మన్యం పోరాటాలకు మనుగడ ఏది
ఆజాదీ కా అమృతోత్సవం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులను సంస్మరించుకునే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది అల్లూరి సీతారామరాజు 125 వ జయంతుత్సవాలను, పలు కార్యక్రమాలను ఇటీవల భీమవరం, మోగల్లు, లంబసింగి ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 75 ఏళ్ల తరువాత మరుగున పడిన స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకోవడం మహద్బాగ్యం. ఈ సందర్భంలో మన్నెం వీరుడు అల్లూరి బ్రిటీష్ వారిని ఎదిరించిన తీరు, ఆయన మన్యం పోరాట స్ఫూర్తిని గుర్తించి ఆదివాసీ ప్రాంతాలలో వారికే స్వయంపాలన కన్పించడం చిరకాలమైన వారి న్యాయమైన డిమాండ్. అల్లూరి పోరాటం ప్రారంభించి ఆగష్టు 22 నాటికి వందేళ్ళు నిండిన సందర్భంలో అల్లూరిని స్మరించుకోవడం అనివార్యం.
భారత దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి , తెల్లదొరల పెత్తనంపై విప్లవ శంఖం పూరించి , ఉద్యను పోరులోనే అసువులు బాసిన అమర వీరుల్లో అల్లూరి సీతారామరాజు పిన్నవయస్కుడు. ప్రత్యేకించి విశాఖ మన్యం ప్రాంతంలోని ఆదివాసీల మనుగడ కోసం , వారి స్వయం పాలన కోసం ఆదివాసీల సారధ్యంలో బ్రిటీష్ పాలకులను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి. ఆయన 1922 – 1924 మధ్యకాలంలో సాగించిన సమరమే ‘ మన్యం పోరాటం ‘ గా స్థిరపడింది. స్వరాజ్య సమరంలో గిరిజనోద్యమాలకు చరిత్ర సుస్థిరమైనది. అవి ఆసేతుహిమాచల పర్యంతం జరిగాయి. గోండ్వానా ప్రాంతంలో రాంజీ గోండు పోరాటం (1850 – 60), మహారాష్ట్రలో బిర్సాముండా ఉద్యమం (1894 %–% 1900) , ఆంధ్రప్రదేశ్ లో దారబంధాల చంద్రయ్య పితూరీ (1870 – 1880 ) మచ్చుకు కొన్ని ఉద్యమాలు అల్లూరి పోరాటం కంటే ముందే జరిగాయి. మన రాష్ట్రంలో అల్లూరి మన్యం పితూరిని తొలి చరిత్రాత్మక మైనదిగా పేర్కొంటున్నారు.
సీతారామరాజు అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. ఆయన 1897, జులై 4న విశాఖ జిల్లాలోని పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ ఇంట వెంకట రామరాజు, సూర్య నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. శ్రీ రామరాజు బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో గడిచింది. 1902లో వెంకట రామరాజు కుటుంబం మొదట రాజమహేంద్రవరం , తండ్రి మరణానంతరం నరసాపురానికి మారింది. అల్లూరి విద్యాభ్యాసం కాకినాడ , తుని , రాజమండ్రి , విశాఖ పట్నంలో సాగినా విప్లవభావాలకు ప్రభావితుడైన సీతారామ రాజు ఆంగ్ల విద్యపై ఆసక్తి చూపక విలువిద్య , గుర్రపు స్వారీ , హస్త సాముద్రికం , యోగా వంటి విద్యల్లో నైపుణ్యం సాధించాడు. ప్రముఖ స్వాతంత్య్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలతో ప్రభావితుడైన అల్లూరి 17 ఏళ్ల చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్ సందర్శించాడు. ఆ రోజుల్లో బెంగాల్ , పంజాబ్ ప్రాంతాలు జాతీయ విప్లవకారులకు నిలయాలుగా విలసిల్లాయి.
శ్రీ రామరాజులో స్వాతంత్రేచ్ఛతో పాటు ఆధ్యాత్మిక భావాలు వికసించాయి. కృష్ణదేవి పేటలోని నీలకంఠేశ్వర మందిరంలో ఉంటూ ఆ పరిసరాల్లో ఉంటున్న భగత , కొండదొర, కోయ గిరిజనులతో చెలిమి చేశాడు. అల్లూరి సేవా గుణం , ప్రవర్తనకు ముగ్ధులైన ఆదివాసులు ఆయన మాటను శిలాశాసనంగా భావించారు. ఆ అభిమతంతోనే ఆదివాసులకున్న మూఢ నమ్మకాలను , దుర్గుణాలను పోగొట్టి ఉద్యమ స్పూర్తిని రగిలించాడు. అల్లూరి పేరు విషయంలో ఒక వాదన ఉంది. ఉద్యమ బాటలో ప్రేమ అడ్డురాకూడదని అల్లూరి , తనను ప్రేమించిన సీతను వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటూనే , పేరులో ‘ శ్రీ ‘ బదులుగా ‘ సీతా ‘ రామరాజు గా మార్చుకున్నట్లు చెబుతున్నారు.
బ్రిటీష్ పాలక ప్రతినిధులు , తాబేదార్లు ఆదివాసుల శ్రమ శక్తిని దోచుకుంటున్న తరుణంలో అల్లూరి ఆదివాసీల్లో నవ చైతన్యం నింపి , తెల్లదొరలపై తిరుగుబాటు పంథాను నూరిపోశాడు. మన్యం పోరాటం ద్వారా స్వాతంత్య్ర సమరానికి అనువైన సంప్రదాయ ఆయుధాలకు పదును పెట్టాడు. రంపచోడవరం , కృష్ణదేవిపేట , తుని , అన్నవరం ప్రాంతాల్లోని కొండ జాతి గిరిజన భాధితులందరూ రామరాజు నాయకత్వాన్ని బలపరిచారు. అల్లూరి పోరాటానికి దన్నుగా ఆదివాసీ ప్రజల నుంచి గంటందొర , మల్లుదొర , అగ్గిరాజు , సింగన్న , పడాలు… వంటి ఆదివాసీ వీరులు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి నడిపించారు. తెల్లదొరల చెర నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి గాంధీ చేపట్టిన అహింసా విధానాన్ని అల్లూరి మొదట సమర్ధించినా , తరువాతి కాలంలో విప్లవం వైపు మొగ్గు చూపాడు.
‘ స్వరాజ్యం నా జన్మహక్కు ‘ అని తిలక్ నినదిస్తే ‘ విప్లవమే నా జన్మహక్కు ‘ అంటూ అల్లూరి గర్జిస్తూ వలస పాలకుల గుండెల్లో విప్లవాన్ని రగిలించాడు. మన్యం ప్రాంతంలోని ఆదివాసులపై వలస పాలకులు సాగిస్తున్న దురాగతాలు అల్లూరిని తీవ్రంగా కలచి వేశాయి. ఆదివాసుల్లో విప్లవ చైతన్యాన్ని నింపి , ఆదివాసీ ప్రజల సహకారంతోనే అల్లూరి తన మన్యసీమ పోరాటం విశాఖ మన్యం నుండి ఆరంభించారు. బ్రిటీష్ ముష్కరులు అల్లూరిని బందిపోటుగా చిత్రించి ప్రచారం చేయడంతో 1922 , ఆగష్టు 22 నుండి ఆదివాసీల నాయకుల సహకారంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధపడక తప్పలేదు. బహిరంగంగా ప్రకటించి మరీ పోలీసు ఠాణాలపై దాడులు సాగించి ఆయుధాలు పట్టుకెళ్లడం వంటివి చేస్తూ బ్రటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. మన్యం పోరాటంలో తొలి రోజున 300 మంది గిరిజనులతో కలిసి చింతపల్లి పోలీస్ ఠాణాపై దాడి చేసి ఆయుధాలు పట్టుకెళ్లారు. ఆగస్టు 23న కృష్ణదేవి పేట , 26న రాజవొమ్మంగి (తూ.గో) , అక్టోబర్ 15వ అడ్డతీగల , అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ రాణాలపై వరుసగా దాడులు జరపడం ప్రకంపనలు సృష్టించింది. 1923, ఏప్రిల్ 17న అన్నవరం , మే 31న కొయ్యూరు రాణాలపై దాడుల అనంతరం మన్యం పోరాటాన్ని తీవ్రమైనదిగా పరిగణించిన పాలకులు మలబార్ పోలీసులతో పాటు అస్సాం రైఫిల్స్ ను రంగంలోకి దించారు. పోలీసు బలగాల సంఖ్య పెరగడంతో మన్యం పోరాట బలం కాస్త సన్నగిల్లింది. కొయ్యూరు సమీపంలోని నడింపల్లె వద్ద అల్లూరికి కుడిభుజంగా భావించే మల్లుదొరను బంధించిన పోలీసులు , అల్లూరిని పట్టిచ్చిన వారికి బహుమతినిస్తామని ప్రకటించారు.
1924లో గుంటూరు కలెక్టర్ గా వచ్చిన రూథర్ ఫర్డ్ ను ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. అల్లూరిని పట్టివ్వాలంటూ రూథర్ ఫర్డ్ కొండమీద, కొండ కిందున్న మన్యం ప్రజలపై దమన కాండ సాగించాడు. అల్లూరి ఈ ఉద్యమం వల్ల మన్యం గిరిజనులకు ఇబ్బంది కలగడం పట్ల ఓసారి మదన పడ్డాడు. 1924, మే 7న సూర్యోదయ వేళ అల్లూరిని అరెస్టు చేసి, మంప సమీపంలోని రాజేంద్ర పాలెం పుంత దారిలో చెట్టుకు కట్టేసి, మేజర్ గూడాల్ దారుణంగా కాల్చి చంపాడు. రామరాజు 26 ఏళ్ల వయసులోనే వీర మరణం పొందాడు. ఇలా రామరాజు తెల్లదొరల గుండెల్లో సింహ స్వప్నంగా మిగిలాడు. అగ్గిరాజుగా పేరొందిన వేగిరాజు సత్య నారాయణరాజు అండమాన్ జైలులో మరణించాడు.
స్వాతంత్య్రానంతరం సత్యనారాయణ రాజు తరం జైలు నుండి విడుదలైన మల్లుదొర 1952లో జరిగిన తొలి భారత ఎన్నికల్లో విశాఖ పట్నం పార్లమెంటు సభ్యునిగా గెలుపొందారు. మన్యం పోరాటం ఇరవై నెలల వీరోచిత పోరాటమే అయినా అల్లూరి ఉద్యమ స్ఫూర్తి మన్నెం గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అతి చిన్నవయసులో దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అల్లూరి త్యాగాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించక పోవడం విచారకరం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ లో భాగంగా అల్లూరి దేశభక్తిని గుర్తించి జయంతుత్సవాలను నిర్వహిస్తుండటం గర్వించదగ్గ విషయం. అలాగే మన్యం పోరాటాలకు సరైన గుర్తింపునిస్తూ గిరిజన ప్రాంతాలలో ఆదివాసీల పరిపాలనను సమర్ధించే పెసా వంటి చట్టాలను, పోడు భూముల రక్షణ చట్టాలను అమలు చేయాలి.
– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక, 9491318409