‌ : ఎన్‌.డి.ఏ సంగతి చూస్తే.. అది ఐడియలాజికల్‌ అలయన్స్‌ కాదు. దీనిలో ఒక్క పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో గానీ మోదీతో గానీ భావజాలపరంగా సారూప్యత కలిగినవి కాదు. గతంలో వుండేవి. బాల్‌ థాకరే శివసేన, అకాలీదళ్‌ లాంటివి. అయితే ఇప్పుడు ఒక్కరూ కూడా లేరు. అన్నీ అవస రార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం వున్నవే! అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తూంది మీతో వుంటే, లేదంటే కేసులు ఎత్తేయడం… ఇలాంటివాటితో వున్నారు తప్ప బీజేపీ ఏజండాతో సంబంధం వున్నవాళ్లు కాదు. ఆయన ఏజండాకి మేము సమ్మతి తెలుపుతున్నాము, కట్టుబడి వుంటున్నాము కాబట్టి ఎలాగోలా మనం ఈ ప్రభుత్వాన్ని బలపర్చాలి, దీంతో పాటుగా మనం దీంతో ప్రయాణాన్ని కొనసాగించాలి అనే మిత్రపక్షం ఒక్కటి కూడా లేదు ఇక్కడ. రెండోది, భారతీయ జనతా పార్టీకి తనంతట తానుగా కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి.

వాళ్లు ఎంత చెప్పినా గానీ, మాకే 370 వస్తాయి, మిత్రపక్షాలతో కలిపి 400 దాటుతాయి అని చెప్పినా గానీ ఆ పార్టీకి 240 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు లెక్కలు బయటకు రావాల్సినవి కూడా వున్నాయి. వీటిని విశ్లేషణ చేస్తే వచ్చినవాటిలో ఎంత మేజారిటీ వచ్చింది అని తీయాలి. నాకు వున్న సమాచారం ప్రకారం, దగ్గర దగ్గర ముప్ఫై నియోజకవర్గాలలో ఐదువందలు గానీ ఐదువందల లోపు గానీ మెజారిటీ మాత్రమే వచ్చాయి. అలాగే దాదాపు అరవై డెబ్భై స్థానాల్లో వేయిగానీ వెయ్యికన్నా తక్కువ గానీ మెజారిటీ వుంది. అంటే, ఇక్కడ ఏమన్నా అవకతవకలు చేశారా అనేది ఒక డిబేట్‌, ఆ చర్చ కూడా చేయాలి తప్పకుండా! దాన్ని కాసేపు పక్కన పెడదాం. కానీ, వీళ్లు బాగా బలహీనపడ్డారు అనేది అందరికీ తేటతెల్లమయింది. ఇక, నరేంద్ర మోదీ గారు స్వయంగా వారణాసిలోనే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా నెగ్గరు. ముందు ఆయన వెనుకంజలో వున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతా అయిన తర్వాత లక్షా యాభైవేల వోట్ల మెజారిటీతో గట్టెక్కారు! గంగామాత తన వొడిలోకి తీసుకుంది… వంటి కబుర్లు చెప్పినా గానీ, గతంలో కన్నా ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గిపోయింది. మూడోది, వీళ్ళు ఎంతో ఆర్భాటం చేసి, బాలరాముడి ప్రాణప్రతిష్ట చేసిన అయోధ్యలో.. అంటే ఫైజాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో వోడిపోయారు. అంతే కాకుండా, ఫైజాబాద్‌ అయోధ్యకి చుట్టుపక్కల పదిహేను పదహారు నియోజకవర్గాలు కూడా పోయాయి. ఇవన్నీ చూసుకుంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ వీరిద్దరి ఎజండా బాగా బలహీన పడిరది, ప్రజలు దీన్ని తిరస్కరించారు అనే సంకేతం వచ్చింది.

ఇది మనకే అర్థం అవుతున్నప్పుడు ఇన్నాళ్లూ రాజకీయాల్లో వుండి, కాకలు తీరినవాళ్లకు తెలియకుండా వుంటుందా? వాళ్లందరికీ ఇది అవగతమైంది…ఇదివరకు ఆయన ఏంచెబితే అది జరిగేది. ఎలా చెబితే అలా నడుచుకునేవారు. ఆయన మొట్టమొదటి నుంచీ అదే పంథాలో నడుచుకుంటూ వచ్చారు. ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పటి నుంచీ మొన్నటి వరకూ కూడా నలుగురుతో కూర్చుని పాలన ఎలా చేస్తే బాగుంటుంది అని సలహాలు, సంప్రతింపులు తీసుకోవటం, లేదంటే ఎవరిదగ్గరకైనా వెళ్లి వారు చెప్పిన ఆదేశాలను పాటించడం వంటివి ఏమీ లేవు. నేనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాను, నాదే ప్రభుత్వం, ఇది పార్టీ ప్రభుత్వం కాదు, అలయన్స్‌ ప్రభుత్వం కాదు అంతా నేనే.. అన్నట్టుగా అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా గానీ, ఇప్పుడు ఇక్కడ ప్రధానమంత్రిగా గానీ వ్యవహరించారు. అయితే ఇవాళ శక్తి లేనందువల్ల, సంఖ్య తగ్గి బలహీనపడినందువల్ల ఆయన ప్రతి చిన్నదానికీ సలహా తీసుకోవడమో, అవతలివాళ్లను వొప్పించడం, వాళ్ల అభ్యంతరాలు వినడం, చెప్పడం, సర్దుకోవడం..ఆ రకమైనటువంటి చాకచక్యం, సమర్థత అటువంటి మానసికమైనటువంటి సంసిద్ధత..అలాంటిది అలవాటు వున్నట్టుగా నాకనిపించడం లేదు. రాత్రికి రాత్రి నరేంద్ర మోదీ వాజపేయి అయిపోతారా? నాకైతే సాధ్యమనిపించడం లేదు.

అంచేత, ఈ ప్రభుత్వం వొడిదుడుకులతో వుంటుంది. విశ్వాస పరీక్షకు ముందే బేరసారాల్లో మిత్రపక్షాలు వాళ్లడిగిన మంత్రులు గానీ, లేకపోతే గవర్నర్‌ పదవులు గానీ, కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు గానీ, అధికారుల ట్రాన్స్‌ఫ్నర్లు గానీ.. ఇలా రకరకాల బేరసారాలు వుంటాయి. అంత మామూలుగా వుండే వ్యవహారం కాదు. నేను ముందే చెప్పినట్లు ఇవి భావసారూప్యతతో వున్న మిత్రపక్షాలు కాదు. అంచేత ఇవన్నీ దాటుకుని బలపరీక్షలో నెగ్గటం అనేది అంత తేలిక కాదు. నేను అసలు నెగ్గరని అనటం లేదు. అంత తేలిక కాదు అంటున్నాను. అయితే, బలపరీక్ష నెగ్గటానికి ఏవేవో హామీలు ఇచ్చేసి, బలపరీక్షలో గట్టెక్కుదామనుకుంటే, ఒకవేళ రేప్పొద్దున్న బలపరీక్ష అయిపోయిన తర్వాత ఆ హామీలు అమలు జరగకపోతే దాని పర్యవసానాలు చాలా కఠినంగా వుంటాయి. అందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి. అంచేత అంతా సజావుగా, సులువుగా, ఇబ్బందులు లేకుండా నడిచే వ్యవహారం కాదు. నల్లేరు మీద బండి అంటారే అలాంటి వ్యవహారం కాదనిపిస్తోంది.

సజయ : మమతా బెనర్జీ కామెంట్‌ ఈ నేపథ్యంలో నుంచే చూడాలంటారా?
పరకాల ప్రభాకర్‌ : అంతే! ఇవాళ ఇండియా అలయన్స్‌లో వున్నా, లేదా ఎన్‌.డి.ఏ అలయన్స్‌లో వున్న తెలుగుదేశం, జేడీయూ, మిగతావాళ్లు, కుమారస్వామి, దేవగౌడ, చంద్రబాబు, నితీష్‌ కుమార్‌..వీళ్ళెవరూ చిన్న పిల్లలు కాదు. రాజకీయాల్లో తలపండిన వాళ్లు. ఢక్కామొక్కీలు తిన్నవాళ్ళు. కిందపడిపోయినా, బలహీనపడినా గానీ లేచి నిలదొక్కుకున్నవాళ్లు. బలం పుంజుకున్నవాళ్లు. ఇచ్చిపుచ్చుకోవటం తెలిసి, బేరసారాలు చేయటం తెలిసినవాళ్లు. నలుగురితో మాట్లాడటం తెలిసి, వొప్పించుకోగలిగిన వాళ్లు. నలుగురిని వొప్పించి ముందుకు వెళ్లగలిగిన స్వభావం వుంది, ఆ వైపుగా అనుభవం వుంది, చరిత్ర కూడా వుంది. మరి, ప్రధానమంత్రి మోదీ గారికి అలాంటి అనుభవం గానీ, చాకచక్యం గానీ వున్నట్లు రుజువులు ఎక్కడా లేవు. మనం ఇందాక అనుకున్నట్టు రాత్రికి రాత్రి మనసు మారిపోతే మనమేం చెప్పలేము. అలాంటి చరిత్రే లేదు ఆయనకు. అనుకున్నది అనుకున్నట్టు చేయటం తప్పించి. డీమోనిటయిజేషన్‌ చేసేద్దామనుకున్నాడు, చేసేశాడు. లాక్‌ డౌన్‌ పెట్టాలనుకున్నాడు, పెట్టేశాడు. వీళ్ళను తీసేద్దామనుకున్నాడు, తీసేశాడు. వాళ్లను కొందామనుకున్నాడు, కొనేశాడు. ఇలా చేసుకుంటూ వచ్చారు తప్పించి, ఆయన మంత్రి మండలిలోనే నలుగురిని కూర్చోబెట్టి, ఆయన పార్టీలోని పెద్దల్ని, లేకపోతే ఆర్‌ఎస్‌ఎస్‌లోని పెద్దల్ని కూర్చోబెట్టి సంప్రదింపులు జరిపి, అందర్నీ వొప్పించి అంగీకారంతో నిర్ణయాలు తీసుకునే అలవాటు ఆయనకు లేదు.

వీటన్నిటి నుంచీ చూసినప్పుడు ఒకటి: పార్టీలో నుంచి గానీ మిత్రపక్షాల నుంచీ గానీ, లేకపోతే ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచీ గానీ ఈయన వైఖరితో ఇబ్బందిపడ్డవాళ్లు, ఎందుకు నువ్వు తప్పుకోవు అని కాస్త చాకచక్యం వున్న నాయకుడిని తీసుకువచ్చి పెట్టుకున్నా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. రెండు : కొన్నాళ్లు ఈయనే నాటకీయంగా నడిపి, వాళ్లని వీళ్ళని బతిమలాడి, నయానోభయానో వొప్పించి నడుపుకుంటూ వచ్చినాగానీ.. రోజూ పొద్దున్నే లేచిన దగ్గర్నుంచీ నాకు ఇవ్వాళ వున్న డిమాండ్స్‌ ఏమిటి, పొద్దునా మధ్యాన్నం సాయంత్రం ఏం చేయాలి అని ఆచితూచి నడపటం అనేది ఎంతకాలం సాగుతుంది? ఆ రకంగా ఎక్కువ కాలం నడపలేడు ఈయన. అలా వున్నప్పుడు.. ఏదన్నా ఒక పెద్ద నిర్ణయం తీసుకుని..అది సిఎఎ గానీ, ఎన్‌ఆర్సి గానీ జ్ఞానవాపి గానీ మరోటి గానీ ఇలాంటివి ఒక పెద్ద నిర్ణయం తీసుకుని..చూడు నేను ఈ పెద్ద నిర్ణయం తీసుకుని అమలుచేయాలనుకున్నాను, నాతో వున్న మిత్రపక్షాలు వొప్పుకోవటం లేదు, అంచేత నేను లోక్‌ సభను రద్దుచేసి మళ్లీ ఎన్నికలతో మీ దగ్గరకు వస్తున్నాను. నాకు బలం వుంటేనే నేను ఇవన్నీ చేయగలుగుతాను అనే అవకాశం కూడా వుంది. అందుకే, 18వ లోక్‌ సభ పూర్తికాలం సజావుగా నడుస్తుందని నేను అనుకోవటం లేదు. మోదీ ప్రభుత్వం అతి కష్టం మీద మాత్రమే విశ్వాస పరీక్ష నెగ్గుతుందని, నెగ్గిన తర్వాత కూడా వొడిదుడుకులతోనే వుంటుందని, వున్నా కూడా అది ఎక్కువకాలం కొనసాగకుండా లోక్‌ సభను రద్దుచేసే వైపు వెళుతుందని నాకనిపిస్తోంది.

సజయ : ఎంత సమయంలో ఇలా జరగొచ్చని మీ అంచనా?
పరకాల ప్రభాకర్‌ : అది ఎంత సమయంలో అనేది చెప్పలేం గానీ, అది కొన్ని వారాలా లేదా కొన్ని నెలలా అనేది నాకు అనిపిస్తోంది. అంత తెలికైతే కాదు. 2014లో వాళ్ల విజయం చాలా సునాయాసంగా వచ్చింది. 2019లో కూడా సునాయాసంగానే వచ్చారు. కానీ 2024 వచ్చేసరికి నిక్కీ నీలిగి, పదేళ్ల పాలన తర్వాత.. ఇంత రామజన్మభూమి ఏజండా ముందుపెట్టి, రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత, భారతదేశం ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అన్న తర్వాత, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ అన్న తర్వాత, మీడియాలో ఒక్కరూ కూడా దీనిని ప్రశ్నిస్తూ ఒక్క పల్లెత్తు మాట కూడా అనని పరిస్థితి వుండగా, మొత్తంగా వ్యవస్థలన్నీ వాళ్ల చేతిలో వుండగా, ఎన్నికల కమిషనే వాళ్ల చేతిలో వున్నప్పుడు, వాళ్ళేం చేసినా దేశంలో అడిగేవారే లేని పరిస్థితి వుండగా కూడా ఇంత ఇబ్బందిపడి అధికారంలోకి వచ్చారు. అది కూడా పూర్తి మెజారిటీ లేదు-అంటే భారతీయ జనతా పార్టీ మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం వుందో అర్థంచేసుకోవచ్చు.

సజయ : మీరు ఇందాకా కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఒకటి ఎన్‌ఆర్సి, సిఏఏ అంశాలు ముందుకు తీసుకువచ్చే అవకాశం వుందని! అది మెడ మీద కత్తిలా ఎప్పటి నుంచో వేలాడుతూనే వుంది. రెండొవది : బలమైన ఆర్ధిక వ్యవస్థగా మార్చాము అని కబుర్లు చెప్పటమే అయిందని! వాస్తవానికి ఈ పదేళ్లలో ఏం జరిగింది?
పరకాల ప్రభాకర్‌ : ఈ తీర్పు ఏం చెబుతోంది? దీనిలో ఏం సందేశం వుంది? ఈ రెండిరటిలో నుంచీ నేను పై రెండు అంశాలను చెబుతాను. నా ఉద్దేశంలో ఈ తీర్పు కచ్చితంగా ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ఇచ్చింది. అది ఈ హిందూ-ముస్లిం అంశం కట్టిపెట్టు. ఈ రాముడు, దేముడు, గుడి, గోపురం ఈ వ్యవహారాలు ఆపేయి. ఈ హిందూ-ముస్లిం, మాసం, ముషాయిరా, ముజ్రా, మంగళసూత్రం ఇవన్నీ ఆపేయి. మేము ఇరుగుపొరుగు.. ఒకే వూర్లో కలిసిమెలసి బతుకుతున్నాం. మమ్మల్ని వూరికే ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టవద్దు అనేది ఒక బలమైన సందేశం వచ్చింది. అంతేకాదు, మాకు ధరలు పెరిగిపోయాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. మా రైతుల పరిస్థితి బాలేదు. కోవిడ్‌ తర్వాత పరిస్థితి మరీ అధ్వాన్నమయిపోయింది. మేము ఇవేవీ తట్టుకోలేము.

మాకు ఇవేవీ కాకుండా నువ్వు ఇంకేవో కబుర్లు చెబితే కుదరదు అనేది మరో సందేశం. మూడోది : అసలు మా బతుకులు ఇలా వుంటే, వాడేదో పెద్ద బిలియనీర్‌ అయిపోయాడు, వీడేదో అలా అయ్యాడు, ఇన్ని ఎయిర్‌ పోర్టులు కట్టాను, రోడ్లు వేశాను అని నువ్వు అంటే ..దీనివలన ఎవరికి ఉపయోగం పడిరది? మాకు కాదు కదా? మాది కాదు కదా ఇది! అంచేత మా బతుకుతెరువు ఏమిటి? మా ఉద్యోగాలు ఏమిటి? మా ఆదాయాలు ఏమిటి? మా వ్యవసాయం పరిస్థితి ఏమిటి? మా పంటలు ఏమిటి? మా మహిళ భద్రత ఏమిటి? మా గౌరవం ఏమిటి? వీటి మీద దృష్టి పెట్టకుండా ఏం మాట్లాడుతున్నావు అని నిరసన వ్యక్తంచేయటం. ఇది మామూలుగా శిక్షించకుండా, లాగి లెంపకాయ కొట్టి జాగ్రత్తగా వుండండిరా అని ఒక సందేశం! ఇది పెడచెవిన పెట్టి, ఇవేవీ కాకుండా, పట్టించుకోకుండా మళ్లీ పాత పద్ధతిలోనే వెళితే ఈసారి మందలింపు కాదు, శిక్ష పడుతుంది. ఆ రకంగా చూస్తే ఆర్థికంగా నిజంగానే 7.2 శాతం వృద్ధి పెరిగిందనుకుందాం. అంత శాతం వృద్ధి పెరిగితే 24 శాతం యువతకు ఉద్యోగాలు ఎందుకు లేవు? 81 కోట్ల మందికి నువ్వు ఉచితంగా ఆహారాధాన్యాలు ఇవ్వాల్సిన పని ఏమిటి? ఇంత బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతూ దూసుకుపోతూ వుంటే, ఫాస్టెస్ట్‌ ఎకానమీ, లార్జెస్ట్‌ ఎకానమీ అని చెబుతూ వుంటే, మరి ఇవన్నీ ఏమిటి? ఇలా వుండకూడదు కదా?

సజయ : అలా ఆహార ధాన్యాలు ఇవ్వటానికి కూడా పూరెస్ట్‌ ఆఫ్‌ ది పూరెస్ట్‌ అనే కాన్సెప్ట్‌ వుంటుంది కదా!
పరకాల ప్రభాకర్‌ : అవును. ఇంకోపక్క ఏం చెప్పారు.. ఇవన్నీ జరుగుతూ వుండగా, మేము ముప్ఫైకోట్ల మందినో ముప్ఫై మూడు కోట్ల మందినో పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చేశామన్నారు. ముప్ఫై మూడు కోట్ల మంది పేదరికంలో లేకపోతే, ఇంకా ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అంటే మీరు చెప్పేదానికి, క్షేత్రస్థాయి వాస్తవానికి పొంతన లేదు అని స్పష్టమైంది. కొంత మంది ఏమనుకుంటామంటే వాళ్లందరికీ ఇవన్నీ అర్థమవుతాయా? ఎలక్టోరల్‌ బాండ్స్‌ అర్థమవుతాయా? కాన్స్టిట్యూషన్‌, రాజ్యాంగ విలువలు అర్థమవుతాయా? సెక్యులరిజం అర్థమవుతుందా? అని అనుకుంటాం గానీ, మనలాగా ఆలోచించకపోయినా వారివారి స్థాయిలను బట్టి అన్ని విషయాలు అర్థమవుతాయి. వారి జీవితాల్లోనూ అన్నీ వుంటాయి. వారి ఇరుగుపొరుగుల్లో వుంటాయి.

వారు బయటకు వెళితే వుంటుంది. అవతల వారి(ముస్లిమ్స్‌) కొట్లలో ఏమీ కొనొద్దు అంటున్నారు, ‘వాళ్లను’ బాయ్‌ కాట్‌ చేయమంటున్నారు. మీకు ఉద్యోగాలు లేకపోతే ‘వాళ్లు’ కారణమంటున్నారు. ఇండియా కూటమి వాళ్లు నెగ్గితే మీవన్నీ తీసుకెళ్ళి ‘వాళ్లకు’ ఇచ్చేస్తారు అంటున్నారు. ఇలా చెబితే నమ్మేటంత దద్దమ్మలు కారు కదా భారతీయ ప్రజలందరూ! అయితే, నాకున్న ఒక చిన్న అసంతృప్తి ఏమిటంటే, ఈ జరిగినటువంటి యుద్ధం, పోరాటం, ఒక సంఘర్షణ భారత ప్రజానీకానికి- మోదీకి మధ్య జరిగింది. భారత ప్రజానీకానికి- బీజేపీకి మధ్య జరిగింది. భారత ప్రజానీకానికి- ఎన్‌.డి.ఏకి మధ్య జరిగింది. ఇది ఒక నాయకుడికి- మోదీకి మధ్య, ఒక పార్టీకి- బీజేపీకి మధ్య, ఒక అలయన్స్‌కి ఇంకో అలయన్స్‌ కి మధ్య జరగలేదు. అలా కూడా జరిగివుంటే దీనికి మరింత ఊతం వచ్చి వీళ్లకు 240 కాదుకదా 150 కూడా వచ్చి వుండేవి కాదు.

సజయ : ఇండియా కూటమి నేతలు అంత పోరాటం చేయలేక పోయారంటారా?
పరకాల ప్రభాకర్‌ : నాకైతే కనిపించలేదు. నిజానికి ఎంత పోరాటం చేయాల్సిన అవసరం వుందో, ప్రజల్ని ఎంత చైతన్య పరచాల్సిన అవసరం వుందో, ఎంత సంసిద్ధత వుండాలో అంత సంసిద్ధత, అంత పోరాటం నాకైతే కనపడలేదు. జరిగినదంతా పౌరసమాజం నుంచీ వచ్చిన ప్రతిఘటన తప్పించి, అది సోషల్‌ మీడియాలో గానీ, రాయడంలో గానీ, వ్యాసాలలో గానీ అంటే ఇదంతా ఇండిపెండెంట్‌ మీడియాలో జరిగింది. అదే వాళ్ల గోదీ మోదీ మీడియాలో అయితే అస్సలు సాధ్యమే కాదు. వీటన్నిటిలో కూడా పార్టీల కన్నా కూడా పౌరసమాజమే ఎక్కువ క్రియాశీలకంగా పనిచేసింది. అంచేత ఇది వాళ్ల కృషి ఫలితంగా, ఇవ్వాళ నెగ్గినటువంటి ప్రత్యర్థులు, బీజేపీకి, ఎన్‌.డి.ఏకి వున్న ప్రత్యర్థులు అందరూ పౌరసమాజ కృషి వల్ల లాభపడ్డారు. వాళ్లు చేయాల్సినంత కృషి చేసి వుంటే ఈ పరిణామాలు ఇంకా అద్భుతంగా వుండేవి.

సజయ : భారత్‌ జోడో యాత్ర వంటి వాటి ద్వారా కొంత చేస్తూ వున్నట్లు కనిపించారు. అయితే వాటిని పార్టీ పరంగా చూసారంటారా?
పరకాల ప్రభాకర్‌ : లేదు, అయితే ఆ మాత్రం అన్నా ప్రభావం వుంది. యాత్ర జరిగింది. యాత్ర జరిగి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ నెలకొన్న వాతావరణాన్ని, దాన్ని అలా కొనసాగించే విధంగా, పరిస్థితులను పటిష్ట పరిచే చర్యలు లేవు. అటువంటి ప్రయత్నాలు జరగలేదు.
సజయ : కరెక్ట్‌. నేను కూడా ఆ విషయాన్ని వొప్పుకుంటాను.
పరకాల ప్రభాకర్‌ : అలా జరిగి వుంటే ఇంకా చాలా బాగుండేది.
(ఇంకా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page