ఈ ఎన్నికల్లో ప్రజలు…ప్రజాస్వామ్యం గెలవాలని బీజేపీ కోరిక
•రెండు పార్టీ అవినీతిని ప్రజలు బహిష్కరించాలి
•మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టిలను రాష్ట్రపతులను చేసిన ఘనత బిజెపిదే
•ప్రచార ఘట్టం పూర్తి…రేపు ప్రజాస్వామ్య పండుగ
•అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు ఓడిపోవాలనేదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష
•ప్రజలు సునామీలాగా బిజెపికి వోట్లేస్తారు
•మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసే పార్టీలకు, సామాజిక తెలంగాణకు అడ్డుగా ఉన్న పార్టీలకు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అడ్డుగా ఉన్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల చేతుల్లో ప్రజలు పడకూడదని సూచించారు. ప్రధాని మోదీచెప్నిట్లుగా తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వోటేయాలని, బీజేపీని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమైన వారని, ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన చరిత్ర వారిదని, నాడు నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు పోరాటం చేశాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఓవైపు కేసీఆర్ కుటుంబం, మరోవైపు సోనియా గాంధీ కుటుంబం..రెండు పార్టీల అవినీతిని ప్రజలు బహిష్కరించాల్సిందిగా ఆయన కోరారు. వారు అబద్ధాలతో, కుట్రలతో, కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేశారన్నారు. కొందరు పథకం ప్రకారం బీజేపీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే.. ప్రజలే తిప్పికొట్టారని, నిజమైన తెలంగాణ మిత్రులెవరో, ఎవరి ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందో గుర్తించి.. బీజేపీ వెంట నడుస్తున్నారన్నారు. ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి రోజురోజుకూ బీజేపీకి ఆదరణ పెరిగిందని, తాము ఊహించినదాని కంటే అద్భుతమైన స్పందన వొస్తుందని, మోదీ, అమిత్ షా, నడ్డా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు..కొత్త ఊపునిచ్చాయన్నారు. తమ అభ్యర్థులకు కూడా ప్రచారంలో మంచి ఆదరణ లభిస్తుందన్నారు.
తమది ప్రజా టీమ్ అని, బడుగు వర్గాలకు పెద్దపీట వేసే టీమ్ అని, ప్రజాస్వామ్యం కోసం పనిచేసే టీమ్ అని, తెలంగాణ అభివృద్ధి చేసే టీమ్ అనే ప్రజలు ఆదరించారన్నారు. సోమవారం రోడ్ షోలోనూ..90 శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని డబ్బుతో, మద్యంతో కొనేందుకు.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రయత్నం చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరికీ సరైన బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు. ప్రతిరోజూ విషప్రచారం చేశారని, బీజేపీ అంటే వారిద్దరికీ అభద్రతాభావం పెరిగిందని, వారిద్దరి మధ్య ఒప్పందంతో..వ్యూహాత్మకంగా బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేశారన్నారు. ఈ సర్వేలు తమ కార్యకర్తల మనోబలాన్ని, తమ సంకల్పాన్నీ ఏమాత్రం కదిలించలేకపోయాయని, తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బదీయ లేకపోయయాయన్నారు. ప్రజలు తమకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నారని, రేపు 30న సునామీలాగా ప్రజలు తమకు అనుకూలంగా వోటేస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3న బీజేపీ భారీ విజయంతో అధికారంలోకి రానుందని, అందులో సందేహం లేదన్నారు.
స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ సీఎం ఈ గడ్డపై బాధ్యతలు తీసుకోబోతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు, యువత, మహిళలు.. రైతులు, కార్మికులు తమకు అండగా నిలుస్తున్నారన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆడబిడ్డలు కూడా బీజేపీని ఆదరిస్తున్నారన్నారు. పాతచింతకాయ పచ్చడిలాగా..అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అవే అసత్యాలు మాట్లాడారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. వారికి మజ్లిస్ తెలీదు, రాజకీయాలు తెలియదని, వారిద్దరికీ కనీస రాజకీయ అవగాహన కూడా లేదని, మజ్లిస్.. బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందా..రాహుల్ గాంధీ కనీసం వొచ్చేముందైనా.. వాస్తవాలు తెలుసుకోవాలి కదా..అని ఎద్దేవా చేశారు. మజ్లిస్‌ను పెంచిపోషించింది వారి కుటుంబమేనని, ముస్లింలీగ్‌ను ఈ దేశంలో ఎవరు పెంచి పోషించారో..ఎవరి కారణంగా దేశ విభజన జరిగిందో తెలుసునని, దానికి వారి కుటుంబమే కారణం కాదా…అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో భాగంగా..చెన్నారెడ్డిని గద్దెదించేందుకు మజ్లిస్‌ను ఎగదోసి భాగ్యనరగంలో మతకల్లోలాలు చేసింది కాంగ్రెస్ కాదా..అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మంత్రులు మజ్లిస్ పార్టీ అనుమతి లేకుండా..పాతబస్తీలో తిరగలేరని, హైదరాబాద్‌లో పోస్టింగ్‌లు కావాలనుకునేవారికి ఇచ్చేది మజ్లిస్ పార్టీ అనుమతితోనేనని, వారు ఆర్డర్లు ఇవ్వడం నిజం కాదా…అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 50 ఏండ్లుగా తెలంగాణ పట్ల వివక్షత చూపిన కాంగ్రెస్‌కు, గత పదేండ్లుగా కాంగ్రెస్ లాగానే దోపిడీ చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తే..అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని, 1969లో 369 మంది విద్యార్థులను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమని, మలిదశ ఉద్యమంలో 1200 మందిని పొట్టనపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ..అంటూ దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్‌ఎస్ కాదా…అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ రెండు పార్టీలు అధికారంలోకి వొస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందని, ఆర్థిక విధ్వంసం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇవన్నీ తెలంగాణ విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని సూచించారు. పదేళ్లుగా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచిన పార్టీ బీఆర్‌ఎస్ అని, ఈ పార్టీలకు సరైన గుణపాఠం చెబుతూ.. బీజేపీకి అండగా నిలవాలని కిషన్ రెడ్డి కోరారు. తాము మోదీ గ్యారంటీతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని, సామాజిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల తెలంగాణ ఏర్పాటు కోసం పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి తాను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని, వోటేసేముందు ప్రతి బీసీ బిడ్డ.. గుండెమీద చేయివేసుకుని ఆలోచించాలని కోరారు. ఈ రోజు బీసీ సీఎం తెలంగాణకు అవసరమని, కాబట్టి ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలన్నారు.
బిసిలకు• వివిధ రకాల పార్టీలతో సాన్నిహిత్యం ఉండొచ్చునని, ఏదేమైనా.. బీసీ సీఎం చేసే మంచి అవకాశాన్ని చేజార్చుకోకండని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతా ఆలోచించాలని, యూపీఎస్సీ తరహాలో.. ఏమాత్రం అవినీతికి తావులేకుండా.. నియామక ప్రక్రియ చేపడతామని భరోసా ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుం•న్నారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మెడికల్ కాలేజీల విషయంలో మళ్లీ మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారని, కేసీఆర్ తెలంగాణ బిడ్డ అయితే.. కనీసం 30 లేఖలైనా చూపించాలని, కులాల మధ్య వైరుధ్యం కోసమే బీసీ సీఎం అని కేటీఆర్ మాట్లాడటం.. ఆయనకు రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనమని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే బీజేపీ..మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలను రాష్ట్రపతులను చేసిందన్నారు. తెలంగాణ భద్రంగా ఉండాలంటే.. తమ కుటుంబమే అధికారంలో ఉండాన్న కేటీఆర్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారి కబంధ హస్తాల నుంచి రాష్ట్రం బయటపడాలని, అమరవీరుల ఆకాంక్షలు రావాలంటే..బీఆర్‌ఎస్ పోవాలని, వీళ్ల డిపాజిట్లు గల్లంతు కావాలని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.