ఆగస్ట్‌లో హైదరాబాద్‌కు భారీ వర్ష ముప్పు

రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు
మాసాంతంలోనూ అతి వర్షాలు
ఐఎండీ అధికారుల హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు మరో గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్‌ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు బుధవారం తెలిపారు. ముఖ్యంగా నెల చివరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఆగస్ట్‌ 15 నుంచి 30 మధ్యకాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. భారీ వర్షాల కారణంగా అసిఫాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 282.4 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం (280.7 మిల్లీవిూటర్ల) కంటే స్వల్పంగా ఎక్కువ వర్షపాతం నమోదైందన్నమాట. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ డేటా ప్రకారం జూన్‌ మొదటి రెండు వారాల్లో భారీ వర్షాలు కురిశాయి.

జూన్‌ చివరి వారంలో అధిక వర్షపాతం నమోదైంది. జులైలో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. జులై చివరివారంలో లోటు వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో రానున్న 2 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది.

ప్రాజెక్టులు నిండుతుండటంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. నిర్మల్‌, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలకు మోస్తరు వర్ష సూచనను ప్రకటించారు. హైదరాబాద్‌లో రానున్న రెండ్రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని..సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురుస్తాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page