బెంగళూరు, జూలై 5 : అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు చేసిన ఓ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏసీబీ ’కలెక్షన్ సెంటర్’గా మారిందని.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను బదిలీ చేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్ పీ సందేశ్ వెల్లడించారు. బెంగళూరు నగర డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఓ భూ వివాదంలో రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు. ఐఏఎస్ అధికారి, బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ కిమిషనర్ మంజునాథ్ ను ఏసీబీ ఈ కేసులో అరెస్టు చేసింది.
బెంగళూరు నగర డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పని చేసే డిప్యూటీ తహశీల్దార్ మహేష్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో.. ఏసీబీ పని తీరును న్యాయమూర్తి సందేశ్ పరిశీలించారు. సీనియర్ అధికారులను రక్షిస్తున్నారని కేవలం జూనియర్ సిబ్బందిని మాత్రమే విచారిస్తున్నారని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీబీ ’కలెక్షన్ సెంటర్’ గా మారిందని, 2016 నుంచి దాఖలు చేసిన కేసుల వివరాలను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఏసీబీని ఆదేశించింది. రిపోర్టులకు సంబంధించి మరో బెంచ్ విచారణ జరుపుతోందని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెడ్ హ్యాండెండ్ గా పట్టుబడిన వారిపై బి రిపోర్టులు నమోదు చేస్తున్నారని, డివిజన్ బెంచ్ కు సమాచారం ఇచ్చినా.. తనకు ఎందుకు వివరాలు అందించడం లేదని న్యాయమూర్తి సందేశ్ ప్రశ్నించారు. అవినీతి పరుల రక్షణకు తాము నిలబడమని, అవినీతి క్యాన్సర్ గా మారిందని అభివర్ణించారు.
సెర్చ్ వారెంట్లతో బెదిరించి దోపిడీ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల మేలు కోసం చర్యలు తీసుకోవడానికి సిద్ధమని, ఏసీబీ ఏడీజీపీ శక్తివంతమైన వ్యక్తిలా కనిపిస్తున్నారంటూ న్యాయమూర్తి సందేశ్ తెలిపారు. జూలై 7న జరిపే విచారణకు డీపీఏఆర్ సెక్రటరీ హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం తనకు బెదిరింపులు వచ్చాయని, నేను ఎవరికీ భయపడనని తెలిపారు. జడ్జీ అయ్యాక తాను ఆస్తులు కూడబెట్టలేదని.. పదవి పోయినా ఫర్వాలేదన్నారు. తాను ఒక రైతు కుమారుడినని, ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదన్నారు. అంతేగాకుండా ఏ రాజకీయ సిద్దాంతానికి కట్టుబడి ఉండనని కుండబద్ధలు కొట్టారు. జడ్జీని బెదిరించే స్థాయికి చేరుకున్నారని, రాష్ట్రం అవినీతిలో కూరుకపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.