- సుప్రీమ్ కోర్టుకు 6 వేల మంది పౌరులు, హక్కుల సంఘాలు, కార్యకర్తలు, తదితరుల లేఖ !
- బిల్కిస్ బానో అత్యాచారం కేసులో రేపిస్టుల విడుదలను వ్యతిరేకిస్తూ డిమాండ్
న్యూ దిల్లీ, ఆగస్ట్ 20 : బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 6 వేల మంది సుప్రీమ్ కోర్టుకు లేఖ రాశారు. వాళ్ళ రెమిషన్ను తక్షణం రద్దు చేసి తిరిగి జైలుకు పంపాలని ఆ లేఖలో పౌరులు డిమాండ్ చేశారు. గుజరాత్లో 2002లో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని అత్యంత కిరాతంగా హత్య చేసిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆ 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని వారిని తిరిగి జైలుకు పంపాలని కోరుతూ 6 వేల మంది పౌరులు, మహిళా కార్యకర్తలు, పౌర, మానవహక్కుల కార్యకర్తలు సుప్రీమ్ కోర్టుకు లేఖ రాశారు. ‘‘సామూహిక అత్యాచారం, సామూహిక హత్యలకు పాల్పడిన 11 మంది వ్యక్తులను విడుదల చేయడం అత్యాచార బాధితులందరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
వ్యవస్థపై, న్యాయంపై నమ్మకం కలిగి ఉన్న ప్రతి ఒక్కరిపై ఇది వ్యతిరేక ప్రభావం చూపుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. సుప్రీమ్ కోర్టుకు లేఖ రాసిన వారిలో సామాజిక కార్యకర్తలు సయ్యదా హమీద్, జఫరుల్-ఇస్లాం ఖాన్, రూప్ రేఖ, దేవకీ జైన్, ఉమా చక్రవర్తి, సుభాషిణి అలీ, కవితా కృష్ణన్, మైమూనా మొల్లా, హసీనాఖాన్, రచన ముద్రబోయిన, షబ్నం హష్మీ తదితరులున్నారు. సహేలీ ఉమెన్స్ రిసోర్స్ సెంటర్, గమన మహిళా సమూహ, బేబాక్ కలెక్టివ్, ఆల్ ఇండియా పోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, ఉత్తరాఖండ్ మహిళా మంచ్, ఫోరమ్ అగైనెస్ట్ అప్రెషన్ ఆఫ్ ఉమెన్, ప్రగతిశీల మహిళా మంచ్, పర్చమ్ కలెక్టివ్, జాగృతి ఆదివాసీ దళిత్ సంగటన్, అమూమత్ సొసైటీ, డబ్ల్యూఓమ్ తదితర హక్కుల సంఘాలు కూడా ఈ లేఖపై సంతకాలు చేశాయి. ‘‘న్యాయం పట్ల మహిళల విశ్వాసాన్ని పెంపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
ఈ 11 మంది దోషులకు శిక్షల రెమిషన్ ను తక్షణమే రద్దు చేయాలని, వారందరూ తమ శిక్ష అనుభవించడంకోసం తిరిగి జైలుకు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాము.’’ అని ఆ లేఖ పేర్కొంది. జీవిత ఖైదు విధించబడిన ఈ పదకొండు మంది నేరస్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుండి బయటికి వొచ్చారు. గుజరాత్ ప్రభుత్వం తన రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి అనుమతించింది. వాళ్ళ విడుదలకు రెకమెండ్ చేసిన 10 మంది కమిటీలో 5 గురు బీజేపీ నేతలే ఉన్నారు. ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టు జనవరి 21, 2008న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన ఆరోపణలపై 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. అప్పటికి బిల్కిస్ బానో ఐదు నెలల గర్భిణి, గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్లో చెలరేగిన హింసాకాండ నుంచి తప్పించుకుని పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైంది. చనిపోయిన వారిలో ఆమె 3 ఏళ్ల కూతురు కూడా ఉంది.