మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 7: బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వసతి కల్పించడం జరుగుతుందని, దీంతో దాదాపు 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అందిస్తున్నన్ని పథకాలు దేశంలో ఎక్కడ ఇవ్వడం లేదన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 19వ డివిజన్ అంబేద్కర్ నగర్ , న్యూ గాయత్రి నగర్, ఈస్ట్ గాయత్రి నగర్ కాలనీ వాసులు బిఆర్ఎస్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన “ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.సమావేశానికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డికి కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని, ఘన స్వాగతం పలికి, మా కాలనీల అభివృద్ధి ప్రదతా సబితమ్మను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలంతా తమ మద్దతు ప్రకటించి, హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో మానవీయ కోణంలో ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే అమలవుతున్న కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలు సమాజంలో అనేక మార్పులకు కారణం అయ్యాయన్నారు. దేశంలోనే మొదటిసారి రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టి, వ్యవసాయాన్ని పండుగగా మార్చినట్లు చెప్పారు. ఇవేవీ ఎన్నికల వాగ్దానాలు కావాని అందరి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.10 వేలు ఉన్న రైతు బంధును రూ.16 వేలకు పెంచడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్లు సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసారు. ఇన్నాళ్లు పాలించిన పార్టీలు ఇవేమీ చేయకున్న నేడు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయటం సబబు కాదని హితవు పలికారు. రైతు భీమా స్పూర్తితో బతుకుకు ఆర్థిక భరోసా కలిపిస్తూ 93 లక్షల మందికి రూ.5 లక్షల భీమా సౌకర్యం, ప్రతి పేద మహిళలకు నెలకు రూ.3 వేలు ఆర్ధిక సహాయంతో పాటు రూ.400 లకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలాంటి అనేక కొత్త పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు చెప్పారు. లావాణి భూములకు బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే పట్టాదారు హక్కు పత్రం ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందంటే, అది కేవలం కేసీఆర్, కేటీఆర్ వల్లేనన్నారు. మళ్ళీ ముఖ్య మంత్రిగా కేసీఆర్ గెలిస్తేనే ప్రజా పాలన వస్తుందని, అందు కోసం ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే గా నన్ను, సీఎంగా కేసీఆర్ ను ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.