అసంఘటిత కార్మిక శక్తి శంకర్‌ ‌గుహ నియోగి

ఒక ఉద్యమం పుట్టింది అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు ప్రవాహంగా దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌పూర్‌, ‌దుర్గ్, ‌రాజ్‌నంద్‌గావ్‌, ‌సర్గుజా, బిలాస్‌పూర్‌, ‌రాయ్‌గఢ్‌, ‌బస్తర్‌ ‌ప్రాంతాలు ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, డోలమైట్‌, అనేక ఇతర నిక్షేపాలకు ప్రసిద్ధిగా పేరుగాంచాయి. 1959 నెహ్రూ ప్రభుత్వం దుర్గ్ ‌జిల్లాలోని భిలాయ్‌ ‌లో సోవియట్‌ ‌యూనియన్‌ ‌సహకారంతో ప్రభుత్వ రంగంలో భిలాయ్‌ ‌స్టీల్‌ ‌ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఆ ఫ్యాక్టరీ దేశంలోనే ఉక్కు ఉత్పత్తిలో అతిపెద్ద కర్మాగారంగా రూపాంతరం చెందింది. పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రం డార్జిలింగ్‌ ‌సమీపంలోని జూల్పయిగురిలో 1943 ఫిబ్రవరి 14న జన్మించిన శంకర్‌ ‌గుహ నియోగి వారి కుటుంబంలో పెద్దవాడు. తండ్రి పాఠశాలలో ఉపాద్యాయుడిగా పని చేసేవారు.

నియోగి తల్లి చనిపోగానే 1961లో పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఛత్తీస్‌గఢ్‌ ‌బంధువుల ఇంటికి దుర్గ్ ‌జిల్లాకు వచ్చి భిలాయ్‌ ‌స్టీల్‌ ‌ఫ్యాక్టరీలో ఉద్యోగం పొంది బ్లాస్ట్ అం‌డ్‌ ‌ఫర్నేన్స్ ‌యాక్షన్‌ ‌కమిటీ అనే కార్మిక సంఘాన్ని స్థాపించి సమరశీలమైన పోరాటాలు సమ్మెలు చేయడం ప్రారంభించారు. అధిక వెట్టిచాకిరి, చాలీచాలని జీతాల నడుమ చిన్నాభిన్నం అయి బ్రతుకీడుస్తున్న కార్మికులను మద్యపానానికి వ్యతిరేకంగా అక్కడి కార్మికులందరిచేత ప్రయాణం చేయయించడంతో.. సంపూర్ణ మద్యనిషేధం అర్జున్‌ ‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి హయాంలో అక్కడ అమలవడంతో ప్రభుత్వానికి కంటగింపుగా నియోగి మారారు. ఇదే క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ ‌ముక్తి మార్చ్ ఉద్యమం ప్రారంభం కావడం జరిగిపోయింది. సంఘటిత అసంఘటిత కార్మికుల నడుమ ఉన్న అంతులేని ఆంతర్యాలు అర్థం చేసుకొని వారందరినీ ఒకటిగా చేయడం మొదలు కార్మికులు సమ్మె చేసే క్రమంలో జీతభత్యాలు లేక కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటించవద్దని సమీప గ్రామాల రైతుల నుండి  కార్మికులకు ఆహారం అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నియోగి.. కార్మికుల పోరాటం నిర్విరామంగా కొనసాగేందుకు బాటలు వేశారు.

ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ అయి 13 నెలలు జైల్‌ ‌జీవితం అనుభవించిన శంకర్‌ ‌గుహ నియోగి తన జీవితంలో 26 సార్లకు పైగా జైల్లో ఉండటం, అనేకసార్లు అరెస్ట్ ‌కావడం కాలక్రమంలో సాగిపోయింది. తమ హక్కుల కోసం జరిగిన పోరాటంలో పోలీస్‌ ‌కాల్పుల్లో అమరులైన అమాయకులైన ఆదివాసీ కార్మికులు, నాట్య కళాకారుల పేరిట రూపాయిని ద్వేషించి రోగిని ప్రేమించే షాహీద్‌ ‌హాస్పిటల్‌ ‌నిర్మించి ప్రజలందరికీ ఉచిత సేవలు అందించడం, అందుకోసం దేశ నలుమూలల నుండి మనసున్న మనుషులు హాస్పిటల్లో  నేటికి విధులు నిర్వహించడం మనకు కనిపిస్తుంది. ధనిక భూమి, పేద ప్రజలకు నిలయమైన ఛత్తీస్‌గఢ్‌ ‌లో ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై స్వార్థ ప్రయోజనాలే ఆధిపత్యం కొనసాగాయి. ఈ ప్రాంతంలోని సహజ వనరులను దోపిడీ చేయడంలో పారిశ్రామిక వేత్తలది పై చేయి కాగా సాధారణ ప్రజలు పేదరికం, నిర్లక్ష్యం నుండి పైకి తీసుకురావడానికి ఆందోళన కార్యక్రమాలకు అంకురార్పణ చేసిన నియోగి పై జాతీయ భద్రత చట్టం కింద కేసులు నమోదు కావడం తనను హత్య చేయచూస్తున్న పారిశ్రామిక వేత్తలపై దిల్లీలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన స్థానిక అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు రక్షణ కలిపించలేదు.

1991 సెప్టెంబర్‌ 28‌న తెల్లవారు జామున తన ఇంట్లో నిద్రిస్తున్న నియోగిని కిరాయి హంతకులచే హత్య చేయడం, అనంతరం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన   ఆ హత్య.. కార్మికుల డిమాండ్లతో ఆ హత్య కేసును కేంద్రం సిబిఐకి అప్పగించారు. ఈ కేసులో దుర్గ్ ‌సెషన్స్ ‌కోర్టు 1997లో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, కిరాయి హంతకుడికి మరణ శిక్ష ఖరారు చేయగా నిందితులు క్రింద కోర్టు తీర్పును సవాల్‌ ‌చేస్తూ అప్పీలుకు మధ్యప్రదేశ్‌ ‌హై కోర్టును ఆశ్రయించడంతో 1998లో హై కోర్ట్ ‌తీర్పును కొట్టివేస్తూ నిందితులందరిని నిర్దోషులుగా విడుదల చేసింది. హై కోర్టు తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టు ను ఆశ్రయించడంతో యజమానుల విషయంలో హై కోర్టు తీర్పును ఏకీభవిస్తూ కిరాయి హంతకుడికి మరణ శిక్షకు బదులుగా యావజ్జీవ కారాగార శిక్షను 2005లో ఖరారు చేసింది. కార్మిక సంఘం నాయకుడి హత్య కేసులో రాష్ట్ర పోలీసులు, సిబిఐ కలిసి దర్యాప్తు చేయడం దేశంలో మొట్టమొదటి కేసుగా నియోగి కేసు నిలవడం కనిపిస్తే, నియోగి కేసుకు ముందు సింగరేణి నల్ల నేలలో జరిగిన కార్మిక గుండెచప్పుడు వీటి అబ్రహం హత్య కేసు సైతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పక తప్పదు. అసంఘటిత కార్మికులను సంఘటిత పరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అసువులు బాసిన కార్మిక నాయకులు కార్మిక లోకం గుండెల్లో చిరస్థాయిగా పదిలంగా ఉంటారు.
 -అనిల్‌భగత్‌
9491743506

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page