అధికార దుర్వినియోగం

ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది.

ప్రస్తుత  డిజిపి స్వరణ్‌జిత్‌సేన్‌ మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ‘అధికారం ఉంది కాబట్టి ఏమయినా మాట్లాడుతాను’ అనుకోవడం వేరు. పదవి వచ్చిన పరిధి లోపల మాట్లాడుతున్నావా లేదా అనేది వేరు. అది ఎవరికీ తెలిసినట్టు లేదు. అందుకే నేనేమంటానంటే, అధికారాన్ని దుర్వినియోగం చేయకపోతే అధికారం అనుభవించినట్టే ఉండదు. అధికారపు మజా తెలియాలంటే దాన్ని దుర్వినియోగం చేయాల్సిందే. అధికారం మాత్రమే నిర్వహించాలంటే దర్పం అక్కరలేదు. ఫోటోలు, వీడియోలు ప్రచారం అక్కరలేదు. ఇది ఎవరూ ఒప్పుకోవడం లేదే, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. రమీజాబీ రేప్‌, ఆ తర్వాత ప్రజాందోళనలు జరిగాయి. అప్పుడు జస్టిస్‌ ముక్తధర్‌ కమిషన్‌ వేశారు. అది కస్టడీలో జరిగిన హింస. ఆ సమయంలో సయ్యద్‌ బిన్‌ అలీని ఇంటికి వెళ్ళి బైటికి పిల్చి కాల్చి చంపారు. రౌడీని కాల్చిచంపినారు కాబట్టి అతను నక్సలైటు కాదు కాబట్టి న్యాయస్థానం సరిగా స్పందిస్తుందేమో అని నేను వాదించదలచు కున్నాను. ఆ కేసు చేసే న్యాయవాదికి విజ్ఞప్తి చేసి నేను వాదించడం మొదలు పెట్టాను.

జస్టిస్‌ ముక్తధర్‌ దగ్గర చెప్పాను. ఇండియన ఎవిడెన్స్‌ ఆక్ట్‌లో సెక్షన్‌ 105 ఉంది. దాని ప్రకారం ఎవరయినా మినహాయింపు కోరుకుంటున్నట్టయితే, ముందుగా నేరం జరిగిందని అంగీకరించాలి. ఆ నేరానికి ఛార్జిషీట్‌ తయారు చేయాలి. ఆ నేరాభియోగానికి గురయిన వ్యక్తి ఆ నేరం ఏ పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందో, అది ఎందువల్ల మినహాయింపు అవుతుందో రుజువు చేసుకోవడానికి పూర్తి అవకాశాలు ఇవ్వాలి. చాలసేపు వాదించాను. ముక్తధర్‌ ఇబ్బందిలో పడ్డారు. నా వాదనను ఒప్పుకోక తప్పదు. అందుకని ఈ కేసును ఫుల్‌బెంచికి నివేదించారు. ఆ బెంచిలో జస్టిస్‌ రామచంద్రరావు, నరసింగరావు ఉన్నారు. మన జడ్జిలు కూడ ఎలా ఉంటారంటే, మరి పోలీసులకు తుపాకులు ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ‘తుపాకులు ఇచ్చేది కాల్పులు జరిపి జనాన్ని చంపి పారేయడానికి కాదండీ’ అన్నాను. ఆ జడ్జి వకీళ్ళతో బాగా మాట్లాడుతుండేవాడు. కోర్టు హాల్లో చర్చ బాగుండేది. చాల మంచి  జడ్జి ఆయన. పెద్ద ఎత్తున ప్రజలు గుంపుగా మీద పడితే, దొమ్మీ జరిగితే అప్పుడు ఉపయోగించ డానికి తుపాకులు ఇచ్చారు. అప్పుడు కూడ ప్రజలను హెచ్చరించడం, గాలిలో కాల్పులు జరపడం, మెజిస్ట్రీటు అనుమతితోనే కాల్పులు జరపడం, అప్పుడు కూడ నేరుగా మనుషులకు గురిపెట్టి కాకుండా, మోకాళ్ళ కింద కాల్చడం లాంటి ఎన్నో నిబంధనలున్నాయి. దేశంలో ఏ ఒక్క చట్టమయినా పోలీసులకు ప్రజలను కాల్చి చంపే అధికారం ఉంది అని చెప్పలేదు. అప్పుడూ ఈ మాటే చెప్పాను. ఇప్పటికీ నా బలమైన విశ్వాసం అదే. పోలీసులకు ప్రజలను కాల్చి చంపే అధికారం లేదు.     అప్పుడు ఓబులపతి చౌదరి గారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు. నేనొక ప్రతిపాదన చేశాను. ఒక రోజంతా సమయం తీసుకోండి – ఏ చట్టంలో ఏ నిబంధ నయినా పోలీసులకు ప్రజలను చంపే అధికారం ఇస్తుందేమో చూపెట్టండి.అటువంటి అధికారం లేదు. ఎందుకంటే, పోలీసులకు అటువంటి అధికారం ఇస్తే అది చట్టం విధించిన విచారణాక్రమానికి ప్రత్యామ్నాయం అవుతుంది. అంటే అప్పుడు చట్టం చట్టవ్యతిరేకం అవుతుంది. అన్యాయమైన చట్టం అవుతుంది.

రాజ్యాంగంలో 21వ అధికరణం ఉన్నంతవరకు అటువంటి అధికారం ఇచ్చే చట్టానికి అవకాశం లేదు. మరి ఆ అధికరణమేమో చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం తప్ప మరొక రకంగా ప్రాణం తీసే అధికారం లేదు అని ప్రకటిస్తుంది. అధికరణం 21 ఉన్నంతవరకు ఏ అధికారికీ మనుషులను కాల్చి చంపే అధికారం లేదు.
ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది.ఇట్లా వాదించాను. న్యాయమూర్తికి ఎటూ తోచలేదు. కడపటికి ఏం చేసినాడంటే, మీరు ప్రైవేటు కంప్లెయింట్‌ వేసుకోండి అని కొట్టేశాడు.
ఒక అన్యాయమైన పని జరిగిందంటే అందరికందరూ ప్రజలకు వ్యతిరేకంగా ఏకపువుతారు. మఠాకడతారు. మొత్తం వ్యవస్థలోని అంగాలన్నీ ఒక్కదగ్గరికి వస్తాయి. ఆ అన్యాయం వల్ల బాధితులెవరో, ఆ బాధితులకు వ్యతిరేకంగా వ్యవస్థ అంతా ఏకపువుతుంది.

రమీజాబి వేశ్య. నక్సలైట్లు నెత్తురు తాగుతారు. టెర్రరిస్టులు అనైతికంగా ప్రవర్తిస్తారు. ఇట్లా ఆరోపణలు చేసేది, ఆ అన్యాయపు పని నుంచి తప్పించుకునేది. జిందా, సుఖాల విచారణ చూడండి. ఆ మొత్తం విచారణ క్రమంలో వాళ్ళిద్దరూ నీతి బాహ్యులని, చాలా అనైతికమైన పనులు చేశారని చూపడానికి వెయ్యి ఆధారాలు న్యాయస్థానం ముందర పెట్టారు. వాళ్ళకు బొంబాయిలో, పూనాలో వేశ్యలతో సంబంధా లున్నాయని చూపారు.
అవన్నీ అబద్ధాలు. వాటిలో ఒక్కదాన్ని కూడ న్యాయమూర్తి కూడా నమ్మలేదు. ఆ ఇద్దరూ చాల మతాభినివేశం గల వ్యక్తులు. తాము  ప్రాణప్రదంగా ఎంచే స్వర్ణ దేవాలయం లోపలికి టాంకులు, శతఘ్నులు వెళ్ళి బాంబులు వేయడం, నేలమట్టం చేయడం వారిని కలచివేసింది. అందుకు బాధ్యుడుగా భావించిన జనరల్‌ వైద్యను వాళ్ళు హత్య చేశారు. ఆ సంగతి వాళ్ళే ఒప్పుకున్నారు. అందుకు కోర్టు వాళ్ళకు శిక్ష కూడా విధించింది.
కాని ఈ విచారణా క్రమంలో ప్రాసిక్యూషన్‌ ఆ ఇద్దరు ముద్దాయిల మీద ఎన్నో అబద్ధాలు ప్రచారం చేసి ఛార్జిషీట్‌లో కూడా రాసిందే. వాటిని న్యాయమూర్తి కూడా నమ్మలేదే. మరి తీర్పులో వాటి గురించి ఒక్కపూట లేదు.అంటే మొత్తం వ్యవస్థ న్యాయానికి వ్యతిరేకంగా పనిచేయాలని, చేస్తుందని మనం అనుకుంటాం.
భార్గవా కమిషన్‌ తర్వాత ఇరవై సంవత్సరాలు గడిచిపోయాక ఒక రెండు ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి…

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page